సచిన్ కొడుకు @ 50 వికెట్లు అర్జున్ అరుదైన రికార్డ్

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సాధించని రికార్డులే లేవు.. రెండు దశాబ్దాలకు పైగా ప్రపంచ క్రికెట్ ను శాసించాడు. అయితే సచిన్ వారసుడిగా అర్జున్ టెండూల్కర్ ఇంకా పూర్తిస్థాయిలో తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. బ్యాట్ తో కాకున్నా బంతితో ఎక్కువగా రాణిస్తున్నాడు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 25, 2024 | 09:18 PMLast Updated on: Dec 25, 2024 | 9:18 PM

Sachins Son Arjuns Rare Record Of 50 Wickets

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సాధించని రికార్డులే లేవు.. రెండు దశాబ్దాలకు పైగా ప్రపంచ క్రికెట్ ను శాసించాడు. అయితే సచిన్ వారసుడిగా అర్జున్ టెండూల్కర్ ఇంకా పూర్తిస్థాయిలో తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. బ్యాట్ తో కాకున్నా బంతితో ఎక్కువగా రాణిస్తున్నాడు. ఆల్ రౌండర్ గానే గోవా జట్టులో కొనసాగుతున్న అర్జున్ టెండూల్కర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో వికెట్ల వేటను మొదలుపెట్టాడు. తాజాగా అర్జున్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్.. ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.

తద్వారా వైట్ బాల్ క్రికెట్‌లో అర్జున్ టెండూల్కర్ 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 2021లో ముంబై తరఫున దేశవాళీ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన అర్జున్ టెండూల్కర్ 41 వైట్ బాల్ మ్యాచ్‌ల్లో 51 వికెట్లు పడగొట్టాడు. 17 లిస్ట్ ఏ మ్యాచ్‌లో ఈ లెఫ్టార్మ్ పేసర్ 24 మంది బ్యాటర్లను ఔట్ చేశాడు. 24 టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ క్రికెట్‌లోకి రాకముందు అర్జున్ టెండూల్కర్ ముంబై తరఫున జూనియర్ లెవెల్ క్రికెట్ ఆడాడు. అండర్ 19 జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. 2022/23 రంజీ సీజన్‌కు ముందు అర్జున్ టెండూల్కర్ ముంబై నుంచి గోవాకు మారాడు. గోవా తరఫునే లిస్ట్-ఏతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో అర్జున్ టెండూల్కర్ 37 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలో ఒకసారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఐపీఎల్ మెగావేలంలో అర్జున్ ను ఏ ఫ్రాంచైజీ కొనలేదు. కానీ చివరి నిమిషంలో ముంబై ఇండియన్స్ 30 లక్షల కనీస ధరకు అతన్ని దక్కించుకుంది. అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ 2023లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు పడగొట్టాడు.