Sake Bharti: కూలీకి వెళ్తూనే పీహెచ్‌డీ.. ఈమె జీవితం ఎందరికో ఆదర్శం..
ఆకలి కష్టపడటాన్ని అలవాటు చేస్తుంది. ఆలోచన బతకడాన్ని నేర్పిస్తుంది. లక్ష్యం జీవితాన్ని విజయ మార్గంలో నడిపిస్తుంది. దీనికి నిలువెత్తు నిదర్శనం ఈ మహిళ.
రోజువారీ కూలీగా ఎండనకా, వాననకా చెమటోడ్చింది. చదువుపై ఉన్న ఆసక్తితో అహోరాత్రాలూ శ్రమించింది. ఉన్నతంగా నిలబడాలన్న తపనతో.. కెమిస్ట్రీలో పీహెచ్‌డీ సాధించింది. ఇదేమీ సినిమా కాదు.. సాకే భారతి అనే ఓ మహిళ జీవితం. అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డం అనే ఓ మారుమూల పల్లెకు చెందిన భారతి సాధించిన విజయం ఇది. చిన్న చిన్న సమస్యలకే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న చాలామందికి.. భారతి జీవితం ఓ ఆదర్శం.. ఓ అద్ధం కూడా ! గట్టిగా అనుకోవాలే కానీ.. సాధ్యం కానిది ఏదీ ఉండదు.. ఏదీ అడ్డు రాదు అని ప్రూవ్ చేసింది భారతి. దృఢ సంకల్పానికి, కృషికి ఈమె నిదర్శనంగా నిలుస్తోంది.
భారతికి చిన్నప్పటి నుంచి చదువంటే ఇష్టం. చదువుకునే అవకాశం కానీ, పై చదువులు చదివించే స్థోమతలేని తల్లిదండ్రుల కోరికను కాదనలేక పెళ్లి చేసుకునేందుకు తల వంచింది. ఇంటర్ గవర్నమెంట్ కాలేజీలో చదివిన భారతి.. ఆ తర్వాత తన మేనమామను పెళ్లి చేసుకుంది. పెళ్లైన తర్వాత ఏడాదికే ఆమెకు మొదటి బిడ్డ పుట్టింది. ఐతే చదువుకోవాలనే కోరికను భారతి చంపుకోలేకపోయింది. చదువు ద్వారానే ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయని భావించింది. చదువుకోవాలనే తన కల నెరవేరే పరిస్థితి.. అత్తగారింట్లో కూడా కనిపించలేదు. దీంతో వ్యవసాయ కూలీగా మారింది. కూలీ పనులు చేస్తూ చదువుకోవాలి అనుకుంది. భార్యగా, తల్లిగా, బాధ్యతలు నిర్వర్తిస్తూనే కూలి పనులకు వెళ్తూ చదువుకోవడం ప్రారంభించింది. అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో రసాయన శాస్త్రంలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
ప్రతిరోజూ ఇంటి పనులను పూర్తి చేసిన తర్వాత తెల్లవారుజామున నిద్రలేచి, పని లేదా కళాశాలకు వెళ్తుంది. తన గ్రామానికి 30కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి వెళ్లేందుకు కొద్దిదూరం నడిచి బస్సు ఎక్కాల్సి వచ్చేది. అయినా ఎప్పుడూ నిరుత్సాహ పడలేదు. ఆమె ఉత్సాహాన్ని చూసిన ఓ లెక్చరర్.. శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేయమని ప్రోత్సహించారు. ప్రొఫెసర్ ఎంసీఎస్ శుభ దగ్గర బైనరీ మిక్చర్స్ అంశంపై పరిశోధనకు అవకాశం లభించింది. ఉపకార వేతనం భారతికి కొంత సాయపడింది. చదువుకోవాలని తనకు ఉన్నా… భర్త శివప్రసాద్ ప్రోత్సాహం లేనిదే ఇక్కడ వరకు వచ్చేదాన్ని కానని భారతి వినయంగా చెప్తోంది. భారతి జీవితం ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శం. చిన్న కష్టం వచ్చిందని ఆగిపోయే ఎంతోమందికి.. భారతి ప్రయాణం స్ఫూర్తిదాయకం.