ఆస్ట్రేలియా టూర్ లో భారత బ్యాటర్ల ఆటతీరు ఏం మారలేదు. సిరీస్ చేయాలంటే బాగా ఆడాల్సిన చివరి టెస్టులోనూ మన బ్యాటర్లు చేతులెత్తేశారు. పాత కథనే రిపీట్ చేస్తూ తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బ్యాటర్ల ఫ్లాప్ షోతో టీమిండియా 185 పరుగులకే ఆలౌటైంది. రిషబ్ పంత్ 40 రన్స్ తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోహ్లి సహా కీలక బ్యాటర్లందరూ నిరాశపరిచారు. నాలుగో టెస్ట్ హీరోలు యశస్వి జైస్వాల్‌తో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫెయిలవడంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. కాగా సిడ్నీ టెస్ట్‌కు రోహిత్ శర్మ దూరం కావడంతో బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాను ఆస్ట్రేలియా పేసర్లు బోలాండ్‌తో పాటు స్టార్క్ దెబ్బకొట్టారు. లంచ్ బ్రేక్ లోపే జైశ్వాల్, రాహుల్ , గిల్ ఔట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. తర్వాత కోహ్లీ కూడా వెనుదిరిగాడు. మరోసారి ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి వికెట్ సమర్పించుకున్నాడు. నిజానికి కోహ్లీకి అంతకుముందే ఒక లైఫ్ వచ్చింది. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను కోహ్లీ వెంటాడగా.. స్లిప్‌లో ఉన్న స్మిత్ వైపు దూసుకెళ్లింది. అయితే అతను బంతిని అందుకునే క్రమంలో నేలకు తాకడంతో అంపైర్ నాటౌటిచ్చాడు. అయితే ఆ లైఫ్ ను విరాట్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. క్రీజులో ఉన్నంతసేపు అంత కాన్ఫిడెంట్ గా కనిపించలేదు. చివరికి 17 రన్స్ కు ఔటయ్యాడు. తర్వాత జడేజాతో కలిసి పంత్ టీమిండియా స్కోరును వంద పరుగులు దాటించాడు. ఆస్ట్రేలియా పేస్ ను ఎదుర్కొంటూ క్రీజులో నిలిచారు. అయితే టీ బ్రేక్ తర్వాత ఆసీస్ బౌలర్లు మళ్ళీ పైచేయి సాధించారు. పంత్‌తో పాటు తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిని బొలాండ్ ఒకే ఓవర్‌లో ఔట్ చేసి టీమిండియాకు పెద్ద షాకిచ్చాడు పంత్ 40 రన్స్ చేయగా...నితీష్ డకౌటయ్యాడు. చివరలో బుమ్రా మూడు ఫోర్లు, ఓ సిక్సర్లతో కాసేపు ఆస్ట్రేలియా బౌలర్లకు కౌంటర్ ఇచ్చాడు. బుమ్రా 17 బాల్స్‌లో 22 రన్స్ చేయగా... ఆస్ట్రేలియా బౌలర్లలో బోలాండ్ నాలుగు, స్టార్క్ మూడు వికెట్లు తీసుకున్నారు. కాగా చివరి టెస్టులోనూ నిరాశపరిచిన భారత బ్యాటర్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ వెల్లువెత్తింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, గిల్ , రాహుల్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఈ సిరీస్ లో 2-1 ఆధిత్యంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఖవాజా వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసింది. రెండోరోజు భారత బౌలర్లు కంగారూలను ఎలా కట్టడి చేస్తారనేది చూడాలి. [embed]https://www.youtube.com/watch?v=WIanhB1FSDY[/embed]