TOP STORY: ఇక నా టైమ్ బ్రో, విమర్శలకు సంజూ చెక్

ఎంతో ప్రతిభ ఉన్న క్రికెటర్... బీసీసీఐ అతనికి అన్యాయం చేస్తోంది... దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణించినా సెలక్టర్లు పట్టించుకోవడం లేదు.. ఇదీ కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ కెరీర్ తొలినాళ్ళలో అభిమానుల ఆవేదనతో కలిపిన ఆగ్రహం... క్రమంగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి... కానీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో సంజూ విఫలమయ్యాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 13, 2024 | 06:22 PMLast Updated on: Oct 13, 2024 | 6:22 PM

Sanju Samson Best Innings In His Career

ఎంతో ప్రతిభ ఉన్న క్రికెటర్… బీసీసీఐ అతనికి అన్యాయం చేస్తోంది… దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణించినా సెలక్టర్లు పట్టించుకోవడం లేదు.. ఇదీ కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ కెరీర్ తొలినాళ్ళలో అభిమానుల ఆవేదనతో కలిపిన ఆగ్రహం… క్రమంగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి… కానీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో సంజూ విఫలమయ్యాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న ఒత్తిడో..మరో కారణం తెలీదు కాని పలు సందర్భాల్లో నిరాశపరిచాడు. అతని కోసం సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపైనా, సెలక్టర్లపైనా విమర్శలు చేసిన వారే మౌనంగా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఐపీఎల్ లో మాత్రం ప్రతీ సీజన్ లో దుమ్మురేపుతున్నా అంతర్జాతీయ మ్యాచ్ లలో మాత్రం ఆకట్టుకోలేకపోవడం సంజూ శాంసన్ కు మైనస్ గా మారింది. అదే సమయంలో జట్టులోకి వచ్చిన పలువురు యువ క్రికెటర్లు సత్తా చాటడంతో ఒకదశలో ఈ కేరళ క్రికెటర్ భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. అయితే ఇదే చివరి ఛాన్స్ కావొచ్చేమో అనుకున్న దశలో బంగ్లాదేశ్ తో సిరీస్ కు ఎంపికయ్యాడు. రిషబ్ పంత్ కు సెలక్టర్లు రెస్ట్ ఇవ్వడంతో ప్రధాన వికెట్ కీపర్ గా ఎంపికైన సంజూ శాంసన్ తొలి రెండు మ్యాచ్ లలో భారీ ఇన్నింగ్స్ లు ఆడలేకపోయాడు. ఓపెనర్ గా జట్టు భారీస్కోరుకు మంచి పునాది వేయాల్సిన బాధ్యత ఓపెనర్లదే… అయితే తొలి రెండు టీ ట్వంటీల్లో సంజూ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు.

బ్యాకప్ ఓపెనర్లు లేకపోవడంతో హైదరాబాద్ టీ ట్వంటీకి కూడా సంజూకు ఛాన్స్ దక్కింది. జట్టులో చోటు నిలవాలంటే తప్పనిసరిగా రాణించాల్సిన పరిస్థితిలో సంజూ శాంసన్ దుమ్మురేపేశాడు. ఇక్కడ జట్టు కంటే కూడా తన కెరీర్ కొనసాగాలంటే ఖచ్చితంగా గుర్తిండిపోయే ఇన్నింగ్స్ ఆడాల్సింది. ఈ లక్ష్యంతోనే బరిలోకి దిగిన సంజూ ఉప్పల్ స్టేడియంలో బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. తనపై ఉన్న ఒత్తిడిని చిత్తు చేస్తూ హైదరాబాద్ లో శివతాండవం ఆడేశాడు. అది కూడా 40 బంతుల్లో సెంచరీ… వరల్డ్ టీ ట్వంటీ క్రికెట్ లో నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీ అది…నిజానికి ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసినా కూడా సంజూ శాంసన్ ప్రత్యేకంగా నిలిచేవాడు కాదు… దీనిని బాగా అర్థం చేసుకున్న ఈ కేరళ క్రికెటర్ శతకంతో చెలరేగిపోయాడు. ముఖ్యంగా 10వ ఓవర్లో అతను కొట్టిన వరుస ఐదు సిక్సర్లు ఈ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచాయి. టీ ట్వంటీ అంటేనే పరుగుల పండుగ… ఫ్యాన్స్ బౌండరీలు, సిక్సర్లనే ఆస్వాదిస్తారు. దీంతో ఉప్పల్ లాంటి ఫ్లాట్ వికెట్ పై ఒకే ఒవర్లో ఐదు భారీ సిక్సర్లు బాదేసి అభిమానులకు దసరా కిక్ ఇచ్చాడు.

2015లో జింబాబ్వేతో సిరీస్‌తో అరంగేట్రం చేసిన సంజూ ఈ పదేళ్ల నుంచి ఆడిన మ్యాచ్‌లు కేవలం 32 మాత్రమే. కేవలం రెండు హాఫ్ సెంచరీలే చేయగలిగాడు. సగటు కూడా టీ ట్వంటీ ఫార్మాట్ కు తగ్గట్టు లేకపోవడమే సంజూ ప్లేస్ ను కూడా సందిగ్ధంగా మార్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోడన్న ముద్ర అతడిపై పడిపోయింది. ఎట్టకేలకు కెరీరే ప్రమాదంలో పడిన స్థితిలో అతడు అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అదరగొట్టేశాడు. ఇది బంగ్లాదేశ్ పై భారత్ వైట్ వాష్ విజయానికి కారణమవడంతో పాటు సంజూ శాంసన్ కెరీర్ ను కూడా నిలబెట్టిందని చెప్పాలి. టీ20ల్లో మొదటి సెంచరీ సాధించిన సంజూ.. రోహిత్‌శర్మ తర్వాత ఫాస్టెస్ట్ హండ్రెడ్ కొట్టిన భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.

ఐపీఎల్ లో ఎంత సత్తా చాటినా జాతీయ జట్టులో ఆడకుంటే ప్లేస్ నిలవడం కష్టమే…కెరీర్ ఆరంభం నుంచీ తన సహజశైలి ఆటను అంతర్జాతీయ స్థాయిలో చూపలేకపోయిన సంజూ శాంసన్ ఎట్టకేలకు హైదరాబాద్ వేదికగా దానిని బయటకు తీసుకొచ్చాడు. ఈ ఇన్నింగ్స్ ను స్టేడియంలో ఫ్యాన్స్ తో పాటు సంజూ ఫ్యాన్స్ కూడా బాగా ఆస్వాదించారు. ఇక సంజూ టైమొచ్చిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కివీస్ తో సిరీస్ తర్వాత సౌతాఫ్రికా టూర్ లోనూ ఈ కేరళ క్రికెటర్ జోరు ఇలాగే కొనసాగితే టీ ట్వంటీ జట్టులో ప్లేస్ సుస్థిరం చేసుకోవచ్చు.