గ్యాప్ రాలేదు..ఇచ్చాడంతే, సఫారీ గడ్డపై సంజూ విధ్వంసం

సెంచరీ తర్వాత రెండు డకౌట్లు.. ఇంకేముంది సంజూ శాంసన్ ది మళ్ళీ అదే కథ...ఇలాగే అవకాశాలు వేస్ట్ చేసుకుంటూ ఉంటాడు.. ఇదీ మూడో టీ ట్వంటీ తర్వాత సంజూ గురించి వినిపించిన కామెంట్స్...ఎంతో టాలెంట్ ఉండీ అవకాశాలు లేటుగా వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవడంలో ఈ కేరళ క్రికెటర్ విఫలమయ్యాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 16, 2024 | 05:45 PMLast Updated on: Nov 16, 2024 | 5:45 PM

Sanju Samson Best Performance In South Africa Tour

సెంచరీ తర్వాత రెండు డకౌట్లు.. ఇంకేముంది సంజూ శాంసన్ ది మళ్ళీ అదే కథ…ఇలాగే అవకాశాలు వేస్ట్ చేసుకుంటూ ఉంటాడు.. ఇదీ మూడో టీ ట్వంటీ తర్వాత సంజూ గురించి వినిపించిన కామెంట్స్…ఎంతో టాలెంట్ ఉండీ అవకాశాలు లేటుగా వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవడంలో ఈ కేరళ క్రికెటర్ విఫలమయ్యాడు. కానీ ఇదే ఆఖరి అవకాశం అన్న కామెంట్స్ వినిపించినప్పుడు తనలో బ్యాటింగ్ సత్తాను ప్రపంచ క్రికెట్ కు మళ్ళీ రుచి చూపించాడు. అది కూడా టీ ట్వంటీల్లో 50, 60 కాదు.. ఏకంగా సెంచరీ బాదేశాడు. బంగ్లాదేశ్ పై హైదరాబాద్ వేదికగా ఈ సెంచరీ కొట్టాడు. ఈ ప్రదర్శనతో సౌతాఫ్రికా టూర్ కు ఎంపికయ్యాడు. మళ్ళీ సఫారీ టూర్ లో తొలి టీ ట్వంటీలోనే శతకంతో దుమ్మురేపేశాడు. సఫారీ గడ్డపై ఆ దేశ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ శతక్కొట్టాడు. టీ ట్వంటీల్లో వరుసగా రెండు శతకాలు చేసిన భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.

కానీ ఈ రెండు సెంచరీల తర్వాత కథ మళ్ళీ మొదటికొచ్చింది. వరుసగా రెండు డకౌట్లు.. అది కూడా ఒకే బౌలర్ కు.. ఒకే రీతిలో వికెట్ ఇచ్చుకున్నాడు. దీంతో మళ్ళీ విమర్శలు మొదలయ్యాయి. ఇక వాండరర్స్ స్టేడియం వేదికగా చివరి టీ ట్వంటీలో మాత్రం సునామీ ఇన్నింగ్స్ ఆడేశాడు. రెండు డకౌట్ల నుంచి వచ్చిన కసితో ఎడాపెడా బాదేశాడు. 51 బంతుల్లో మళ్ళీ సెంచరీ కొట్టేశాడు. అతని సెంచరీ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 8 సిక్సర్లున్నాయి. అంటే 72 పరుగులు బౌండరీ రూపంలోనే వచ్చాయి. ఈ క్రమంలో సంజూ శాంసన్ రికార్డుల మోత మోగించాడు. అంతర్జాతీయ టీ ట్వంటీల్లో మూడు శతకాలు చేసిన రెండో భారత క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. గత ఐదు టీ ట్వంటీల్లో అతనికిది మూడో సెంచరీ. టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ లో అత్యధిక సెంచరీలు కొట్టిన జాబితాలో సంజూ శాంసన్ ఐదో ఆటగాడిగా నిలిచాడు.

అటు తిలక్ వర్మ కూడా రెచ్చిపోవడంతో ఈ మ్యాచ్ లో భారత్ భారీస్కోరు చేసింది. వీరిద్దరూ పోటాపోటీగా సిక్సర్లు, బౌండరీలు బాదేయడం హైలెట్ గా నిలిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఫోర్ కొడితే నేను సిక్సర్ కొడతా అన్న రీతిలో వీరి బ్యాటింగ్ సాగింది. ఓవరాల్ గా జోహనెస్ బర్గ్ వాండరర్స్ స్టేడియం సంజూ, తిలక్ విధ్వంసంతో ఊగిపోయింది. సఫారీ ఆటగాళ్ళు కొన్ని క్యాచ్ లను వదిలేయడం కూడా కలిసొచ్చింది. సఫారీ కెప్టెన్ మక్ర్ రమ్ ఏడుగురు బౌలర్లు ఉపయోగించినా సంజూ , తిలక్ లను కట్టడి చేయలేకపోయాడు. తానే స్వయంగా బౌలింగ్ కు దిగినా ఫలితం లేకపోయింది. సఫారీ బౌలర్లు ఓవర్ కు 14 రన్స్ కు పైగా సమర్పించుకున్నారు. ఓవరాల్ గా భారత్ 284 పరుగులు చేయగా.. సంజూ శాంసన్ 109 , తిలక్ వర్మ 120 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. కాగా సంజూ శాంసన్ ఇన్నింగ్స్ చూసిన ఫ్యాన్స్ గ్యాప్ రాలేదు జస్ట్ ఇచ్చాడంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.