Santiniketan: ‘శాంతినికేతన్’ కు విశ్వ ఖ్యాతి.. ‘యునెస్కో’ గుర్తింపు వెనుక మహాకవి
‘జనగణమన’ను స్వరపరిచి భారతావనికి జాతీయ గీతంగా అందించిన నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ అలనాడు నిర్వహించిన శాంతినికేతన్ విద్యా నిలయానికి అరుదైన గుర్తింపు దక్కింది.
మన మహాకవి రవీంద్రుడి కీర్తి ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. ‘జనగణమన’ను స్వరపరిచి భారతావనికి జాతీయ గీతంగా అందించిన నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ అలనాడు నిర్వహించిన శాంతినికేతన్ విద్యా నిలయానికి అరుదైన గుర్తింపు దక్కింది. దానికి ‘యునెస్కో’ ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు లభించింది. దీంతో మన దేశం నుంచి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరిన చారిత్రక స్థలాల సంఖ్య 41కి పెరిగింది. ఈతరుణంలో శాంతినికేతన్ కు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం..
రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి చేతులమీదుగా..
పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో శాంతినికేతన్ భవనం ఉంది. ఈ భవనాన్ని భువన్ మోహన్ సిన్హా అనే స్థానిక జమీందారు నిర్మించాడు. దీంతో ఆ జమీందారు పేరిట భవనాన్ని ‘భువన్ డాంగా’ అని పిలిచేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి బ్రహ్మసమాజ ప్రచారకుడు మహర్షి దేవేంద్రనాథ్ 1862లో ఈ భవనాన్ని చూసి ఇష్టపడ్డారు. ఈవిషయాన్ని జమీందారుకు చెప్పి.. 1 రూపాయి అడ్వాన్స్ పై తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఈ బిల్డింగ్ కు ‘శాంతినికేతన్’ అని పేరు మార్చారు. “శాంతినికేతన్” అనే పదానికి అర్థం.. శాంతికి నిలయం. మహర్షి దేవేంద్రనాథ్ ఆధ్వర్యంలో శాంతినికేతన్ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. అక్కడికి అన్ని మతాల ప్రజలు వచ్చి ధ్యానం, ప్రార్థనలు నిర్వహించేవారు. బ్రహ్మసమాజ పద్ధతులను మహర్షి దేవేంద్రనాథ్ ఫాలో అయ్యేవారు.
ఎంతోమంది ఘనులను దేశానికి ఇచ్చి..
మహర్షి దేవేంద్రనాథ్ కుమారుడు రవీంద్రనాథ్ ఠాగూర్ కు 1913లో నోబెల్ బహుమతి లభించింది. 1921లో ఆయన ‘శాంతినికేతన్’ పేరును విశ్వ భారతి విశ్వవిద్యాలయంగా మార్చారు. తన తండ్రి భావజాలంతో ముందుకు సాగారు. అణగారిన వర్గాల ప్రజలకు విద్య ఇచ్చేందుకు విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని నడిపారు. తొలుత ఏడుగురు విద్యార్థులతో విశ్వభారతి విశ్వవిద్యాలయంలో శిక్షా సత్రాన్ని ఠాగూర్ స్థాపించారు. ఆ తర్వాత అక్కడ చదువుకున్న విద్యార్థుల సంఖ్య వందలు, వేలకు పెరిగింది. ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్న ప్రముఖ వ్యక్తుల జాబితాలో సత్యేంద్ర నాథ్ బోస్ కూడా ఉన్నారు. ఈయన భారతదేశ విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త. విశ్వభారతి విశ్వవిద్యాలయంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ అనేక కీలకమైన సమావేశాలు నిర్వహించారు. మహాత్మా గాంధీతో ఇక్కడ చాలాసార్లు భేటీ అయ్యారు. స్వాతంత్య్రానంతరం తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా ఈ భవనంలోనే ఠాగూర్‌ను కలుసుకుని చర్చలు జరిపారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తన జీవితం చివరి వరకు విశ్వభారతి విశ్వవిద్యాలయం భవనంలోని ఒక గదిలోనే సామాన్య జీవితం గడిపారు. ఇంత ఘన చరిత్రకు కేరాఫ్ అడ్రస్ గా ఉండబట్టే .. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలోకి శాంతినికేతన్ భవనం చేరింది.
శాంతినికేతన్ కు ఇలా వెళ్లి రండి..
పశ్చిమ బెంగాల్ లోని బిర్భూమ్ జిల్లా బొల్పూర్ సబ్ డివిజన్ బోల్పూర్ నగరానికి పొరుగున శాంతి నికేతన్ ఉంది. కలకత్తా నుంచి సరిగ్గా 165 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శాంతినికేతన్ కు వాయు మార్గంలో రావాలనుకునే వారు.. పశ్చిమ బంగాల్ లోని కలకత్తా ఎయిర్ పోర్ట్ (నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్) కు చేరుకుని శాంతి నికేతన్ కు రోడ్డు మార్గంలో వెళ్లొచ్చు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా శాంతినికేతన్ కు క్యాబ్స్ ఉంటాయి. బెంగాల్ లోని కోల్ కతా నుంచి బోల్పూర్ కు రైలులో వెళ్లాలి. అక్కడి నుంచి శాంతినికేతన్ కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.