న్యూజిలాండ్ కు షాక్ కేన్ మామ ఔట్ ?
భారత పర్యటనకు సిద్ధమవుతున్న న్యూజిలాండ్ జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. లంక టూర్ ముగిసిన వెంటనే టిమ్ సౌథీ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా... ఇప్పుడు వరుస గాయాలు కివీస్ ను వెంటాడుతున్నాయి.
భారత పర్యటనకు సిద్ధమవుతున్న న్యూజిలాండ్ జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. లంక టూర్ ముగిసిన వెంటనే టిమ్ సౌథీ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా… ఇప్పుడు వరుస గాయాలు కివీస్ ను వెంటాడుతున్నాయి. తాజాగా సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ భారత్ తో టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉండడంపై సందిగ్ధత నెలకొంది. గాయంతో బాధపడుతున్న కేన్ మామా సిరీస్ ఆరంభ సమయానికి కోలుకోవడం అనుమానంగానే కనిపిస్తోంది. కేన్ గాయం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విశ్రాంతి ఇవ్వడమే ఉత్తమంగా భావిస్తున్నట్టు కివీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. తొలి టెస్టులో విలియమ్సన్ ఆడే అవకాశం లేదని వెల్లడించింది. తర్వాతి మ్యాచ్ లకు కోలుకుని జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నట్టు కివీస్ బోర్డు ఆకాంక్షించింది. లంకతో రెండో టెస్ట్ సమయంలోనూ విలియమ్సన్ గాయంతో ఇబ్బంది పడ్డాడు.
ఇదిలా ఉంటే కేన్ విలియమ్సన్ స్థానంలో బ్యాకప్ ఆటగాడిగా మార్క్ చాప్‌మన్ ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ తరఫున ఇప్పటివరకు 23 వన్డేలు, 76 టీ20లు ఆడిన చాప్‌మన్ టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతనికి 41.9 సగటు ఉంది. ఉపఖండ పిచ్‌లపై స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలడనే ఉద్దేశంతో సెలక్టర్లు అతనికి అవకాశం ఇచ్చారు. మరోవైపు తన భార్య రెండో బిడ్డకు జన్మనిస్తున్న నేపథ్యంలో మైకేల్ బ్రేస్‌వెల్ తొలి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. చివరి రెండు టెస్టులకు అతని స్థానంలో ఇష్ సోథి ఎంపికయ్యాడు.
ఇటీవల శ్రీలంక పర్యటనలో సిరీస్ ను 0-2తో చేజార్చుకున్న న్యూజిలాండ్ కు భారత్ తో సిరీస్ చాలా కీలకంగా మారింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే కివీస్ ఈ సిరీస్ గెలవాల్సిందే. అయితే భారత్ గడ్డపై న్యూజిలాండ్ కు ఉన్న పేలవ రికార్డు దృష్ట్యా అది అంత ఈజీ కాదు. ఇరు జట్ల బలాబలాలను చూసుకుంటే టీమిండియానే ఈ సిరీస్ లో ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఇటీవల బంగ్లాదేశ్‌ను 2-0తో చిత్తు చేసిన భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. రోహిత్ సేన ఇంకా 8 టెస్టులు ఆడాల్సి ఉండగా.. నాలుగు మ్యాచ్ లు గెలిస్తే ఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది. కాగా అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో
భారత్ మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ టూర్ ముగిసిన తర్వాత ఆసీస్ పర్యటనకు వెళ్ళనున్న టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది.