T Congress: కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికకు 9 కండిషన్లు..

కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చేందుకు 9 నిబంధనలు పాటించాలని కొంతమంది సీనియర్లు సూచిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 3, 2023 | 01:12 PMLast Updated on: Sep 03, 2023 | 1:12 PM

Seniors Who Imposed 9 Conditions For The Mla Candidate In The Congress Party

ఎన్నికల వేళ కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తోంది. అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇందులోంచి క్యాండిడేట్స్‌ను ఫైనల్‌ చేసేందుకు రకరకాల కండిషన్స్‌ ఫాలో అవుతున్నారు హస్తం పార్టీ పెద్దలు. పార్టీ టికెట్ ఇచ్చేందుకు 9 నిబంధనలు పాటించాలని కొంతమంది సీనియర్లు సూచిస్తున్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ దృష్టిలో పెట్టుకొని.. ఒక కుటుంబంలో ఎంతమందికి ఇస్తారనే దానిపైన జోరుగా పార్టీలో చర్చ సాగుతోంది. తమతో పాటు, తమ కుటుంబసభ్యుల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. దీంతో ఉదయపూర్‌లో జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ సభలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

కుటుంబంలోని మరో వ్యక్తి ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా పని చేస్తే వారికి మినహాయింపు ఉంటుందని తీర్మానించారు. ఇక 9 కండిషన్స్‌ గురించి ఒక్కసారి ఆరా తీస్తే.. అందులో మొదటిదే ఉదయపూర్ డిక్లరేషన్ తప్పకుండా అమలు చేయడం. మూడుసార్లు వరుసగా ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వొద్దు. 2018 శాసనసభ ఎన్నికల్లో ఇతర పార్టీ గుర్తులతో పోటీ చేసిన వారికి టిక్కెట్ ఇవ్వొద్దు. క్షేత్రస్థాయిలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వారికి, యువకులకు ప్రాధాన్యం ఇవ్వాలి. చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చే ప్యారాచూట్ నేతలకు టికెట్లు నిరాకరించాలి. క్షేత్రస్థాయిలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వారికి యువకులకు ప్రాధాన్యం ఇవ్వాలి. పార్టీ అనుబంధ సంఘాల నేతలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి.

ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చే రీతిలో వ్యవహరించవద్దు. రాహుల్ గాంధీ ఆమోదంతో పార్టీలోకి వచ్చిన కొందరికి మినహాయింపు ఇవ్వాలి. దరఖాస్తులు తీసుకుంటున్నారు కదా అని దరఖాస్తు చేసిన వారిని, పార్టీలో క్రియాశీలక సభ్యత్వం లేని వారిని ప్రాథమిక స్థాయిలోనే తొలగించాలి. పీసీసీలోని మొత్తం సభ్యులు 50శాతం మందికి పైగా టికెట్లు ఆశించని వారు ఉండాలి. ఇలా రకారకాల నిబంధనలు పాటిస్తున్నారు. వీటి ఆధారంగా వచ్చిన దరఖాస్తులను జల్లెడ పట్టి.. అధిష్టానానికి ఓ జాబితా పంపించబోతున్నారు తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు.