వేలంలోకి పలువురు కెప్టెన్లు కొనేందుకు కొత్త టీమ్స్ రెడీ

ఐపీఎల్ మెగావేలం ఈ సారి ఆసక్తికరంగా ఉండబోతోంది. చాలా మంది స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రాబోతున్నారు. అలాగే కొందరు యువ ఆటగాళ్ళు రిటెన్షన్ జాబితాలోనే జాక్ పాట్ కొట్టబోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 28, 2024 | 07:40 PMLast Updated on: Oct 28, 2024 | 7:40 PM

Several Captains Up For Auction New Teams Ready To Buy

ఐపీఎల్ మెగావేలం ఈ సారి ఆసక్తికరంగా ఉండబోతోంది. చాలా మంది స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రాబోతున్నారు. అలాగే కొందరు యువ ఆటగాళ్ళు రిటెన్షన్ జాబితాలోనే జాక్ పాట్ కొట్టబోతున్నారు. అదే సమయంలో పలువురు కెప్టెన్లు కూడా ఈ సారి తమ పాత ఫ్రాంచైజీలను వీడనుండగా.. కొందరిని ఫ్రాంచైజీలే తప్పిస్తున్నాయి. రిటెన్షన్ జాబితా డెడ్ లైన్ ముంచుకొస్తున్న వేళ ఐపీఎల్ వర్గాల సమాచారం ప్రకారం కనీసం ఐదుగురు కెప్టెన్లు వేలంలోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. యాజమాన్యంతో ఒప్పందాలు కుదరక కొందరు కెప్టెన్లు వేలంలోకి వస్తుండగా, మరికొందరు ఫ్రాంచైజీల వ్యూహాలతో మెగా ఆక్షన్‌కు వస్తున్నారు. ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్ కెఎల్ రాహుల్ కు గుడ్ బై చెప్పేసినట్టు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రాకున్నా… రాహుల్ ను వదిలేసిన లక్నో ఐదుగురిని రిటైన్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. రాహుల్ తో గత సీజన్ లో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రవర్తించిన తీరే దీనికి కారణంగా అర్థమవుతోంది.

అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఆ ఫ్రాంచైజీకి గుడ్ బై చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పంత్ ను కెప్టెన్ గా తప్పించి అక్షర్ పటేల్ కు బాధ్యతలు అప్పగించాలన్నది ఢిల్లీ ఆలోచన. అయితే దీనిపై పంత్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. అలాగే రిటెన్షన్ మొత్తం 18 కోట్లు కూడా తనకు తక్కువగా ఉందంటూ పంత్ ఢిల్లీ యాజమాన్యంతో చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ను కొనసాగించుకునేందుకు మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపడ లేదు. అదే సమయంలో ఇటీవల పంత్ కు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ధోనీ వారసుడిగా రిషబ్ పంత్‌ని తయారు చేసుకోవాలని చెన్నై ఫ్రాంఛైజీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రుతురాజ్ కెప్టెన్ గా చెన్నైని అంచనాలకు తగ్గట్టు నడిపించలేకపోతుండడంతోనే పంత్ పై కనేసినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ కు కూడా ఆ ఫ్రాంచైజీ గుడ్ బై చెప్పడం ఖాయమైంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధావన్ ఐపీఎల్ లో కొనసాగడంపై స్పష్టత లేదు. ఒకవేళ వేలంలోకి వచ్చినా ఏ జట్టూ అతని కోసం బిడ్ వేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో ధావన్ ను వదిలేయనున్న పంజాబ్ అతని స్థానంలో శామ్ కరన్ ను సారథిగా నియమించే అవకాశముంది. అలాగే డుప్లెసిస్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలంలోకి వదిలేయడం ఖాయమైంది. వయసు రీత్యా ఈ సారి డుప్లెసిస్ ను కొనసాగించే అవకాశాలు లేవు. అలాగే కొత్త కెప్టెన్ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ కెెఎల్ రాహుల్, పంత్ పై కన్నేసినట్టు సమాచారం. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ కు రిటెన్షన్ జాబితా ప్రకారం తమ జట్టులో ఏ ఆటగాడిని విడిచిపెట్టాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కొనసాగించాలని ఇష్టం ఉన్నా కూడా వేరే ప్లేయర్స్ కోసం అతన్ని విడిచిపెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద కనీసం ఐదుగురు కెప్టెన్లు ఈ సారి మెగావేలంలోకి రాబోతున్నారు.