Shaktikanta Das: రూ. 500 నోట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..

గత నెల రూ. 2వేలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ వార్త వెలువడిన వెంటనే దాదాపు అందరూ తమ వద్ద ఉన్న రూ. 2వేలను బ్యాంకుల్లో, జ్యూవెలరీ షాపుల్లో, వైన్స్ షాపుల్లో, పెట్రోల్ బంకుల్లో మార్చుకునేందుకు క్యూ కట్టారు. ఇప్పటికే ముద్రించిన నోట్లల్లో సగానికి పైగా బ్యాంకుల్లో జమ అయినట్లు తెలిపింది. అలాగే రూ. 500, రూ. 1000 నోట్ల పై కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 8, 2023 | 06:18 PMLast Updated on: Jun 08, 2023 | 6:18 PM

Shaktikanta Das Press Meet

ప్రస్తుతం రూ. 500 నోట్ల పై వస్తున్న వార్తలను కొట్టిపడేస్తూ ఒక ప్రకటన వెల్లడించింది. రూ. 2వేలు లాగా రూ. 500 నోట్లను ఉపసంహరించుకోవడం, రద్దు చేయడం వంటి ఆలోచనలో ప్రస్తుతం ఆర్బీఐ లేదని స్పష్టం చేసింది. అలాగే ఇప్పుడు ఉపసంహరించుకున్న రూ. 2వేల కరెన్సీ స్థానంలో.. కొత్తగా రూ. 1000 నోట్లను తీసుకొచ్చే ఉద్దేశ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంతదాస్ తెలిపారు. దీంతో ఇప్పటి వరకూ వస్తున్న ఊహాగానాలకు తెరదించినట్లు అయ్యింది. అలాగే ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని కూడా తెలిపింది.

ఇక రూ. 2000 నోట్ల విషయానికి వస్తే.. మొత్తం ముద్రించిన వాటిలో 50శాతం నోట్లు బ్యాంకులకు వచ్చినట్లు వివరించింది. వీటి విలువ సుమారు రూ. 1.80 లక్షల కోట్లుగా తెలిపింది. గతంలో 2018 మార్చి 31 నాటికి రూ. 6.73 లక్షల కోట్లు విలువజేసే రూ. 2వేల నోట్లు వినియోగంలో ఉన్నట్లు అంచనా వేసింది. తాజాగా 2023 మార్చి 31 నాటికి వీటి విలువ భారీగా తగ్గినట్లు వివరించింది. అంటే రూ. 3.67 లక్షల కోట్ల రూపాయలు బయట మార్కెట్లో చలామణిలో ఉండగా ఇప్పటి వరకూ రూ. 1.80 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ అయినట్లు పేర్కొన్నారు.

ఇక మిగిలింది 1.87 లక్షల కోట్లుగా తెలుస్తోంది. ఇవి కూడా సెప్టెంబర్ నెలాఖరు వరకు వినియోగం నుంచి కనుమరుగౌతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. రూ. 2వేల నోట్ల ఉపసంహరణ చేసుకున్న నాటి నుంచి నేటికి 20 రోజులు పూర్తి అయ్యాయి. నెల తిరగకుండానే ఇంత మొత్తంలో బ్యాంకులకు వచ్చి చేరడం గమనార్హం. ఇలాగే నోట్ల మార్పిడిలో వేగం కొనసాగితే అనుకున్న గడువుకంటే కూడా ముందుగానే నోట్ల చలామణి కనిష్టానికి పడిపోతుందని చెప్పవచ్చు. గతంలో ఆర్బీఐ చెప్పిన దాని ప్రకారం మరో మూడు నెలల గడువు ఉంది. ఈ లోపు ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న రూ. 2వేలను మార్చుకునే అవకాశం ఉందని చెప్పక తప్పదు.

 

T.V.SRIKAR