రీఎంట్రీ అదిరిందిగా, నిప్పులు చెరిగిన షమీ
భారత క్రికెట్ ఫ్యాన్స్ కు జోష్ పెంచే న్యూస్... టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ రీ ఎంట్రీ అదిరిపోయింది. దాదాపు ఏడాది తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన షమీ 4 వికెట్లతో సత్తా చాటాడు. బెంగాల్ తరపున బరిలోకి దిగిన షమీ మధ్యప్రదేశ్ తో మ్యాచ్ లో తన పేస్ బౌలింగ్ సత్తా చూపించాడు.
భారత క్రికెట్ ఫ్యాన్స్ కు జోష్ పెంచే న్యూస్… టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ రీ ఎంట్రీ అదిరిపోయింది. దాదాపు ఏడాది తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన షమీ 4 వికెట్లతో సత్తా చాటాడు. బెంగాల్ తరపున బరిలోకి దిగిన షమీ మధ్యప్రదేశ్ తో మ్యాచ్ లో తన పేస్ బౌలింగ్ సత్తా చూపించాడు. ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా 19 ఓవర్లలో 54 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మధ్యప్రదేశ్ కెప్టెన్ శుభమ్ శర్మ వికెట్ తో పాటు శరాన్ష్ జైన్, కుమార్ కార్తికేయ వంటి కీలక వికెట్లు పడగొట్టాడు. ఫిట్ నెస్ లేని కారణంగా ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపికైన 18 మంది జట్టులో షమీ చోటు దక్కించుకోలేకపోయాడు. రంజీ ట్రోఫీలో సత్తా చాటి త్వరలోనే టీమిండియాలో ఎంట్రీ ఇవ్వాలని షమీ ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనిలో భాగంగానే తొలి మ్యాచ్ లోనే తన ఫామ్ నిరూపించుకోవడం ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.
స్వదేశంలో జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ భారత జట్టుకు దూరమయ్యాడు. చీలమండ గాయంతో సర్జరీ చేయించుకున్న ఈ సీనియర్ పేసర్ బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ లో ఉన్నాడు. ఫిట్ నెస్ సాధించేందుకు గత కొన్ని నెలలుగా తీవ్రంగా ప్రయత్నించాడు. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉంటాడని భావించినా ఫిట్ నెస్ సమస్యలతో కుదర్లేదు. ఆ తర్వాత న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులోకి రాలేకపోయాడు. రిస్క్ తీసుకుంటే గాయం మళ్ళీ తిరగెడుతుందన్న సూచనలతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అతన్ని ఎంపిక చేయలేదు. అయితే రంజీల్లో ఆడి జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలనుకున్న షమీ దానికి తగ్గట్టుగానే మధ్యప్రదేశ్ తో మ్యాచ్ లో బరిలోకి దిగాడు.
షమీ బౌలింగ్ దెబ్బకు మధ్య ప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 167 పరుగులకే కుప్పకూలింది. రీఎంట్రీని ఘనంగా చాటుకున్న షమీని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం సిరీస్ మధ్య సెలక్టర్లు ఎంపిక చేస్తారని భావిస్తున్నారు. ఆసీస్ లాంటి పేస్ పిచ్ లపై సీనియర్ బౌలర్ షమీ అవసరం ఖచ్చితంగా భారత్ కు అడ్వాంటేజ్ గా చెప్పాలి. పైగా కంగారూ గడ్డపై షమీకి అద్భుతమైన రికార్డుంది. 8 టెస్టుల్లో 31 వికెట్లు పడగొట్టిన షమీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం జట్టులోకి తిరిగి వస్తే భారత్ సిరీస్ గెలవడం ఖాయమని ఫ్యాన్స్ చెబుతున్నారు.