Sharath Babu: మరో చరిత్రగా నిలిచిపోయిన శరత్ బాబు సినీ ప్రస్తానం..
శరత్‌బాబు తీవ్ర అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చేరారు. ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో చనిపోయారని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడు ఆయన చెల్లెలు ఈ వార్తలను ఖండించారు. నెలరోజులకు పైగా ఏఐజీ హాస్పిటల్‌లో శరత్ బాబుకి చికిత్స అందించారు వైద్యులు. ఈరోజు ఉదయం నుంచి శరత్ బాబు ఆరోగ్యం మరింత క్షీణించింది. అప్పటికే అనేక పరీక్షలు జరిపిన వైద్యబృందం శరత్ బాబు కుటుంబ సభ్యులకు ఆయన మరణించినట్లు తెలిపారు. దీంతో ప్రముఖ నటుడు ఇకలేరనే వార్తను కుటుంబ సభ్యులు మధ్యాహ్నం మీడియాకు చెప్పారు.
సీనియర్ నటుడు శరత్‌బాబు వయసు 71 సంవత్సరాలు. శరీరం మొత్తం విషపూరితం (Sepsis) కావడంతో కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం సహా ఇతర అవయవాలు దెబ్బతిని శరత్‌బాబు మరణించారని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. శరత్‌బాబు భౌతికకాయాన్ని చెన్నై తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తెలుగు చలనచిత్ర ప్రముఖ నటుడు మురళీ మోహన్.. శరత్ బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఫిల్మ్ ఛాంబర్లో కొన్ని గంటలు అయినా ప్రముఖుల సందర్శనార్థం ఉంచాలని కోరారు. దీనికి వారు అంగీకరించడంతో ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాట్లు ప్రారంభించారు.
బాల్యం నుంచి సినీ ప్రయాణం
ఇక శరత్ బాబు జీవితం విషయానికొస్తే.. 1951 జులై 31న విజయశంకర దీక్షితులు, సుశీలాదేవి దంపతులకు శరత్‌బాబు జన్మించారు. శరత్‌బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. సత్యనారాయణ దీక్షితులు అని కూడా కొంత మంది చెబుతుంటారు. ఈయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస. కాన్పూర్ నుంచి శరత్‌బాబు కుటుంబం ఆమదాలవలసకు వలస వచ్చింది. ఆమదాలవలసలో రైల్వే క్యాంటీన్‌ను శరత్‌బాబు కుటుంబం నడిపేది. ఆ సమయంలో శరత్‌బాబు నాటకాల్లో నటించేవారు. విద్యాభ్యాసం మొత్తం ఆముదాలవలస, పలాస ప్రాంతాల్లో సాగింది. కాలేజీ రోజుల్లో చాలా నాటకాల్లో శరత్‌బాబు నటించారు. దీనికి గానూ అనేక ప్రశంసలు, గుర్తింపు లభించింది.
శరత్ బాబు ఎత్తుగా ఉండటంతో పోలీసు అవ్వాలనే ఆశ ఉండేది. దీనికి గానూ పరీక్షలు కూడా రాశారు. కంటి చూపు లోపంతో అడుగు దూరంలో ఎస్సై పోస్ట్ కు దూరం అయ్యారు. అదే క్రమంలో కాలేజి చదివే రోజుల్లో తన తోటి స్నేహితులు, లెక్చరర్స్ నీవు సినిమా హీరోలా ఉంటావు అందులో ప్రయత్నించు అంటూ ప్రేరణ కలిగించేవారు. కానీ ఇంట్లో తండ్రి దీనికి అంగీకరించలేదు. ఒకరోజు పేపర్లో నూతన నటీనటులు కావలెను అనే ప్రకటన చూసి మద్రాసు వెళ్లారు. శ్రీకాకుళం జిల్లాకే చెందిన ప్లే బ్యాక్ సింగర్ జి.ఆనంద్ శరత్‌బాబును మద్రాసు తీసుకువెళ్లారు. అప్పుడే ఈయన జీవితంలో కీలక మలుపు తిరిగింది. శరత్‌బాబు మద్రాసు వెళ్లిన అనతి కాలంలోనే సినిమాల్లో అవకాశం వచ్చింది. ఈయన నటించిన ప్రతి చిత్రం ఒక్కో మణిపూస అని చెప్పాలి. తెలుగు, తమిళ భాషల్లో నటించారు.
300కు పైగా సినిమాలు
1973 లో ‘రామరాజ్యం’ చిత్రం ద్వారా శరత్‌బాబు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. వెనువెంటనే దర్శకులు బిఎస్ ఆంజనేయులు కన్య వయసు అనే చిత్రం కోసం రామరాజ్యం సినిమాలోని కొందరిని ఎంపిక చేసుకున్నారు. అందులో శరత్ బాబు కూడా ఒకరు. అలా సినిమాలు చేస్తున్న తరుణంలో చేసిన చిత్రాలు అంత గుర్తింపు తీసుకురాలేదు. ఒకపక్క తెచ్చుకున్నడబ్బులు అయిపోయాయి. ఇంటికి వెళ్లలేని పరిస్థితి. అప్పుడే రమాప్రభ పరిచయం అయ్యారు శరత్ బాబుకి. ఇలా అవకాశాల కోసం వచ్చి ఇబ్బందులు పడుతున్న వారిని తన ఇంట్లో పెట్టుకొని అన్నం పెట్టేది. ఇలా అందరి రిలేషన్లకి భిన్నంగా వీరిరువురి జీవనం సాగేది. ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమలో పడ్డారు. కానీ ఈ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. వివాహం చేసుకోకుండా దాదాపు 13 సంవత్సరాల పాటూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారు.
ఆతరువాత 1987లో విడిపోయి తమిళ నటుడు ఎన్ ఎం నంబియార్ కూతురిని వివాహం చేసుకున్నారు. కె బాల చందర్ దర్శకత్వంలో 1978లో వచ్చిన తమిళ చిత్రం ‘నిళల్ నిజమగిరదు’తో శరత్ బాబు పాపులర్ అయ్యారు. ఇక తెలుగులో కె.బాలచందర్ దర్శకత్వంలోనే వచ్చిన ‘ఇది కథకాదు’ సినిమాతో శరత్ బాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వెనుదిరిగి చూసుకోవల్సి రాలేదు. ప్రతి ఏటా పది సినిమాలు చేస్తూ ఉండేవారు. అవకాశాలు వెల్లువలా వచ్చేవి. కమల్ హాసన్, జయసుధ, చిరంజీవిలతో కలిసి ఈ సినిమాలో శరత్ బాబు నటించారు. ‘మరో చరిత్ర’, ‘మూడు ముళ్ల బంధం’, ‘తాయారమ్మ బంగారయ్య’, ‘సీతాకోక చిలుక’, ‘శరణం అయ్యప్ప’, ‘స్వాతిముత్యం’, ‘సంసారం ఒక చదరంగం’, ‘అభినందన’, ‘కోకిల’, ‘ఆపద్భాందవుడు’, ‘సాగర సంగమం’, ‘బొబ్బిలి సింహం’, ‘అన్నయ్య’ వంటి సినిమాలు శరత్ బాబును స్టార్ యాక్టర్‌ను చేశాయి. తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఆయన 300కు పైగా సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. శరత్ బాబు మరణం యావత్ సినీ ప్రపంచానికి తీరని లోటు. తాజాగా మళ్ళీ పెళ్లి సినిమాలో కూడా నటించారు.
T.V.SRIKAR