Congress Party: వైఎస్ఆర్ బిడ్డతోనే టీ -కాంగ్రెస్ కు పూర్వవైభవం అని ముందుగానే భావించారా.. అలాంటప్పుడు విలీనానికి జాప్యం ఎందుకు..?

షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దమయ్యారు. దీనికి గల కారణాలు.. ఈ వ్యూహం వెనుక నడిచిన అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 13, 2023 | 09:19 AMLast Updated on: Aug 13, 2023 | 9:19 AM

Sharmila Ysr Telangana Party Merger With Congress Party Was Prepared Last Two Years Ago

వైఎస్ షర్మిల.. ఈ ఒక్క పేరు గత కొన్ని వారాలుగా తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త వైబ్రేషన్స్ కి కారణం అవుతున్నాయి. పార్టీ పెట్టిన అనతి కాలంలోనే ప్రజా క్షేత్రంలో ఏదో ఒక యాత్రల పేరుతో వెళ్లి ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఉవ్వెత్తున లేపేటందుకు తీవ్రంగా శ్రమించారు. అలాంటి పోరాటపటిమ ఉన్న మహిళ నేడు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతుంది. అయితే తాను నాయకురాలిగా ఎదగాలంటే తన ప్రభావాన్ని ఒక్కసారి సరిచూసుకోవాలని భావిస్తున్నారేమో. అందుకే తాను ఒంటరిగా వెళ్లేకంటే.. కాంగ్రెస్ తో వెళ్లడం సరైన నాయకత్వాన్ని మరింత పెంపొందించేందుకు దోహద పడుతుందేమో అన్న హూహాగానాలు తెరమీదకు వచ్చాయి. అందులో భాగంగానే షర్మిల కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.

రెండేళ్ళ క్రితమే ఈ కార్యాచరణకు బీజం

ఈ రకమైన రాజకీయాలకు కర్ణాటక వేదికగా నిలిచిందని చెబుతున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. కన్నడ నాట పేరొందిన రాజకీయ నాయకుడు ఎస్ ఎం క్రిష్ణ వాళ్ల కూతురి ఫాం హౌస్ నుంచే రాజకీయ క్రీడ ప్రారంభమైందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రత్యక్ష సాక్షులుగా కేవీపీ రామచంద్ర, డీకే శివకుమార్, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇదంతా కర్ణాటక ఎన్నికలకు ముందే వ్యూహ రచన చేసినట్లు గా అర్థం అవుతోంది. అందుకే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తరువాత డీకే శివకుమార్ ను షర్మిల కలిసి అభినందించారని తెలుస్తుంది. పైగా వైఎస్ కుటుంబంతో డీకే శివకుమార్ కి ఎన్నో ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందులో భాగంగానే షర్మిల పవర్ ను కాంగ్రెస్ కి దోహదపడేలా వ్యూహాలు రచించినట్లు తెలుస్తుంది.

షర్మిల వల్లే కాంగ్రెస్ కి ప్రయోజనం

తెలంగాణలో నేరుగా షర్మిలకు రాజ్యాధికారం అందించే స్థాయిలో ఓటుబ్యాంకు లేకపోయినా.. కొంతమేర ఆకర్షించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేర్లు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో, మండలాల్లో, జిల్లా స్థాయిలో పాతుకొని పోయాయి. ఆమె బిడ్డగా వారందరి ఓట్లను పోగు చేసుకునే అవకాశం ఉంది. ఈమె ఒంటరిగా పోయేకంటే కాంగ్రెస్ తో జతకలిసి ఎన్నికల బరిలో దిగడం వల్ల కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. నేటికీ తెలంగాణ వ్యాప్తంగా వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు. ఆ ఓటు మొత్తం షర్మిలకు కచ్చితంగా పడే అవకాశం ఉంది. ఆమె ఒంటరిగా వెళ్లినా ఏదైనా పార్టీతో వెళ్లినా ఆ ఓటు బ్యాంకును మాత్రం ఆమె సాధించగలరు. అందుకే ఓట్లను చీలకుండా షర్మిల కారణంగా గంపగుత్తగా కాంగ్రెస్ కి పడేలా కార్యాచరణ రచిస్తున్నారని చెప్పాలి. ఇలా చేయడం వల్ల క్రిష్టియన్ సామాజిక వర్గ ఓట్లు, వైఎస్ఆర్ ఓట్లు, రెడ్డి సామాజిక వర్గ ఓటు బ్యాంకును తనవైపు తిప్పకోవచ్చు. దీంతో కాంగ్రెస్ కి మరింత బలం చేకూరినట్లవుతుంది. అందుకే షర్మిలను కాంగ్రెస్ లోకి చాలా మంది ఆహ్వానిస్తున్నారు. ఈ రాజకీయ వ్యూహం ఫలిస్తే తెలంగాణలో చాలా వరకూ అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ చేతుల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది.

కోమటి రెడ్డి సానుకూలం, రేవంత్ రెడ్డి వ్యతిరేకం ఇందుకేనా..

ఇంతటి ఓటు బ్యాంకుతో పాటూ గతంలో ఆమె చేసిన దీక్షలు, ర్యాలీలు, యాత్రలు మరో మైలేజ్ గా చెప్పాలి. ఆమె వాహనాలపై దాడి చేసి పోలీస్ వ్యాన్ తో లాక్కెళ్లిన పరిస్థితిని రాష్ట్రం మొత్తం చూసింది. ఇది పార్టీకి ఉపయోగపడనప్పటికీ షర్మిల రాజకీయ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని సార్లు కేసీఆర్ పై మాటల దాడి చేసినప్పటికీ షర్మిల ముందు తక్కువే అనిపిస్తుంది. ఆమె చేసిన ధర్నాలు, రాజకీయ విమర్శలతో మీడియా అటెంక్షన్ చాలా బాగా ఆకర్షించారు. ఎంతలా అంటే ఈమె అధికారంలోకి రాదు పెట్టదు ఊరికే ఎందుకు ఇంత యాగి చేస్తోంది అని ప్రజల నుంచి ఇలాంటి మాటలు వినిపించాయి. ఇలా అన్న మాటలు ఈమెకు ప్లస్ గా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ లో భట్టి విక్రమార్క చేసిన పాదయాత్ర కొంత వరకూ కలిసి వచ్చే అంశం అయితే రేవంత్ రెడ్డి ఎలాంటి యాత్ర చేశారో కనిపించని పరిస్థితి నెలకొంది. ఒకవేళ కాంగ్రెస్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం చేస్తే షర్మిల చేసిన పొలిటికల్ ఈవెంట్స్ కి పీసీసీ లేదా ఎన్నికల కమిటీ ఛైర్మెన్ పదవి ఖాయంగా కనిపిస్తుంది. అంటే ఈమె రాక రేవంత్ కు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీనిని గమనించే రేవంత్ ఈమెకు వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం సాగుతుంది. అందుకే కోమటి రెడ్డి షర్మిలా విలీనాన్ని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తుంది.

T.V.SRIKAR