టీమిండియాకు షాక్, మెగాటోర్నీకి బుమ్రా డౌటే
కొత్త ఏడాదిని ఓటమితో ఆరంభించిన టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్ తో వైట్ బాల్ సిరీస్ లకు రెడీ అవుతోంది. ఇది ముగిసిన వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడబోతోంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీని ఈ సారి హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు.
కొత్త ఏడాదిని ఓటమితో ఆరంభించిన టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్ తో వైట్ బాల్ సిరీస్ లకు రెడీ అవుతోంది. ఇది ముగిసిన వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడబోతోంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీని ఈ సారి హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు. భారత్ పాక్ వెళ్ళేందుకు నిరాకరించడంతో మన మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగా జరగబోతున్నాయి.అయితే ఈ మెగా టోర్నీకి ముందు భారత్ కు షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. సిడ్నీ టెస్ట్ ఆడుతుండగా బుమ్రా గాయపడ్డాడు. వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బందిపడడంతో మ్యాచ్ మధ్యలోనే వైదొలగాల్సి వచ్చింది. వెంటనే స్కానింగ్ తీయించగా గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టు తెలిసింది. వైద్యుల సూచన ప్రకారం అతను సర్జరీ చేయించుకునే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే బుమ్రా న్యూజిలాండ్ వెళ్ళనున్నట్టు సమాచారం. సర్జరీ తర్వాత కనీసం 5 వారాల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. అదే జరిగితే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడం డౌటేనని భావిస్తున్నారు.
నిజానికి ముందు ఇంగ్లాండ్ తో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు అతడు దూరంగా ఉండనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ తో సిరీస్ లకు మాత్రమే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలిసింది. ఒకవేళ టీమ్ ఇండియా నాకౌట్ స్టేజ్ కు చేరుకుంటే మాత్రం అతడు అందుబాటులోకి వస్తాడని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే భారత జట్టు కు పెద్ద ఎదురుదెబ్బే. ఎందుకంటే గ్రూప్ స్టేజ్ లో భారత జట్టు పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ తో తలపడాల్సి ఉంటుంది. బుమ్రా గాయంతో మ్యాచ్ లకు దూరం కావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ పెద్ద టోర్నీలకు దూరమయ్యాడు. దీంతో భవిష్యత్ మేజర్ టోర్నమెంట్ ల కోసం, ఇప్పుడు బుమ్రాను జాగ్రత్తగా చూసుకోవడం బీసీసీఐకి పెద్ద సవాల్ గా మారింది.
పైగా బుమ్రా లేకుంటే మన పేస్ ఎటాక్ ఎంత బలహీనంగా ఉంటుందో ఇటీవల సిడ్నీ టెస్టులో తేలిపోయింది. సిరాజ్, హర్షిత్ రాణ, ఆకాశ్ దీప్ వంటి యంగస్టర్స్ ఉన్నప్పటకీ నిలకడగా రాణించలేకపోతున్నారు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా ఫిట్ నెస్ సమస్యలతో సతమతమవతుండడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం విజయ్ హజారే టోర్నీలో షమీ ఆడుతున్నా పూర్తిస్థాయి ఫిట్ నెస్ తో ఉన్నాడా అన్నది అనుమానమే… ఒకవేళ బూమ్రా, షమీలు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైతే భారత్ సెమీస్ చేరడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.