టీమిండియాకు షాక్, పంత్ కు గాయం ?
పింక్ బాల్ టెస్టులో ఘోరపరాజయం పాలైన టీమిండియా ప్రస్తుతం మూడో టెస్టుకు సన్నద్ధమవుతోంది. సిరీస్ సమంగా ఉన్న నేపథ్యంలో ఆధిక్యం పెంచుకునేందుకు ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే భారత్ ప్రాక్టీస్ లో బిజీగా గడుపుతోంది.
పింక్ బాల్ టెస్టులో ఘోరపరాజయం పాలైన టీమిండియా ప్రస్తుతం మూడో టెస్టుకు సన్నద్ధమవుతోంది. సిరీస్ సమంగా ఉన్న నేపథ్యంలో ఆధిక్యం పెంచుకునేందుకు ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే భారత్ ప్రాక్టీస్ లో బిజీగా గడుపుతోంది. అడిలైడ్ టెస్టు మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగియడంతో భారత్ గత రెండు రోజులుగా అడిలైడ్‌లోనే మూడో టెస్టు మ్యాచ్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయితే మూడో మ్యాచ్ కు ముందు భారత్ కు షాక్ తగిలింది. కీలక ఆటగాడు రిషబ్ పంత్ గాయపడినట్టు సమాచారం. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా పంత్ గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు వేసిన బంతి బ్యాటింగ్ చేస్తున్న రిషబ్ పంత్ హెల్మెన్‌ను తాకినట్లుగా తెలుస్తోంది. దీంతో పంత్ వెంటనే ప్రాక్టీస్‌ను ఆపివేశాడని, అతడికి వైద్యసాయాన్ని అందించారని సమాచారం.
అయితే.. పంత్ ఎలాంటి కంకషన్‌ను ఎదుర్కోలేదని నిర్ధారించుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ పక్కనే నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు సైతం వెంటనే తమ ప్రాక్టీస్‌ను ఆపి పంత్ వద్దకు వచ్చారని స్థానిక వార్త కథనాల ద్వారా అర్థమవుతోంది. కాస్త విరామం తీసుకున్న పంత్ తిరిగి బ్యాటింగ్‌ను మొదలు పెట్టాడని పేర్కొంది. కాగా.. పంత్ గాయంపై ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుత సిరీస్ లో పంత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 87 పరుగులు మాత్రమే చేశాడు. అయితే.. గబ్బా మైదానంలో పంత్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. 2021 పర్యటనలో గబ్బాలోనే పంత్ చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు. 89 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ తో భారత జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. దీంతో ఈ సారి కూడా పంత్ నుంచి అటువంటి ఇన్నింగ్సే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మరోవైపు వరుస పరాజయాలతో మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలనే భారత ఆశలు నెరవేరడం కాస్త కష్టంగా మారింది. ఓ దశలో వరుస విజయాలతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఈజీగా ఫైనల్ చేరేలా కనిపించిన భారత్, ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గత 5 మ్యాచుల్లో నాలుగింట ఓటమి పాలై ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం 57.29 విజయశాతంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా భారత్ ఫైనల్ చేరుకోవాలంటే ఆసీస్‌తో మిగిలిన మూడు టెస్టుల్లో విజయం సాధించాల్సి ఉంది.