హీరోయిన్‌కు ఇంతలా వేధించాలా.. ఏపీ ఐపీఎస్‌ల అరాచకాలు..
బాలీవుడ్ నటి వ్యవహారం.. ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండడంతో.. ఏపీ సీఎంవో స్పెషల్ నజర్ పెట్టింది. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న ఇద్దరు ఐపీఎస్‌లకు నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
బాలీవుడ్ నటి వ్యవహారం.. ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండడంతో.. ఏపీ సీఎంవో స్పెషల్ నజర్ పెట్టింది. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న ఇద్దరు ఐపీఎస్‌లకు నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. బాలీవుడ్ నటి వ్యవహారం బయటకు రావడంతో.. ఇప్పుడు ప్రతీ ఒక్కరు అవాక్కవుతున్నారు. ముంబైకి చెందిన సినీనటిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్న కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు ఒకరు.. ఆమెను పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడు. అధికారాన్ని ఉపయోగించి బాధితురాలితో పాటు.. ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసు పెట్టించి జైలుకు పంపించారు.
ఆ తర్వాత వారిని బెదిరించి, భయపెట్టి పెళ్లి మాటే ఎత్తబోమంటూ వారితో బలవంతంగా సంతకాలు చేయించుకుని పంపించేశారు. ఈ వ్యవహారంలో అన్ని వేళ్లూ.. అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, నాటి విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్నీ వైపే చూపిస్తున్నాయ్. ముఖ్యంగా ఐపీఎస్‌ల తీరు ఇప్పుడు ప్రతీ ఒక్కరికి కోపం తెల్పిస్తోంది. కృష్ణా జడ్పీ ఛైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు విద్యాసాగర్… కొన్నేళ్ల కింద హైదరాబాద్‌లో ఓ పెళ్లికి వెళ్లారు. అక్కడ ముంబైకి చెందిన నటితో పరిచయం అయింది. వారిద్దరూ ఏళ్ల తరబడి సన్నిహితంగా మెలిగారు.
తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా విద్యాసాగర్ ఒప్పుకోలేదు. ఈ ఏడాది జనవరిలో ఆమె నుంచి మరింతగా ఒత్తిడి పెరగటం, ఎన్నికల వేళ ఈ వ్యవహారం బయటపడితే తనకు, పార్టీకి మరింత నష్టం కలిగించే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని, నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయాలంటూ ఆయన నాటి విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణాను ఆదేశించారు. ఐతే సజ్జల ఆదేశాలతో కాంతిరాణా తన జోరు చూపించారు. ముంబై నటి, ఆమె ఫ్యామిలీపై విద్యాసాగర్ నుంచి కంప్లైంట్ తీసుకున్నారు. దాని ఆధారంగా ఇబ్రహీంపట్నం పీఎస్‌లో నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, బెదిరింపు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వెంటనే అప్పట్లో విజయవాడ డీసీపీగా పనిచేసిన విశాల్ గున్నీ, ఓ ఏడీసీపీ, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలతో టీమ్‌ను ముంబైకి పంపించారు. సినీనటిని, ఆమె తల్లిదండ్రుల్ని అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు. కోర్టు వారి ముగ్గురికీ రిమాండ్ విధించింది. జైలు నుంచి విడుదలయ్యాక పోలీసులు తీవ్రంగా బెదిరించారు. పెళ్లి మాటెత్తితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి.. వారితో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో బాధిత కుటుంబం దిక్కుతోచని స్థితిలో ముంబై వెళ్లిపోయింది.
ఫిబ్రవరిలో జరిగిన ఈ ఉదంతం ఆరు నెలల తర్వాత ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం… ఇంతలా దిగజారాలా.. ఇంత స్వార్థానికి ఒడిగట్టాలా.. ఓ కుటుంబాన్ని రోడ్డున పడేయాలా అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయ్. నిజానికి విజయవాడ పోలీసు కమిషనర్‌గా పనిచేసిన కాంతిరాణా తీరు మొదటి నుంచి వివాదాస్పదమే. వైసీపీ అరాచకాలకు కొమ్ము కాస్తారనే ఆరోపణలు ఉన్నాయ్. బాధితులపైనే రివర్స్ కేసులుపెట్టారన్న కంప్లైట్‌లు కూడా ఉన్నాయ్. వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కాంతిరాణా ఏ స్థాయిలో అరాచకాలు పాల్పడ్డారో చెప్పేందుకు.. నటి ఉదంతమే ఎగ్జాంపుల్ అంటూ చర్చ జరుగుతోంది. దీంతో ఇప్పుడు ఏపీ సీఎంవో ప్రత్యేకంగా దృష్టిసారించింది. కాంతిరాణాతో పాటు.. విశాల్ గున్నీకి నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.