మిగిలిన బౌలర్లు బాధ్యత తీసుకోరా ? బుమ్రాతోనే గెలవలేమన్న రోహిత్
అడిలైడ్ టెస్టులో భారత్ చిత్తుగా ఓడిపోవడంతో ఆస్ట్రేలియా సిరీస్ ను సమం చేసేసింది. తొలి టెస్టులో అదరగొట్టిన రోహిత్ సేన రెండో మ్యాచ్ లో మాత్రం కనీస పోటీ ఇవ్వలేకపోవడం ఆశ్చర్యపరిచింది.
అడిలైడ్ టెస్టులో భారత్ చిత్తుగా ఓడిపోవడంతో ఆస్ట్రేలియా సిరీస్ ను సమం చేసేసింది. తొలి టెస్టులో అదరగొట్టిన రోహిత్ సేన రెండో మ్యాచ్ లో మాత్రం కనీస పోటీ ఇవ్వలేకపోవడం ఆశ్చర్యపరిచింది. బ్యాటర్ల వైఫల్యం… బౌలర్లలో బూమ్రా తప్పిస్తే మిగిలిన వారంతా అనుకున్న స్థాయిలో రాణించకపోవడం కొంపముంచింది. సిరాజ్ 4 వికెట్లు పడగొట్టినా సరైన టైమ్ లో జట్టుకు బ్రేక్ త్రూ ఇవ్వలేకపోయాడు. ఫలితంగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ కు భారీ ఆధిక్యం దక్కింది. ఓవరాల్ గా బూమ్రాపై ఎక్కువ భారం పడుతుందన్నది వాస్తవం.. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇదే కామెంట్ చేశాడు. మిగిలిన బౌలర్లు కూడా బాధ్యత తీసుకోవాలంటూ ఫైర్ అయ్యాడు. బుమ్రా మినహా ఇతర బౌలర్ల ప్రదర్శన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రతిసారి బుమ్రాపై భారం వేయలేమన్నాడు. ప్రతి ఒక్క బౌలర్ బాధ్యత తీసుకోవాలంటూ సీరియస్ గా చెప్పాడు.అతని వర్క్‌లోడ్‌ను మిగిలిన బౌలర్లు కూడా పంచుకోవాలని సూచించాడు.
ఒక్క బౌలర్‌తోనే మ్యాచ్ ఆడట్లేదని, రెండు ఎండ్‌ల నుంచి బుమ్రాతోనే బౌలింగ్ వేయించలేమన్నాడు. జట్టును గెలిపించే బాధ్యత సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి…ప్రతి ఒక్కరూ తీసుకోవాలని హిట్ మ్యాన్ వ్యాఖ్యానించాడు. సిరీస్‌లోని అయిదు టెస్టుల ఆడటం కోసం బుమ్రాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని రోహిత్ చెప్పాడు. స్పెల్ ముగిసిన అనంతరం ప్రతిసారి బుమ్రా వద్దకు వెళ్లి, పనిభారం గురించి తెలుసుకుంటున్నామని చెప్పాడు. బుమ్రా తాజాగా ఉంటే అయిదు టెస్టులు ఆడగలడని, అందుకే అతని పనిభారం, బౌలింగ్‌ను విశ్లేషిస్తున్నామని రోహిత్ వెల్లడించాడు. రోజంతా బుమ్రాతోనే బౌలింగ్ చేయించలేమని, ఇతర బౌలర్లు కూడా ముఖ్యమేనని వ్యాఖ్యానించాడు.
ప్రతి బౌలర్‌కు ఎంత ఓపిక ఉందని, ఎన్ని ఓవర్లు వేయగలిగే సామర్థ్యం ఉందని పరిశీలిస్తున్నామని అన్నాడు. కొందరు టెస్టుల్లో ఇటీవలే అరంగేట్రం చేశారని, వాళ్లకు మద్దతు ఇవ్వడం ముఖ్యమన్నాడు. ఇదిలా ఉంటే రెండో టెస్టులో బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓడిపోయామని రోహిత్ చెప్పాడు. పింక్ బాల్‌తో ఎక్కువ ఆడిన అనుభవం లేకపోయినా.. తమ ఓటమికి దాన్ని సాకుగా చూపడం లేదని స్పష్టం చేశాడు. మూడో టెస్టులో బలంగా పుంజుకునే ప్రయత్నం చేస్తామన్నాడు. పింక్ బాల్ టెస్టులో మరోసారి భారత బ్యాటర్లు విఫలమైన వేళ ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో గెలిచింది.