Siddharth Luthra: చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా ట్రాక్ రికార్డ్ తెలుసా
చంద్రబాబు నియమించుకున్న లాయర్ లూథ్రా సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగారు.

Siddharth Luthra is recognized as a person who argued sensational cases in the country
స్కిల్ డివలప్‌మెంట్ కార్పోరేషన్ స్కామ్.. ఇప్పుడు ఏపీలో కొనసాగుతున్న హాట్ టాపిక్ ఇది. ఈ కేసులో చంద్రబాబు తరఫున వాదనలు వినిపించేందుకు దేశంలో పేరుపొందిన క్రిమినల్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రాను పిలిపించారు. చంద్రబాబును ఈ కేసు నుంచి గట్టెక్కించేందుకు లూథ్రా భారీమొత్తంలో ఫీజ్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కేవలం ఫీజ్ మాత్రమే కాదు. ఢిల్లీ నుంచి ఆయన వచ్చేందుకు ప్రత్యేక విమానం, తిరిగేందుకు లగ్జరీ కారు, ఉండేందుకు ఫైవ్ స్టార్ హోటల్ ఇలా రాజభోగాలు సిద్ధం చేశారు. ఇంత ఖర్చుచేసి మరీ లూథ్రాను తీసుకువచ్చారు అంటే ఆయన అంత పెద్ద లాయరా.. అసలు ఆయన బ్యాంగ్రౌండ్ ఏంటి అనే చర్చ మొదలైంది.
నిజానికి సిద్ధార్థ్ లూథ్రా చంద్రబాబు కేసు వాదించడం ఇది మొదటిసారి కాదు. గతంలో వచ్చిన ఓటుకునోటు కేసు కూడా ఈయనే వాదించారు. ఆ కేసు నుంచి చంద్రబాబును సురక్షితంగా బయటపడేశారు. ఇవే కాదు గతంలో వివాదాస్పదంగా మారిని చాలా కేసులను లూథ్రా హ్యాండిల్ చేశారు. రాజీవ్ గాంధీ మర్డర్ కేసు, తెహల్కా కేసు, ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కేసు, నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసు ఇలా దేశంలో హై ప్రొఫైల్ కేసుల వెనక ఉన్న మాస్టర్ మైండ్ లూథ్రాదే. దాదాపు 30 ఏళ్లుగా లాయర్ వృత్తిలో కొనసాగుతున్న లూథ్రా.. 1991లో బార్‌లో చేరారు. లూథ్రా తండ్రి కూడా న్యాయవాదే. దీంతో 1993 నుంచి తన తండ్రి ఛాంబర్‌లో పనిచేయడం ప్రారంభించాడు. 1996-97లో ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయశాస్త్రాన్ని కూడా బోధించాడు. అతని తండ్రి 1997లో చనిపోయిన తర్వాత దివంగత సీనియర్ న్యాయవాది P R వకీల్ మార్గదర్శకత్వంలో లూథ్రా తనను తాను క్రిమినల్ లాయర్‌గా తిరిగి ఆవిష్కరించుకున్నాడు.
లూథ్రా 2004 నుండి 2007 వరకు సీనియర్ ప్యానెల్ న్యాయవాదిగా ఢిల్లీ హైకోర్టులో భారత ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహించారు. 2007లో సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు. ఉన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులు, అసాధారణ న్యాయవాదులకు మెరిట్ ఆధారంగా ప్రదానం చేసే గౌరవం ఇది. 2010లో తన ప్రాక్టీస్‌ను ఢిల్లీ హైకోర్ట్ నుంచి సుప్రీంకోర్టుకు మార్చుకున్నారు లూథ్రా. 2002లో తెహెల్కా కేసులో తెహెల్కా మ్యాగజైన్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2009లో జస్టిస్ సౌమిత్రి సేన్ కేసులో సేన్ తప్పును నిర్ధారించడంతో లూథ్రా కీలక పాత్ర వహించారు. 2011లో ఫేస్‌బుక్, గూగుల్, యాహూతో సహా 21 సోషల్ సైట్‌లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లో ఫేస్‌బుక్ తరఫున వాదించారు. 2012లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లూథ్రాను అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమించింది. ASGగా ఆయన పదవీకాలంలో అతిపెద్ద కేసుల్లో ఒకటి రాజీవ్ గాంధీ హత్య కేసు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1946 లోని సెక్షన్ 6A రాజ్యాంగ చెల్లుబాటు కేసులో.. లూథ్రా సీబీఐ తరపున ప్రాతినిధ్యం వహించి గెలిచారు.
2016లో యూజర్ సెక్యూరిటీ సంబంధించి ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో.. లూథ్రా వాట్సాప్ తరపున వాదించారు. 2015 లో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తరఫున ప్రాతినిధ్యం వహించారు. నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో లూథ్రా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కూడా పనిచేశారు. తన పిటిషన్లతో పాటు సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీగా కూడా సహాయం చేస్తున్నారు. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న లూథ్రా.. ఇప్పుడు స్కిల్ స్కాం కేసు నుంచి చంద్రబాబును ఎలా బయటపడేస్తారో చూడాలి.