Telangana BJP: మంట పెట్టిన మెదటి లిస్ట్.. తాడోపేడో అంటున్న అసమ్మతి నేతలు..
మొదటి లిస్ట్‌లో పేరు రానివాళ్లు అంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. బండి సంజయ్‌తో సహా! చాలా కాలం నుంచి పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడంలేదన్న అసంతృప్తిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు.

Since the release of the first list of BJP in Telangana, the dissident leaders are increasing
ఏ ముహూర్తానా బీజేపీ ఫస్ట్ లిస్ట్ తయారు చేసిందో కానీ.. ఆ లిస్ట్ రిలీజ్ అయినప్పటి నుంచీ ఆ పార్టీలో ప్రశాంత కరువైంది. టికెట్ ఆశించి భంగపడ్డవాళ్లు, మొదటి లిస్ట్‌లో పేరు రానివాళ్లు అంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. బండి సంజయ్‌తో సహా! చాలా కాలం నుంచి పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడంలేదన్న అసంతృప్తిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఫస్ట్ లిస్ట్‌లో తన పేరు రాకపోవడంతో పార్టీ మారేందుకు కూడా అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్ నడుస్తోంది. కేవలం రాజగోపాల్ మాత్రమే కాదు. విజయశాంతి, లక్ష్మణ్, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి పేర్లు కూడా ఫస్ట్‌లిస్ట్‌లో లేవు.
మిగిలినవాళ్ల సంగతి ఏమో కానీ వివేక్ మాత్రం ఈ విషయలో అధిష్టానంపై చాలా గుర్రుగా ఉన్నారట. తన పేరు లేకుండానే లిస్ట్ రిలీజ్ చేశారంటూ అసంతృప్తిలో ఉన్నారట. ఇక బండి సంజయ్ కూడా లిస్ట్ విషయంలో అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. తనను సంప్రదించకుండానే లిస్ట్ తయారు చేశారని బండి అలకబూనారట. తాను అనుకున్న చాలా మంది వ్యక్తులకు టికెట్లు రాలేదని ఫీల్ అయ్యారట. ఇక గోషామహల్ నుంచి ముందు నుంచీ టికెట్ ఆశిస్తున్న విక్రమ్ గౌడ్‌కు మొండి చేయి చూపించింది బీజేపీ హైకమాండ్. దీంతో విక్రమ్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్టు టాక్ నడుస్తోంది.
గోషామహల్ నుంచి రాజాసింగ్‌ను క్యాండెట్‌గా ఎనౌన్స్ చేసింది బీజేపీ. నిజానికి రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డ వ్యక్తి. కానీ ఆ సస్పెన్షన్ ఎత్తివేసి మరీ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. ముందు నుంచి పార్టీ కోసం పని చేస్తున్నా.. ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వకపోవడంతో విక్రమ్ గౌడ్ కూడా హైకమాండ్ మీద అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ నిర్ణయంతో హర్ట్ అయిన నేతలంతా తమ గళాన్ని వినిపించేందుకు రెడీ అవుతున్నారట. సైలెంట్‌గా ఉంటే లాభం లేదని.. తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఓ పక్క బీఆర్‌ఎస్ పూర్తిస్థాయిలో క్యాండెట్లను ప్రకటించి మేనిఫెస్టోతో దూసుకుపోతోంది. ఇక కాంగ్రెస్ కూడా రోజు రోజుకూ ప్రచారం స్పీడ్ పెంచుతోంది. ఏ రకంగా చూసినా రాష్ట్రంలో బీజేపీ మాత్రమే వెనకబడి ఉంది.
ఇలాంటి సిచ్యువేషన్‌లో ప్రచారం స్పీడ్ పెంచాల్సింది పోయి పార్టీలో ఇలాంటి అంతర్గత కుమ్ములాటలు రావడం పార్టీకి చాలా నష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఈ సిచ్యువేషన్‌ను బీజేపీ హైకమాండ్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.