సెంచరీ ముంగిట సింగిల్సా ? అభిషేక్ మెచ్యూరిటీపై యువీ ప్రశంసలు

ఐపీఎల్ 18వ సీజన్ లో అభిషేక్ శర్మ టాక్ ఆఫ్ సీజన్ అయిపోయాడు. మొన్నటి వరకూ వరుస వైఫల్యాలతో అసలు టీమ్ లో ఎందుకున్నాడనే విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్ ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో అందరికీ సమాధానమిచ్చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 14, 2025 | 02:51 PMLast Updated on: Apr 14, 2025 | 2:51 PM

Singles Before The Century Yuvraj Praises Abhisheks Maturity

ఐపీఎల్ 18వ సీజన్ లో అభిషేక్ శర్మ టాక్ ఆఫ్ సీజన్ అయిపోయాడు. మొన్నటి వరకూ వరుస వైఫల్యాలతో అసలు టీమ్ లో ఎందుకున్నాడనే విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్ ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో అందరికీ సమాధానమిచ్చేశాడు. తనను సన్ రైజర్స్ ఎందుకు రిటైన్ చేసుకుందో ఒక్క సెంచరీతో అందరికీ క్లారిటీ ఇచ్చేశాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో అభిషేక్ శర్మ వీరవిహారం చేశాడు. పరుగుల సునామీ సృష్టించాడు. సెంచరీతో కదం తొక్కాడు. ఆది నుంచి ధాటిగా బ్యాటింగ్ చేస్తూ పంజాబ్ బౌలర్లను ఉతికారేశాడు. బౌలర్ ఎవరైనా, ఎలాంటి బాల్ వేసినా.. రిజల్ట్ మాత్రం బౌండరీనే. ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి ఇన్నింగ్స్ లో 10 సిక్సులు, 14 ఫోర్లు ఉన్నాయంటే ఏ రేంజ్ లో చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా అభిషేక్ శర్మపై అతని మెంటార్, టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అద్భుతంగా ఆడాడని కొనియాడాడు. సెంచరీ ముంగిట సింగిల్స్ తీస్తూ.. అతను చూపించిన మెచ్యూరిటీని తట్టుకోలేకపోతున్నానని ట్వీట్ చేశాడు. అభిషేక్ సెంచ‌రీకి ద‌గ్గ‌రైన స‌మ‌యంలో 98 ప‌రుగుల వ‌ద్ద‌, 99 ప‌రుగుల వ‌ద్ద సింగిల్ తీసి సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఈ విష‌యాన్నే యువీ ప్ర‌స్తావిస్తూ.. ఇంత ప‌రిణితి ఎప్పుడెచ్చింది అంటూ కామెంట్ చేశాడు. శర్మ గారి కొడుకు.. 98 వ‌ద్ద సింగిల్, 99 వ‌ద్ద సింగిల్‌.. ఇంత ప‌రిణితి ఎప్పుడు వ‌చ్చింది. చాలాబాగా ఆడాడు అభిషేక్‌. స‌న్‌రైజ‌ర్స్ ఓపెన‌ర్లు ఇలా ఆడ‌డం చూస్తుంటే చాలా బాగుంది అంటూ యువీ ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం యువ‌రాజ్ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

అభిషేక్ బ్యాట్‌కు దూకుడెక్కువ. బౌండరీలు కొట్టేందుకు ఇష్టపడినంతగా సింగిల్స్ తీయడానికి ఇష్టపడడు. 90ల్లోకి వెళ్లగానే.. ఓ ఫోర్, సిక్స్ కొట్టి రెండు మూడు బంతుల్లోనే సెంచరీ చేయాలని చూస్తాడు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం సెంచరీ ముంగిట సింగిల్స్ తీశాడు. ఆరెంజ్ ఆర్మీకి తనదైన గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడో తెలీదు గానీ.. కాస్త సంయమనం ప్రదర్శించాడు. మొత్తానికైతే అభిషేక్ శర్మ సెంచరీ ముంగిట రెండు సింగిల్స్ తీసిన తన గురువైన యువరాజ్‌ను ఆశ్చర్యపరిచాడు.

అభిషేక్ శర్మ విధ్వంసంపై ఎక్స్‌ వేదికగా స్పందించిన యువీ.. మెరుగైన ప్రదర్శన చేసిన ట్రావిస్ హెడ్, శ్రేయస్ అయ్యర్‌లను కూడా అభినందించాడు. ఈ మ్యాచ్ అనంతరం తన సెంచరీ క్రెడిట్‌ను అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్‌తో పాటు ప్యాట్ కమిన్స్, సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌కు ఇచ్చాడు. యువీకి ధన్యవాదాలు కూడా తెలిపాడు. టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్‌కు త‌న‌కు అండ‌గా నిలిచార‌న్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో గొప్ప వాతావ‌ర‌ణం ఉందన్నారు. వికెట్ పై కొంచెం బౌన్స్ ఉండ‌డంతో ఈజీగా ఆడేలా కొన్ని కొత్త షాట్లను కొట్టే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక త‌ల్లితండ్రుల సమ‌క్షంలో సెంచ‌రీ చేయ‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌న్నాడు.