Snakes: జనావాసాల మధ్యలోకి శ్వేతనాగు.. భయంతో వణికిపోతున్న ప్రజలు..
నాగుపాముకి, హిందు సంప్రదాయానికి విడదీయరాని బంధం ఉంది. పామును నాగదేవతగా పూజించే దేశం మనది ! పాము ఎదురొచ్చినా, కల్లోకి వచ్చినా.. రకరకాల కథలు వినిపిస్తుంటాయ్. ఇక శ్వేతనాగును ప్రత్యేకంగా చూస్తుంటారు హిందువులు. అది కనిపిస్తే చాలు.. జీవితాల్లో, బతుకుల్లో భారీ మార్పులు రావడం ఖాయం అని నమ్ముతుంటారు.
శ్వేతనాగులు ఎక్కువగా అడవుల్లోనే ఉంటాయ్. జనాలకు కనిపించడం అరుదు చాలావరకు ! అరుదుగా కనిపించే ఆ శ్వేత నాగు అందరి మధ్యలోకి వస్తే.. అది వైరల్ కాకుండా ఎలా ఉంటుంది. తమిళనాడు కోయంబత్తూరులో అదే జరిగింది. తెల్లపాము ఒకటి కలకలం రేపింది. కోయంబత్తూరులో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయ్. ఉక్కపోత భరించలేకో.. వర్షం ఆస్వాదించడానికో.. విషసర్పాలన్నీ పుట్టలు వదిలి బయటకు వస్తున్నాయ్. అలా వచ్చిందే ఈ తెల్లపాము.
కోయంబత్తూరు సమీపంలోని ఓ గ్రామంలో.. వర్షానికి తెల్లపాము బయటకు వచ్చింది. ఈ విజువల్స్, ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయ్. ఇది శ్వేతనాగే అని కొందరు అంటుంటే.. కాదు అని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. ఐతే తెల్లపాము ఇళ్ల మధ్యలోకి రావడంతో.. జనాలు వణికిపోతున్నారు. ఇది దేనికి సంకేతమో అని హడలిపోతున్నారు. స్థానికుల సమాచారంలో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు.. తెల్లపామును పట్టుకొని అటవీప్రాంతంలో వదిలేశారు. ఇది శ్వేతనాగా.. లేదంటే తెల్ల రంగు అంటుకున్న పామా అన్న సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో ఈ పాము గురించే చర్చ అంతా !