Narendra Modi: మోదీ సభకు దూరంగా ఆ నేతలు.. కాంగ్రెస్‌లో చేరిక లాంఛనమేనా?
నడవాలా.. పరిగెత్తాలా అన్నట్లు సాగుతున్న తెలంగాణ బీజేపీకి.. కీ ఇచ్చి వదిలేశారు మోదీ. ఒక్క పర్యటన, ఒక్క సభతో.. కమలం పార్టీ నేతల్లో కొత్త జోష్ నింపారు.
నడవాలా.. పరిగెత్తాలా అన్నట్లు సాగుతున్న తెలంగాణ బీజేపీకి.. కీ ఇచ్చి వదిలేశారు మోదీ. ఒక్క పర్యటన, ఒక్క సభతో.. కమలం పార్టీ నేతల్లో కొత్త జోష్ నింపారు. కేసీఆర్‌కు అర్థం అయ్యే భాషలోనే కేసీఆర్‌కు మోదీ కౌంటర్ ఇచ్చారంటూ బీజేపీ నేతలు తెగ మురిసిపోతున్నారు. మోదీ టూర్‌కు ముందు.. మోదీ టూర్ తర్వాత అన్నట్లుగా తెలంగాణలో బీజేపీ జోరు కనిపించడం ఖాయం అన్నది క్లియర్‌గా కనిపిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా.. మోదీ సభకు కీలక నేతలంతా దూరంగా ఉండడం హాట్‌టాపిక్ అవుతోంది ఇప్పుడు. తెలంగాణ బీజేపీలో అసంతృప్త నేతల వ్యవహారం.. గుబులు పుట్టిస్తోంది. పార్టీలో తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని.. ఓ బ్యాచ్ చాలారోజులుగా అసంతృప్తితో కనిపిస్తోంది. అనేకసార్లు రహస్య సమావేశాలు నిర్వహించారు కూడా ! ఈ వ్యవహారం తెలంగాణ బీజేపీలో పెద్ద కలకలమే రేపింది. ఇక అటు ప్రధాని మోదీ సభకు చాలామంది సీనియర్ నాయకులు డుమ్మా కొట్టారు.
పాలమూరులో నిర్వహించిన ఈ సభకు.. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి కూడా హాజరు కాలేదు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికి.. అక్కడ నుంచి ఆయన వెనక్కి వెళ్లిపోయారు. పాలమూరు సభకు హాజరు కాలేదు. ఆయనతోపాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఏనుగు రవీందర్ రెడ్డి కూడా సభకు హాజరు కాలేదు. దీంతో వీరు సభకు రాకపోవడానికి కారణాలేంటి అనేది తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పుడు ప్రధాని సభకు రాని వారంతా.. ఈ మధ్య కారంలో రహస్య సమావేశాలు నిర్వహించిన నేతలే కావడం మరింత కలకలం రేపుతోంది. ఐతే పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో.. చాలాకాలంగా అసంతృప్తితో ఉంటున్న ఈ నేతలు.. బీజేపీ అధినాయకత్వం దగ్గరే తేల్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
ఐతే వారికి అపాయింట్‌మెంట్ దొరకడం లేదు. ప్రధాని పాలమూరు సభ సమయంలో.. ఆయనను కలుద్దామని భావించినా, ప్రధాని షెడ్యూల్‌లో నేతలతో ఎలాంటి భేటీ లేకపోవడం.. వారు సభకు హాజరు కాకపోవడానికి కారణమని తెలుస్తోంది. మూడో తేదీన నిజామాబాద్‌లో ప్రధాని సభ ఉంది. అక్కడ కలిసేందుకు అసంతృప్తి నేతలు అంతా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారికి ప్రధాని సమయం ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ప్రధాని మోది అపాయింట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరిస్తే… ఈనెల ఆరో తేదీన తెలంగాణకు వస్తున్న జేపీ నడ్డాను కలిసి తమ ఇబ్బందులు చెప్పుకోవాలని అనుకుంటున్నారట. ఇప్పుడు సభకు దూరంగా ఉన్న నేతలంతా.. కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. మరి ఇప్పుడు కూడా అపాయింట్‌మెంట్ దక్కపోతే.. వాళ్లు కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమేనా అంటే.. కాలమే సమాధానం చెప్పాలి మరి.