Somesh Kumar lands : ఫార్మాసిటీ పక్కన ఎకరం రెండున్నర లక్షలే… ! సోమేశ్  మెడకు భూముల ఉచ్చు !!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  అనుచరుడు, మాజీ CS  సోమేశ్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తెలంగాణ పాలన వ్యవహారాలను సింగిల్ హ్యాండ్ తో శాసించిన ఈ బిహారీ అధికారి భారీ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పాతిక ఎకరాల భూముల కొనుగోలు వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంటోంది.  HMDA అవినీతి తిమింగలం శివ బాలకృష్ణతో లింక్ సోమేశ్ కుమార్ బాగోతాన్ని బయట పెట్టాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2024 | 08:49 AMLast Updated on: Jan 31, 2024 | 8:49 AM

Somesh Kumar Lands

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  అనుచరుడు, మాజీ CS  సోమేశ్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తెలంగాణ పాలన వ్యవహారాలను సింగిల్ హ్యాండ్ తో శాసించిన ఈ బిహారీ అధికారి భారీ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పాతిక ఎకరాల భూముల కొనుగోలు వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంటోంది.  HMDA అవినీతి తిమింగలం శివ బాలకృష్ణతో లింక్ సోమేశ్ కుమార్ బాగోతాన్ని బయట పెట్టాయి. గత ప్రభుత్వ హయాంలో…ధరణి వెబ్‌సైట్‌కు అన్నీ తానై వ్యవహరించారు సోమేష్‌కుమార్‌. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన ఆస్తులపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోందిప్పుడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలోని 249, 260 సర్వే నెంబర్లలో 25 ఎకరాల భూమి సోమేష్‌కుమార్‌ భార్య పేరు మీద రిజిస్టర్‌ అయ్యింది. అయితే ఈ భూముల వివరాలను ఢిల్లీలోని DOPTకి అందజేయకపోవడంతో మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌ ఆస్తులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన కాలంలో ఈ పాతిక ఎకరాల భూమిని కొన్నారా? అంతకుముందే కొన్నారా, ధరణి పోర్టల్‌ అమలుకు ముందే కొన్నారా? ఆ తర్వాత కొన్నారా? ఇంతకీ ఏ ఏడాది కొన్నారనే అంశాలపై ఒక స్పష్టత వచ్చిందిప్పుడు.

వ్యూహం ప్రకారమే యాచారం మండలంలో సోమేష్‌కుమార్‌ భూములు కొన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ ఫార్మాసిటీ వస్తుందని తెలుసుకున్న సోమేష్ కుమార్.. అదే ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. 2018లో ఫార్మాసిటీ ప్రాంతంలోని కొత్తపల్లిలో నలుగురి దగ్గర నుంచి 25 ఎకరాల భూమిని సోమేష్ కొన్నట్టు అధికారులు గుర్తించారు. అది కూడా ఎకరాకు కేవలం రెండున్నర లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారు. వాస్తవానికి కొత్తపల్లి ఏరియాలో ఎకరా 50 లక్షల రూపాయలు ఉండగా.. అత్యంత తక్కువ ధరకు 25 ఎకరాల భూమి కొనడాన్ని ప్రభుత్వం అనుమానిస్తోంది. దీని వెనక క్విడ్ ప్రోకో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సోమేష్ కుమార్ కొన్న పాతిక ఎకరాల పక్కనే ఆయన సన్నిహిత కుటుంబం 123 ఎకరాల ల్యాండ్ కొన్నది.  సోమేశ్ కుటుంబానికి … ఆ భూములకు వారం తేడాతో రిజిస్ట్రేషన్లు జరగడంపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  రెవెన్యూ వ్యవహారాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, CCLA గా కీలకపదవుల్లో ఉంటూ సోమేశ్ కుమార్ ఆరేళ్ళ పాటు రెవెన్యూ వ్యహారాలను తన కన్నుసన్ననలో నడిపించారు.  ఈ టైమ్ లోనే ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన ఫార్మాసిటీ దగ్గర 25 ఎకరాల భూమిని కొన్నారు.  ఈ భూమిని చట్టబద్ధంగానే కొన్నాననీ… ప్రశాసన్ నగర్ లోని తన ఇంటిని అమ్మినట్టు సోమేశ్ ఈమధ్య ఓ ప్రకటన చేశారు.  అయితే ఆయన భూమిని కొన్నప్పుడే… ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్యామిలీ కూడా 123 ఎకరాలు కొనడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.  అందరూ ఒకేసారి అన్ని ఎకరాల భూమిని కొనడం వెనుక ఏదైనా మతలబు ఉందా అని రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయిస్తోంది.  ఈ భూములు కొన్నప్పుడు సోమేశ్ కుమార్ రెరా వ్యవహారాలను చూస్తున్నారు.  అదే టైమ్ లో శివ బాలకృష్ణ కూడా రెరాలో పనిచేశారు. ఇప్పుడు బాలకృష్ణ భూములకు సోమేశ్ కుమార్ కీ ఏవైనా సంబంధాలు ఉన్నాయా అని ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తోంది. ఇప్పుడు HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణను  ఏసీబీ కస్టడీలోకి తీసుకొని విచారిస్తోంది.  ఈ ఎంక్వైరీలో అన్ని విషయాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు.