Cobra in Plane: ఎగురుతున్న విమానంలో పాము.. అదీ పైలట్ పక్కనే.. తర్వాత ఏం జరిగిందంటే!
విమానాన్ని నడిపై పైలట్ సీటు కిందే పాముంటే? ఆ పైలట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. షాకింగ్‌గా ఉంటుంది కదా! ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఒక పైలట్‌కు. విమానాన్ని నడుపుతున్నప్పుడు పైలట్ సీట్లోకి పాము చొచ్చుకొచ్చింది.
Cobra in Plane: విమానం ఆకాశంలో ఎగురుతున్నప్పుడు పాము కనబడిందంటే ప్రయాణికులు హడలిపోతారు. అదే ఆ విమానాన్నే నడిపై పైలట్ సీటు కిందే పాముంటే? ఆ పైలట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. షాకింగ్‌గా ఉంటుంది కదా! ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఒక పైలట్‌కు. విమానాన్ని నడుపుతున్నప్పుడు పైలట్ సీట్లోకి పాము చొచ్చుకొచ్చింది. ఈ ఘటన ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగింది.
దక్షిణాఫ్రికాలోని బ్లూమ్‌ఫోంటైన్ నుంచి ప్రిటోరియా పట్టణానికి ఒక చిన్న చార్టర్డ్ ప్లైట్ బయల్దేరింది. దీన్ని పైలట్ రుడాల్ఫ్ ఎరాస్మస్ నడుపుతున్నారు. విమానం 11 వేల అడుగుల ఎత్తులో ఉంది. ఈ సమయంలో రుడాల్ఫ్ సీటు కింద ఏదో మెత్తగా, చల్లగా తడుముతున్నట్లు అనిపించింది. మొదట అది వాటర్ బాటిల్ అయ్యుంటుందనుకున్నాడు. తర్వాత అదేంటా అని పరిశీలించి చూసి షాక్ తిన్నాడు. ఎందుకంటే అది విషపూరిత నాగుపాము (కేప్ కోబ్రా). వెంటనే భయపడ్డ పైలట్, గందరగోళానికి మాత్రం గురికాలేదు. ఎందుకంటే విమానం గాల్లో ఉన్నప్పుడు పైలట్ ఏమాత్రం పొరపాటు చేసినా అది పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. పైగా విమానంలో తనతోపాటు మరో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. అందుకే రుడాల్ఫ్ సంయమనంతో వ్యవహరించాడు.
ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అయినా దొరకని పాము
విమానం కాక్‌పిట్‌లో పాము ఉన్న విషయాన్ని గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందికి తెలియజేశాడు పైలట్. పాము నుంచి సురక్షితంగా తప్పించుకోవాలంటే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు అనుమతించాలని కోరాడు. స్పందించిన ఏటీసీ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు అనుమతించింది. దీంతో పైలట్ రుడాల్ఫ్ విమానాన్ని జోహన్నెస్‌బర్గ్‌లో ల్యాండింగ్ చేశాడు. దీంతో అతడితోపాటు ప్రయాణికులు కూడా సురక్షితంగా దిగారు. తర్వాత సిబ్బంది వచ్చి విమానం సీటు కింద ఉన్న పామును గుర్తించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ పాము కనిపించలేదు. చివరకు విమానం రెక్కలు విప్పి మరీ వెతికారు. అయినా పాము దొరకలేదు. దాన్ని పట్టుకునేందుకు ఆహారాన్ని ఎర వేశారు. అయినా పాము చిక్కలేదు. ఒక రోజంతా ప్రయత్నించినప్పటికీ పాము దొరకలేదు.
పామును ముందే గుర్తించినప్పటికీ
నిజానికి విమానంలోకి పాము అనుకోకుండా వచ్చిందేం కాదు. విమానం బయల్దేరడానికి ముందు సాధారణ తనిఖీలు చేస్తుండగా, విమానం రెక్కల్లో పాము ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. తర్వాత పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఎంతసేపు వెతికినప్పటికీ పాము కనిపించలేదు. చివరకు పాము అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుందని భావించి, విమానాన్ని బయల్దేరేందుకు అనుమతించారు. కానీ, విమానం బయల్దేరిన కొద్దిసేపటికే అది పైలట్ దగ్గరికి వచ్చింది. అయితే, పైలట్ చాకచక్యంతో ప్రమాదం తప్పింది.
పైలట్ ఏం చెప్పాడంటే
ఈ ఘటన గురించి పైలట్ రుడాల్ఫ్ మాట్లాడారు. ‘‘విమానం నడుపుతున్నప్పుడు సీటు దగ్గర ఏదో తాకుతున్నట్లు అనిపించింది. ఎడమవైపు తిరిగి చూస్తే నా సీటు కింద పాము కనిపించింది. ఆ సమయంలో ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పనైంది. ఈ విషయన్ని నెమ్మదిగా విమానంలోని ప్రయాణికులకు తెలియజేశా. లోపలి పరిస్థితి వాళ్లకు వివరించా. పాము సీటు కింద ఉన్న విషయం చెప్పా. ఆ సమయంలో వాళ్లు ముందు షాకైనా.. తర్వాత అందరూ ప్రశాంతంగా ఉన్నారు. అనంతరం ఏటీసీ సూచనతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశా’’ అని తెలిపారు. ఆ సమయంలో తాను విమానంలో ఉన్న ప్రయాణికుల గురించే ఆలోచించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రయణికులు రుడాల్ఫ్‌ను అభినందించారు. దక్షిణాఫ్రికా పౌర విమానయాన శాఖ కమిషనర్ పాపీ ఖోసా కూడా రుడాల్ఫ్‌ను ప్రశంసించారు.