Heavy Rains: జోరు మీదున్న రుతుపవనాలు.. రైతులగు గుడ్‌న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ
వర్షాకాలం వచ్చిందన్న మాటే కానీ.. ఒకటో రెండో తప్ప.. గట్టి వాన పడింది లేదు తెలుగు రాష్ట్రాల్లో ! విత్తనాలు నాటిన రైతులు.. వరుణుడి కరుణ కోసం అమాయకంగా ఆకాశం వైపు చూస్తున్న పరిస్థితి.
దీంతో వాన కబురు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు వాళ్లంతా ! ముంబై, గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వింటున్నాం కానీ.. తెలుగు రాష్ట్రాల్లో వానల జాడే లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. రాబోయే నాలుగు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా చేస్తోంది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో వర్షాలు కురుస్తాని.. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. 5, 6 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా జులైలో సాధారణం కంటే ఎక్కువ వాన పడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కి కూడా.. రాబోయే మూడు రోజులు వర్ష సూచన ఉంది. ఐతే.. ఇవీ మరీ భారీ వర్షాలు కావు. ఓ మోస్తరుగా మాత్రమే కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలతోపాటూ అక్కడక్కడా పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఏమైనా వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూస్తున్న రైతులకు.. వాతావరణ శాఖ నుంచి చల్లని కబురు వచ్చిందనే చెప్పాలి. గతేడాదితో పోలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయ్. ఇప్పటికే విత్తనాలు మొలకెత్తి ఉండాలి. కానీ వేసిన విత్తనాలన్నీ ఎండిపోయి.. పక్షుల పాలు అవుతున్న పరిస్థితి. కొందరు రైతులు అయితే.. రెండోసారి విత్తనాలు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇలాంటి టైమ్‌లో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.