SRISAILAM Mallanna: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం: ఆలయ ఈవో లవన్న

MAHASIVARATHRI MALLANNA TEMPLE
ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు శ్రీశైలమల్లన్న మహా దివ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సర్వం సిద్దం చేసినట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. తొలిరోజు యాగశాల ప్రవేశం, ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం సరైన ప్రణాళకతో మౌళికవసతులు అందించేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో పలు ముఖ్య విభాగాల అధికారులతోపాటూ ఇంజనీరింగ్ నిపుణులు పాల్గొన్నారు.
మల్లన్న మహోత్సవం:
మహాశివరాత్రి పుణ్యదినంరోజు ఆలయంలో జరిగే మహాజ్యోతిర్లింగోద్భవం, పట్లువస్తాల సమర్పణ, పాగాలంకరణ, మహారథోత్సవం వంటి సేవలను తిలకించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. దాదాపు 10వేల మంది భక్తులు స్వామి ఉత్సవాలను తమ నయనాలతో దర్శించేందుకు సన్నాహాలు చేశామని చెప్పారు. మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనప్పటి రోజు నుంచి అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తకంగా పూజాది కైంకర్యాలు నిర్వహిస్తారని తెలిపారు.
భక్తులకు ఈవో సూచనలు:
శివమాలాధారులు మండల దీక్షలు పూర్తిచేసుకొని స్వామి, అమ్మవార్ల దర్శనం అనంతరం వారు ధరించిన వస్త్రాలను ఆలయ పరిసరాల్లో పారవేయడం నిషేధమని సూచించారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన మల్లిఖార్జునుడి దర్శనానికి విచ్చేసే జ్యోతిర్ముడి స్వాములకు 15వతేదీ వరకూ ఉచిత దర్శనాన్ని కల్పిస్తామని వెల్లడించారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాల పేరుతో మూడు రకాలా ప్రవేశమార్గాలను ఏర్పాటు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు.
దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు:
దర్శనానికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం వారు బస చేయడానికి చలువ పందిళ్లు, క్యూ కాంప్లెక్స్ లు, ఇరుముడి సమర్పణ ప్రదేశాలు, లడ్డూ ప్రసాద వితరణ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటితోపాటూ పాదయాత్ర ద్వారా వచ్చిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఉచిత అన్న ప్రసాద వితరణతోపాటూ స్నానపు ఘట్టాలు, వైద్యసేవలు అందుబాటులో ఉంచినల్లు తెలిపారు. స్వామివారి ఆలయ పరిసరాలకు, గాలిగోపురం మొదలు, ఆలయ ప్రాంగణాన్ని మొత్తం దేదీప్యమైన విద్యుత్ కాంతులతో అలంకరణ ఏర్పాట్లు చేశామన్నారు. వీటితో పాటూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగకుండా పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి 450 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్లు ప్రకటించారు.