AP Election Schedule: మార్చిలో ఏపీ ఎన్నికల నోటిఫికేషన్.. తాజాగా ముసాయిదా విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలో విడుదల అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న వార్తల నేపథ్యంలో కీలక అంశాన్ని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలో విడుదల అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న వార్తల నేపథ్యంలో కీలక అంశాన్ని వెల్లడించారు. శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలను తెలియజేశారు. తాజా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4కోట్ల2లక్షల21వేల450 గా ఉన్నట్లు గుర్తించారు. 2024 జనవరి 1 నాటికి పూర్తి సవరింపులతో కూడిన జాబితాను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా కొత్త ఓటర్లను జాబితాలో చేర్చుకోవడం, అవసరం లేని పేర్లను తొలగించడం వంటి ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది డిశంబర్ 9 వరకూ ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్ లో అయినా నమోదు చేయవచ్చు అని వెల్లడించింది. డిశంబర్ 26 నాటికి వాటిని పరిష్కరించి కొత్త జాబితాను విడుదల చేస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 5న ఫైనల్ లిస్ట్ ను ప్రకటిస్తామన్నారు. రాబోయే 2024 ఎన్నికలకు భేల్ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన ఈవీఎం యంత్రాలను వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ముందుగా రాజకీయ నాయకులు సమక్షంలో దీని పనితీరును పరిశీలించి పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొంది.
రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు..
ఇప్పటి వరకూ 10 లక్షల బోగస్ ఓట్లను తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాపై కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరాలు తెలిపాయన్నారు. మొత్తం ఆరు అంశాల ఆధారంగా దొంగ ఓట్లను గుర్తించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన కారణంగా నవంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేశామన్నారు. అక్కడ జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుని తిరిగి ఏపీలో కూడా ఓటు వేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. దీనికి గల సాంకేతిక కారణం గురించి తెలిపారు. తెలంగాణలో ఓటు వేసిన వారు తమ ఓటును ఆంధ్రాకు బదిలీ చేసుకుంటున్నారు. ఇలా చేసుకోవడం వల్ల రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. దీనిని గుర్తించేందుకు తగిన సాఫ్ట్ వేర్ ప్రస్తుతం మన దగ్గర లేదని స్పష్టం చేశారు. కేవలం ఆ రాష్ట్రాంలోని ఓటర్లను గుర్తించే సాఫ్ట్ వేర్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు వివరించారు.
ముసాయిదాపై అభ్యంతరాలు..
తాజాగా విడుదల చేసిన ముసాయిదాపై ఏమైనా అభ్యంతరాలు, తప్పులు ఉంటే వాటిని డిశంబర్ 9 వరకూ సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ఎన్నికల సంఘం. అందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద రెండు సార్లు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. ముందుగా నవంబర్ 4, 5 తేదీల్లో ఒకసారి తరువాత డిశంబర్ 2, 3 తేదీల్లో మరోసారి నిర్వహిస్తుంది. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి అభ్యంతరాలను సవరించే అవకాశం కల్పిస్తోంది. అలాగే అక్రమాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించింది. ఎన్నికల సంఘానికి ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. వాటిపై కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని తెలిపింది.
డిశంబర్ 9 వరకూ దరఖాస్తు..
2023 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా గుర్తించబడతారని తెలిపింది. గతంలో నమోదు చేసుకోకపోతే డిశంబర్ 9 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 2024 ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండేవారైనా కూడా ముందుగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. తాజాగా విడుదలైన ముసాయిదాలో నమోదైన ఓటర్లు 4,02,21,450 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 1,98,31,791 కాగా మహిళలు 2,03,85,851 గా గుర్తించారు. ఇతరులు 3,808 గా ఉన్నారు. అత్యధికంగా అనంతపురం నుంచి 19,79,775 మంది ఓటర్లు నమోదు కాగా అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,40,857 మంది ఉన్నారు. 2024 జనవరి నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
T.V.SRIKAR