Sudan Unrest: సూడాన్‌లో సైన్యం ఆధీనంలో ల్యాబ్.. ప్రపంచానికి మరో వైరస్ ముప్పు తప్పదా?

సూడాన్‌లో రెండు సైనిక వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో దేశంలోని అనేక ప్రాంతాలను రెండు సైనిక వర్గాలు తమ స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో ఖార్టౌమ్ పట్టణంలో ఉన్న నేషనల్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీని సైన్యం స్వాధీనం చేసుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 26, 2023 | 04:05 PMLast Updated on: Apr 26, 2023 | 4:05 PM

Sudan Unrest Who Warns Of Biological Hazard At Seized Lab

Sudan Unrest: ప్రపంచం ఇప్పటికే కరోనాతోపాటు హెచ్1ఎన్1, హెచ్3ఎన్2, మంకీపాక్స్ వంటి వైరస్‌ల ప్రభావంతో తీవ్ర నష్టాన్ని చవి చూసింది. ఇప్పుడిప్పుడే అన్ని రకాల వైరస్‌లు అదుపులోకి వచ్చాయని భావిస్తున్న తరుణంలో మళ్లీ వైరస్‌లు ముంచెత్తే అవకాశం ఉందని ఆందోళన మొదలైంది. దీనికి కారణం సూడాన్. ప్రస్తుతం అక్కడ అంతర్యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సూడాన్‌లో రెండు సైనిక వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో దేశంలోని అనేక ప్రాంతాలను రెండు సైనిక వర్గాలు తమ స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో ఖార్టౌమ్ పట్టణంలో ఉన్న నేషనల్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీని సైన్యం స్వాధీనం చేసుకుంది. దీంతో ల్యాబ్ పూర్తిగా సైనికుల చేతికి వెళ్లిపోయింది. ఇదే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళనకు కారణమవుతోంది.
సైన్యం ల్యాబ్‌ను స్వాధీనం చేసుకోవడంతో అక్కడ పని చేసే శాస్త్రవేత్తలు, సిబ్బంది అక్కడ్నుంచి వైదొలగాల్సి వచ్చింది. దీంతో ల్యాబ్ నిర్వహించే వాళ్లెవరూ లేరు. అలాగే ల్యాబ్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో డబ్ల్యూహెచ్ఓ ఆందోళన చెందుతోంది. ఎందుకంటే ఇది దేశంలోనే పెద్ద ల్యాబ్. అంటు వ్యాధులకు సంబంధించి అనేక ప్రయోగాలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ మీజిల్స్, కలరా, పోలియో వంటి అనేక వ్యాధులకు చెందిన వైరస్‌లపై ప్రయోగం చేస్తుంటారు. వీటి వైరస్ నమూనాలు ఇక్కడ ఉన్నాయి. పూర్తి జాగ్రత్తలు, భద్రత మధ్య ఈ ప్రయోగాలు చేయాలి. లేదంటే వైరస్ బయటకు లీకయ్యే ప్రమాదం ఉంది. ఈ వైరస్ లీకైతే క్రమంగా దేశమంతా వ్యాపించే అవకాశం ఉంది. అది ఇతర దేశాలకూ పాకవచ్చు. అందుకే డబ్ల్యూహెచ్ఓ ఆందోళన చెందుతోంది.
ఈ ల్యాబ్‌ను సిబ్బంది నుంచి స్వాధీనం చేసుకుంది. దీంతో ఈ ల్యాబ్‌ను సంరక్షించేవాళ్లు లేరు. పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ కారణాల వల్ల ప్రమాదకర వైరస్‌లు ఎక్కడ లీకవుతాయో అని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన చెందుతోంది. ఈ వైరస్‌లు మాత్రమే కాకుండా మరెన్నో వైరస్‌లు, బయోలాజికల్ మెటీరియల్స్, కెమికల్స్ వంటివి ఇక్కడ ఉన్నాయి. వీటిలో ఏవి లీకైనా ప్రపంచానికి ప్రమాదమే. వీటి నిర్వహణ సరిగ్గా లేకుంటే అవి లీకయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రపంచ దేశాలు ఈ విషయంలో జోక్యం చేసుకుని, అక్కడి ల్యాబ్‌ను తక్షణం స్వాధీనంలోకి తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ భావిస్తోంది. అలాగే అక్కడ విద్యుత్ సరఫరా పునరుద్ధరించి, ల్యాబ్‌ను సురక్షితంగా ఉంచాల్సిన అవసరం కూడా ఉంది.
బయోలాజికల్ వెపన్స్
ఏ దేశంలోని ఏ ల్యాబ్‌లో ఎలాంటి ప్రయోగం చేస్తున్నారో గుర్తించడం కష్టం. అసలు కరోనా వైరస్ ఎలా వచ్చిందో ఇప్పటికీ ఒక స్పష్టత లేదు. అందువల్ల సూడాన్ ల్యాబ్‌లో ఏముందోనని సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు యుద్ధాల్లో 1975 నుంచి బయోలాజికల్ వెపన్స్ వాడటం మొదలైంది. హానికర వైరస్‌లు, గ్యాస్‌లు వంటివి గాలిలోకి, నీటిలోకి, నేలపైకి విడుదల చేసి.. వాటి ద్వారా శత్రుదేశ సైనికులకు, ప్రజలకు నష్టం కలిగేలా చేయడమే బయోలాజికల్ వెపన్స్ పని. అందుకే వీటి విషయంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉంటాయి. తాజాగా సూడన్ అంతర్యుద్ధం వల్ల కూడా అలాంటి పరిస్థితి రాకూడదని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే సూడాన్ అంతర్యుద్ధంలో వందలాది మంది మరణించారు. ఐదు వేల మంది వరకు గాయపడ్డారు.