Exam Stress Suicides: పరీక్షల ఒత్తిడే విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమా..? వీటిని ప్రభావితం చేసే అంశాలేంటి.. నివారించడం ఎలా..?

మన్నటి కోటా నుంచి నేటి విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య వరకూ అన్నీ పరీక్షల ఒత్తిడి కారణంగా సంభవించిన మరణాలే. ఇవి ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. నిత్యం దేశంలో ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక ఊళ్లో జరుగుతూనే ఉంది. కొన్ని వెలుగులోకి వస్తే మరి కొన్ని కనుమరుగైపోతున్నాయి.  

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 19, 2023 | 12:54 PMLast Updated on: Sep 19, 2023 | 12:54 PM

Suicides Of Students Are Increasing Due To The Pressure Of Exams

నేటి సమాజంలో పిల్లలు చదువును భారంగా ఫీలవుతున్నారా..? పరీక్షలంకంటే చావే సులభం అనుకుంటున్నారా..? అధ్యాపకులు పెట్టే పరీక్షల ఒత్తిడా..? ర్యాంకుల కోసం లక్షలు పెట్టే పేరెంట్స్ తప్పా..? పిల్లల మానసిక పరిస్థితి అర్థం చేసుకోలేని విద్యాలయాల లోపమా..? వీటిలో ఏది ప్రదాన కారణం అంటే పైవన్నీ అనే సమాధానం వినిపిస్తున్నాయి. ఇదేదో కాంపెటేటివ్ పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలాగా ఉన్నాప్పటికీ నేటి విద్యార్థుల పరిస్థితులు మాత్రం ఇదే అని ఖచ్చితంగా చెప్పాల్సి వస్తోంది. చిరు పెదవులతో మందారంలా వికసించే వారి నవ్వులు పుస్తకం పట్టుకోవాలంటే కళ్లలో బాధ కనిపిస్తోంది. తల్లి దండ్రులకు చెప్పుకోవాలంటే భయం వేస్తోంది. లక్షలు పెట్టుబడి నాపై పెట్టారు.. చెబితే ఎక్కడ ఫీలౌతారో అని కొందరు.. చెప్పి వారితో తిట్లు ఎందుకు తినాలి అని మరికొందరు అనుకుంటున్నారు. కొందరైతే చెప్పినా ప్రయోజనం లేదు అని ఆలోచిస్తున్నారు. ఇలా ఎవరికి చెప్పాలో తెలియక లోకం చూడని వయసులో లోకాన్ని వదిలి వెళ్లాలనుకుంటున్నారు. అందుకే  ఈ ఆత్మహత్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.

విద్యార్థుల పట్ల అవగాహన లేని అధ్యాపకులు

పిల్లలు ఎంత వరకూ క్లాస్ రూంలో యాక్టీవ్ గా ఉన్నారు. వారి మైండ్ ఎలా ఉంది. చెబుతూనే వినగలుగుతున్నారా లేరా అనే కనీస అవగాహన ఈకాలం అధ్యాపకుల్లో కొరవడింది అని చెప్పాలి. ఏదో బెల్లు బిల్లు అనే విధంగా క్లాస్ గంట మోగిన వెంటనే వెళ్లడం రెండు పాటాలు చెప్పడం, నాలుగు ప్రశ్నలు హోంవర్క్ ఇవ్వడం. అది మరుసటి రోజు చేయలేక పోతే తరగతి గదిలో ఒకప్పుడు కొట్టే వారు ఇప్పుడు అవమానానికి గురి చేస్తున్నారు. దీంతో తోటి విద్యార్థుల పట్ల చిన్న చూపు ఏర్పాటి హేళలనకు గురవ్వాల్సి వస్తోంది. దీంతో మానసిక పరిస్థితి మరింత బలహీన పడి చనిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. దీనిని బట్టి అర్థమైంది ఒక్కటే.. టీచర్లు తరగతి గదిని ఒక ప్రయోగశాల లాగా భావించకుండా ఎక్కువ లోడ్ పిల్లలపై వేయడం ద్వారా రియాక్షన్ ఇలా నెగిటివ్ గా వస్తోంది.

తల్లిదండ్రల ప్రెస్టేజీ ఇష్యూ..

పక్కింటి పంకజం కొడుకు బాంబే ఐఐటీలో ర్యాంకు సాధించాడు. అయితే మన కొడుకు అహ్మదాబాద్ ఐఐఎం లో గోల్డ్ మెడల్ సాధించాలి. ఇది నేటి పేరెంట్స్ ఆలోచన. దీని కోసం లక్షలు అప్పు చేసి అయినా ఎడ్యూకేషన్ ఇన్స్టిట్యూట్స్ కి చెల్లిస్తారు తప్ప తమ పిల్లవాడి ఆలోచన ఏంటి, మన వాడు ఇంత పెద్ద చదువులు చదవగలడా, వాడి మైండ్ సెట్ ఎలా ఉంది. అసలు మనవాడు ఏమవ్వాలనుకుంటున్నాడు అన్న చిన్న ఆలోచన చేయరు. దీంతో పేరెంట్స్ కోరికను పిల్లలపై రుద్దడం. అదేదో సినిమాలో నేను డ్యాన్సర్ కాలేకపోయాను.. నా కొడుకు గొప్ప డ్యాన్సర్ అవ్వాలి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. సినిమాలో కథ.. డైరెక్టర్ ఎలా చెబితే అలా మలుపు తిరుగుతుంది. అదే నిజ జీవితానికి అన్వయం చేస్తే కథ అడ్డం తిరుగుతుంది. దీనిని మొదట్లోనే గుర్తిస్తే కొంత వరకూ ఆత్మహత్యలు నివారించవచ్చు.

విద్యా సంస్థల యాజమాన్యాల లోపం..

మా కాలేజ్ దశాబ్ధ కాలం నుంచి టాప్ ర్యాంకులు సాధిస్తున్నాయి అంటూ ప్రకటనలు ఇవ్వడం తప్ప సరైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంలో పూర్తిగా విఫలం అవుతున్నారు. ఇలా ఈమధ్య కాలంలో జరిగిన ఆత్మహత్యలు వందల్లో ఉన్నాయి. కేవలం గుజరాత్ లోని కోటా లో చదుకు కోసం సొంత ఇళ్లు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి బయటకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. దీనికి కారణం యాజమాన్యాలు టీచర్లపై చూపిస్తున్న ఒత్తిడి. ఆ ఒత్తిడి కారణంగా టీచర్లు విద్యార్థులకు తలకు మించిన భారాన్ని ఇస్తూ కాలం వెల్లబుచ్చుతున్నారు. దీంతో ఒక స్థాయి వరకూ ఒత్తిడిని తీసుకున్న విద్యార్థి అది తారా స్థాయికి చేరడంతో మరణమే శరణ్యం అనుకొని తనువు చాలిస్తున్నారు. ఇలాంటి ఎడ్యూకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నంత వరకూ ఇలాంటి మారణ హోమాలకు అడ్డుకట్టపడదు.

ప్రెస్టీజీ కోసం పరీక్షలు..

పరీక్షల నిర్వహణ అంటే.. ఏడాదంతా నేర్చుకున్న పాఠాలు ఎంతమేరకు అర్థమయ్యాయో తెలుసుకునేందుకు చేసే ప్రక్రియ. దీనిని సమర్థవంతంగా నిర్వహించడంలో తీవ్ర లోపాలు తలెత్తుతున్నాయి. ఈ సారి పాస్ అవకపోతే పిల్లలకు నెక్స్ట్ భవిష్యత్తే లేదు అనేలా విషాన్ని నూరిపోస్తున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఏదో పెద్ద తప్పు చేశామేమో అన్న భావనలోకి వెళ్లిపోతున్నారు. తమ పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయితే పక్కింటి వాళ్లకు, పొరుగింటి వాళ్లకు ఎక్కడ తెలిస్తుందో అని తల్లిదండ్రులు అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ తమ పిల్లలు పరీక్షలు రాయాల్సింది పక్కింటి వాళ్ల దగ్గర మెప్పుకోసమే తప్ప తన భవిష్యత్తు కోసం కాదని అర్థమైపోతుంది. దీని ప్రభావం పిల్లలపై పడి ఎలాగైనా చదవాలి అనే ఒత్తిడిని తమ మెదడులో నింపుకుంటున్నారు. ఇవి ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి.

ఆత్మహత్యలు నివారించడం ఎలా..

  • చదువుకునే పిల్లల మానసిక స్థైర్యాన్ని చిన్నప్పటి నుంచే అర్థం చేసుకోవాలి.
  • ఒక అవగాహనకు వచ్చిన తరువాత వారికి ఎందులో ఆసక్తి ఉందో గుర్తించాలి.
  • దీనిని బట్టి వారు ఏ రంగాల్లో రాణించగలరో గుర్తించి దానికి తగ్గట్టు భవిష్యత్ ప్రణాళికలు రచించాలి
  • అలాగే విద్యాసంస్థల్లో జరిగే దినచర్య మొత్తాన్ని రోజు రోజూ తెలుసుకుంటూ, తోటి విద్యార్థుల పై మానిటరింగ్ చేస్తూ ఉండాలి.
  • మన కోరికలను వారిపై రుద్దకుండా వారి భావాలకు స్వేచ్ఛను ఇవ్వాలి.
  • మనకు పుట్టిన బిడ్డ ప్రయోజకుడు కాకున్నా పరవాలేదు ప్రాణం కోల్పోకుండా ఉంటే చాలు అన్న కనీస అవగాహనకు పేరెంట్స్ రావాలి.
  • ఇలా జరిగితే పిల్లలు మానసిక వికాసం మరింత పరిపక్వత చెంది అనుకున్న రంగాల్లో రాణించే అవకాశం ఉంటుంది.

T.V.SRIKAR