Summer Effect: ఈసారి ఎండాకాలం కాదు.. మండేకాలం..!!
ఫిబ్రవరి నుంచే తన ప్రభావం చూపుతున్న భానుడు. మార్చి-ఏప్రిల్ పరిస్థితి ఏంటి..?

summer effect in ap and telangana
వేసవి వచ్చిందంటే చాలు ముందుగానే అన్ని ఏర్పాట్లూ చేసుకుంటూ ఉంటారు. కొందరు కూలర్లు, ఏసీలు, వట్టి వేర్లు, తాటి తడికల పందిళ్లు ఇలా తమ తమ స్తోమతను బట్టీ వీటిని వాడుతారు. ఇప్పటి వరకూ ఉన్న ఎండలు ఒక రకం. అయితే రేపు వచ్చే ఎండా కాలం మండే కాలంగా ఉండబోతుందట. అదేదో సినిమాలో డైలాగ్ ఉందికాదా. ఇప్పటి వరకూ ఒకలెక్క ఇకపై మరో లెక్క అన్నట్టుగా భానుడు భూమిపై పగపడుతున్నాడట. ఈ ఏడాది మార్చి నెలాఖరులో విపరీతమైన ఎండలు ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు వాతావరణశాఖ అధికారులు.
ఉష్ణోగ్రతలు పెరగడానికి గల కారణాలు:
గతేడాదితో పోల్చితే ఇప్పటికే ఎండల తీవ్రత అధికంగా ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. గత ఫిబ్రవరిలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన ఉష్ణోగ్రతలే ఇందుకు ఉదాహరణ. గతంలో ఫిబ్రవరిలో 30 డిగ్రీలు దాటలేదు. కానీ ఈ ఫిబ్రవరిలో 32 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పశ్చిమ ప్రాంతాల నుంచి వీచే వేసవి గాలులను వాయవ్య ప్రాంతంలోని పర్వతాలు అడ్డుకుంటూ ఉంటాయి. దీనివల్ల తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈ సంవత్సరం పర్వత ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా నమోదవ్వడంతో పొడి వాతావరణం ఏర్పడింది. ఇదే ఉష్ణోగ్రతలు మండిపోవడానికి ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, రాజస్తాన్ లో ఇప్పటికే 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. భూ వాతావరణ పరిస్థితుల కారణంగా అప్పుడప్పుడూ ఇలా వాతావరణంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయని తెలిపింది ఐఎండీ.
మే నెల కీలకం అంటున్న అధికారులు:
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసారి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతానే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మార్చి చివరివారంలో 36 నుంచి 38 వరకూ ఉష్ణోగ్రతలు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ అధికారులు. ఇక ఏప్రిల్ నాటికి 45 దాటే అవకాశం ఉందంటున్నారు. మే మొదటి వారంలో వర్షాలు కురవకపోతే దీని ప్రభావం మరింత ఎక్కువ ఉండే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఎండలో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే సన్ మాశ్చరైజర్స్, పల్చటి వస్త్రాలు, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచిస్తున్నారు.
T.V.SRIKAR