సుందర్ దెబ్బ.. అదిరిందబ్బా తొలిరోజు మనదే పైచేయి

బెంగళూరు టెస్ట్ ఓటమి షాక్ నుంచి కోలుకున్న టీమిండియా పుణే వేదికగా రెండో టెస్టులో అదరగొడుతోంది. స్పిన్ వ్యూహంతోనే కివీస్ కు చెక్ పెట్టాలన్న గంభీర్,రోహిత్ ప్లాన్ మొదటిరోజు వర్కౌట్ అయింది. టాస్ ఓడినప్పటకీ పుణే పిచ్ పై మన స్పిన్నర్లు చెలరేగిపోయారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 24, 2024 | 04:47 PMLast Updated on: Oct 24, 2024 | 4:47 PM

Sunder Superb Bowling Aganist Kiwis

బెంగళూరు టెస్ట్ ఓటమి షాక్ నుంచి కోలుకున్న టీమిండియా పుణే వేదికగా రెండో టెస్టులో అదరగొడుతోంది. స్పిన్ వ్యూహంతోనే కివీస్ కు చెక్ పెట్టాలన్న గంభీర్,రోహిత్ ప్లాన్ మొదటిరోజు వర్కౌట్ అయింది. టాస్ ఓడినప్పటకీ పుణే పిచ్ పై మన స్పిన్నర్లు చెలరేగిపోయారు. తొలి టెస్ట్ తర్వాత సెలక్టర్ల పిలుపుతో వచ్చిన వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చీ రావడంతోనే అదరగొట్టేశాడు. తన స్పిన్ మ్యాజిక్ తో కివీస్ ను దెబ్బతీశాడు. ఏకంగా ఏడు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు. ఒకవిధంగా తొలిరోజే కివీస్ ను ఆలౌట్ చేశామంటే అది సుందర్ స్పిన్ ప్రతిభే అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ మ్యాచ్ ఆరంభంలో పేసర్లు పెద్దగా ప్రభావం చూపలేరనేది త్వరగానే తేలిపోయింది. అందుకే తొలి సెషన్ ప్రారంభమైన అరగంటలోనే రోహిత్ అశ్విన్ ను దించాడు. అతని అంచనాలకు తగ్గట్టే అశ్విన్ వెంటవెంటే వికెట్లు తీయడం కివీస్ జోరుకు బ్రేక్ వేసింది.

లంచ్ బ్రేక్ వరకూ రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే ఆచితూచి ఆడడంతో కివీస్ మంచి స్కోర్ సాధించేలాగే కనిపించింది. వీరిద్దరూ హాఫ్ సెంచరీలు కూడా పూర్తి చేసుకోగా.. పార్టనర్ షిప్ మరింత బలపడుతుందనుకుంటున్న దశలో మన స్పిన్నర్లు దెబ్బకొట్టారు. కాన్వేను అశ్విన్, రచిన్ రవీంద్రను వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ కు పంపారు. ఇక్కడ నుంచి టీమిండియా ఆధిపత్యం పూర్తిగా కొనసాగింది. తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లను ఎక్కువసేపు కుదురుకోనివ్వకుండా సుందర్ వరుస వికెట్లు ఫడగొట్టాడు. ముఖ్యంగా వాషీ తన సెకెండ్‌ స్పెల్‌లో అయితే అద్భుతమైన బంతులతో కివీస్‌ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 23.1 ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్టన్‌.. 59 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 5 వికెట్లు పైగా సుందర్‌ పడగొట్టడం తన కెరీర్‌లో ఇదే తొలిసారి. మరో స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 3 వికెట్లు సాధించి కివీస్ ను 300లోపే పరిమితం చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

కివీస్ ఇన్నింగ్స్ లో కాన్వే 76 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిస్తే…రచిన్ రవీంద్ర 65 పరుగులు చేశాడు. చివర్లో మిఛెల్ శాంట్నర్ కాస్త దూకుడుగా ఆడడంతో న్యూజిలాండ్ 259 రన్స్ కు ఆలౌటైంది. కాగా ఈ మ్యాచ్ లో పిచ్ పూర్తిగా స్పిన్నర్లకే సహకరిస్తోంది. పేసర్లు కేవలం 14 ఓవర్లే వేయగా… భారత స్పిన్నర్లు ముగ్గురూ కలిపి 65 ఓవర్లు వేశారు. ఇదిలా ఉంటే బెంగళూరు టెస్ట్ ఓటమితో భారత తుది జట్టులో మూడు మార్పులు చేశారు. శుభ్ మన్ గిల్ జట్టులోకి తిరిగి రాగా… వరుస వైఫల్యాలతో నిరాశపరుస్తున్న కెఎల్ రాహుల్ పై వేటు పడింది. తొలి టెస్టులో 150 పరుగులు చేసిన సర్ఫరాజ్ నే కొనసాగించారు. అలాగే కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్ స్థానంలో ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చారు.