అబ్బే భారత్ కు అంత సీన్ లేదు గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియా ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉంది. కొన్ని రోజుల బ్రేక్ తర్వాత ఆస్ట్రేలియా టూర్ కు వెళ్ళనున్న భారత జట్టు అక్కడ ఐదు టెస్టుల సిరీస్ ఆడబోతోంది.
న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియా ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉంది. కొన్ని రోజుల బ్రేక్ తర్వాత ఆస్ట్రేలియా టూర్ కు వెళ్ళనున్న భారత జట్టు అక్కడ ఐదు టెస్టుల సిరీస్ ఆడబోతోంది. ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గత రెండు పర్యాయాలు గెలిచిన భారత్ ఇప్పుడు మూడోసారి గెలవాలని పట్టుదలగా ఉంది. అయితే ఈ సారి టీమిండియా ఫామ్ చూస్తే మాత్రం హ్యాట్రిక్ కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే స్వదేశంలో న్యూజిలాండ్ తో సిరీస్ లో మన బ్యాటర్ల ఫామ్ దీనికి ప్రధాన కారణం. సీనియర్ క్రికెటర్లలో ఎవ్వరూ కూడా ఫామ్ లో లేరు. కివీస్ పై పంత్ తప్పిస్తే మిగిలిన వారంతా నిరాశపరిచారు. రోహిత్ , కోహ్లీ, గిల్ , రాహుల్ ఇలా ఏ ఒక్కరూ స్థాయికి తగినట్టు ఆడలేదు. దీంతో ఆడిన మూడు టెస్టుల్లోనూ పరాజయం పాలై పరువు తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కంగారూ గడ్డపై టీమిండియా ఎంతవరకూ రాణిస్తుందనేది చూడాలి.
పైగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే భారత్ ఇంకా నాలుగు టెస్టులు గెలవాల్సి ఉంది. ఆసీస్ పై 4-0 సిరీస్ గెలవడం అంత ఈజీ కాదనేది ఒప్పుకోవాల్సిందే.. తాజాగా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం ఆసీస్ గడ్డపై భారత్ ఈ సారి సిరీస్ గెలవలేదంటూ జోస్యం చెప్పాడు. భారత్ డబ్యూటీసీ ఫైనల్‌కు చేరుతుందని తాను అనుకోవడం లేదన్నాడు. 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై టీమిండియా 4-0తో ఓడించలేదని అంచనా వేశాడు. ఒకవేళ ఆసీస్‌ను భారత్ ఓడిస్తే మాత్రం తాను గాల్లో తేలుతానంటూ వ్యాఖ్యానించాడు. అసలు డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదంటూ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాలో సిరీస్ గెలుపుపైనే దృష్టిపెట్టాలని సూచించాడు. అది 1-0 లేదా 2-0, 3-1, 2-1 తేడాతో సిరీస్ గెలిచినా పర్వాలేదన్నాడు. ఇప్పుడు సిరీస్ గెలవడమే ముఖ్యమన్నాడు. భారత క్రికెట్ అభిమానులందరూ ప్రస్తుతం తీవ్ర నిరాశలో ఉన్నారనీ, ఆసీస్ పై సిరీస్ గెలిచి మళ్లీ ఫ్యాన్స్‌లో జోష్ నింపాలంటూ గవాస్కర్ భారత క్రికెటర్లకు సూచించాడు. ఒకవైపు సౌతాఫ్రికాలో యువ జట్టు నాలుగు మ్యాచ్ ల టీ ట్వంటీ సిరీస్ ఆడుతుండగా.. టెస్ట్ క్రికెటర్లు మాత్రం మరో వారం రోజుల్లో ఆస్ట్రేలియాకు పయనం కానున్నారు. నవంబర్ 22 నుంచి ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆరంభం కానుండగా… తొలి టెస్టుకు పెర్త్ ఆతిథ్యమిస్తోంది,