Chandrababu Naidu: ప్రస్తుతానికి నో రిలీఫ్! తీర్పుపై భిన్నాభిప్రాయాలు.. CJI ముందుకు క్వాష్ పిటిషన్..
ఈ కేసులో తీర్పుపై న్యాయమూర్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ కేసు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి బదిలీ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఈ కేసుపై సుప్రీం కోర్టు తాజా నిర్ణయం వెల్లడించింది.

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development case)లో టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడు (Chandrababu Naidu)కు ఎలాంటి ఊరటా దక్కలేదు. ఈ కేసులో తీర్పుపై న్యాయమూర్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ కేసు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి బదిలీ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఈ కేసుపై సుప్రీం కోర్టు తాజా నిర్ణయం వెల్లడించింది. జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన సుప్రీం ద్విసభ్య ధర్మాసనం సెక్షన్ 17ఏ కేసుపై విచారణ జరిపింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సెక్షన్ 409 కింద ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిన సంగతి తెలిసిందే.
MAHESH BABU: మహేశ్‌బాబుకు మరో కొత్త టెన్షన్..
52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అయ్యారు. అయితే ఏపీ సీఐడీ అధికారులు తనపై అక్రమంగా కేసు బనాయించారంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. సెక్షన్ 17A ప్రకారం తన అరెస్టు అక్రమమంటూ బాబు పిటిషన్ వేశారు. 17A ప్రకారం అరెస్ట్‌కు ముందు గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని, ఈ సెక్షన్ బాబు కేసుకు వర్తించదని ఏపీ సీఐడీ.. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. ఈ కేసులో 2023 అక్టోబర్ 20నే తుది విచారణ జరిగింది. అనంతరం తీర్పును జనవరి 16కు వాయిదా వేసింది ధర్మాసనం. మంగళవారం దీనిపై తీర్పు వెలువరించారు. అయితే, తీర్పు విషయంలో న్యాయమూర్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒకరు చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని.. మరొకరు సెక్షన్ వర్తించదని తీర్పు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేసును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదిలీ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటూ ఆ తర్వాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు.. మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులపై కేసులు పెడుతున్నాయి.
ఇలాంటి సందర్భాల్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులు పెట్టేటప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం 17A సెక్షన్ కింద గవర్నర్ అనుమతులు తీసుకోవాలి. చంద్రబాబు విషయంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదని, అందువల్ల ఆయనపై దాఖలైన కేసు కొట్టివేయాలని కోరుతూ ఆయన తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదించారు. ప్రొసీజర్ ప్రకారం వెళ్ళకుండా ఏపీ సీఐడీ అధికారులు అత్సుత్యాహం చూపిస్తున్నారని మొదటి నుంచీ టీడీపీ ఆరోపిస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఏపీ సీఎం జగన్ రాజకీయ కక్షతోనే కేసులు పెట్టించారని టీడీపీ నేతలు మండిపడ్డారు. తాజా నిర్ణయం నేపథ్యంలో ఈ కేసు విచారణ మరికొంతకాలం కొనసాగుతుంది. తర్వాత సుప్రీం కోర్టు తీసుకునే నిర్ణయంపైనే చంద్రబాబు భవితవ్యం ఆధారపడి ఉంటుంది.