వారిద్దరిలో ఒకరిని తీసుకోండి, భారత్ కు భజ్జీ సలహా
భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి గబ్బాలో మొదలు కానుంది. తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా పింక్ బాల్ మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేసింది. బ్యాటర్లు పూర్తిగా విఫలమైన వేళ ఘోరపరాజయాన్ని చవిచూసింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి గబ్బాలో మొదలు కానుంది. తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా పింక్ బాల్ మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేసింది. బ్యాటర్లు పూర్తిగా విఫలమైన వేళ ఘోరపరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు సిరీస్ లో రెండు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో ఇకపై సిరీస్ మరింత రసవత్తరంగా సాగబోతోందని తేలిపోయింది. ఇప్పుడు ఫోకస్ అంతా గబ్బాకు షిప్ట్ అయింది. గబ్బాలో భారత్ జట్టు గెలవాలంటే.. మూడు పనులు చేయాలని మాజీ వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. గబ్బాలో భారత్ జట్టు బ్యాటర్లు కాస్త సహనంతో ఆడాలని చెప్పాడు. సహనంతో క్రీజులో నిలిచి కనీసం 30-40 పరుగుల చిన్న పార్టనర్ షిప్ నెలకొల్పడానికైనా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ప్రయత్నించాలని సూచించాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాక స్కోరు అదే వస్తుందన్నాడు. గబ్బా మైదానంలో గెలవాలంటే.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కనీసం 350 రన్స్ వరకూ స్కోర్ చేయాలన్నాడు.
ఇక బౌలింగ్ పరంగానూ భజ్జీ పలు కీలక సూచనలు చేశాడు. గబ్బా పిచ్ ను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా బౌలింగ్ చేయాలని అభిప్రాయపడ్డాడు. అడిలైడ్‌లో సెంచరీ చేసిన హెడ్ బౌన్సర్లను సమర్థంగా ఆడలేడన్నాడు. బౌన్సర్లు సంధిస్తూనే అతను లెగ్ సైడ్ బాల్స్‌ను ఆడేలా టెంప్ట్ చేయాలన్నాడు. ఇక పేస్ విభాగంలో మార్పులు సూచించాడు. ఫాస్ట్ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్‌లో ఒకరికి గబ్బాలో ఛాన్స్ ఇవ్వాలన్నాడు. బౌలింగ్ విభాగానికి కొత్తదనం జోడిస్తే బాగుంటుందన్నాడు. గబ్బా పిచ్‌లో వేగం, బౌన్స్ కూడా ఉంటుందనీ, అందుకే ప్రసీద్ టీమ్‌లో ఉంటే ఆస్ట్రేలియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టొచ్చని హర్భజన్ సింగ్ చెప్పాడు. అడిలైడ్ మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన హర్షిత్ రాణాను తర్వాతి మ్యాచ్ కు తప్పించే అవకాశముందని తెలుస్తోంది. గత రికార్డుల పరంగా ప్రసిద్ధ కృష్ణకు ఛాన్స్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది.