Tamil Nadu : జలదిగ్బంధంలో తమిళనాడు.. మరిన్ని హెలికాప్టర్ కావాలి : సీఎం స్టాలిన్
తమిళనాడును భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజు 525 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
తమిళనాడును భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజు 525 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
తమిళనాడులో ఎడతెరిపి లేకుండా వానలు పడటంతో.. తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, విరుదునగర్, తెనాకాశి జిల్లాలో భారీ వర్షాలు పడటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మరికొన్ని చోట్ల ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించి ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఇక మరోవైపు భారీ వర్షాలతో . తూత్తుకూడి రైల్వే స్టేషన్లో భారీగా వర్షపు నీరు చేరుకుంది. ఆ నీటిలో రైల్వే స్టేషన్ మునిగిపోయింది. ఇళ్లలోకి నీరు చేరి జనజీవనం స్తంభించింది. ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో 48 గంటల పాటు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
- మరిన్ని హెలికాప్టర్ కావాలి..
దక్షిణాది జిల్లాలైన తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి, రామాంతపురం, పుదుకొట్టాయ్ , కన్నియాకుమారి జిల్లాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు మరికొన్ని హెలికాప్టర్లను కేటాయించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సీఎం స్టాలిన్ మంగళవారం లేఖ రాశారు. 1871 తర్వాత తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో కుండపోత వర్షాలతో పెనుముప్పు వాటిల్లిందని, సుమారు 40 లక్షల మంది జలదిగ్బంధంలో అన్న.. పానీయాలు అందక అలమటిస్తున్నారని పేర్కొన్నారు. తామ్రభరణి నది పోటెత్తడంతో తూత్తుకుడి, శ్రీవైకుంఠం ప్రాంతాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయని, కనెక్టింగ్ రోడ్లు వరదల్లో కొట్టుకుపోయిన కారణంగా సహాయాలను బాధితులకు సకాలంలో అందించలేకున్నామని తెలిపారు.
ప్రస్తుతం వైమానికదళం నుంచి నాలుగు హెలికాప్టర్లు, నావికాదళం నుంచి రెండు హెలికాప్టర్లు, కోస్ట్‌గార్డ్ నుంచి రెండు హెలికాప్టర్ల ద్వారా సహాయకాలు అందజేస్తున్నామన్నారు. ఈ పరిస్థితుల్లో మరికొన్ని హెలికాప్టర్లను కేటాయిస్తే అన్ని ప్రాంతాలకు సకాలంలో వెళ్లి వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి తగు సదుపాయాలు కల్పించవచ్చునని లేఖలో విజ్ఞప్తి చేశారు.
- ఉరకలెత్తిన కుట్రాలం జలపాతం..
మరోవైపు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎత్తైన కొండలపై జారిపడుతున్న నీటి అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. తెనాకాశి జిల్లాలో ఉన్న కుట్రాలం జలపాతం పొంగిపొర్లుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా జారువారుతోంది. కాగా ఔషధ గుణాలు కలిగిన జలపాతంగా కుట్రాలం పేరొందింది. అందుకే అక్కడ స్నానమాచరించేందుకు సందర్శకులు భారీగా వెళ్తుంటారు.