Raj Bhavan Vs Pragati Bhavan: సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళిసై.. పాత వివాదం సమసిపోలేదా..?

కేసీఆర్, తమిళ సై మధ్య విభేదాలు ఇంకా తొలిగిపోలేదా.. కేబినెట్ ఆమోదించిన ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ ఎందుకు తిరస్కరించారు. రానున్న రోజుల్లో ఇది ఏ పరిస్థితులకు దారితీస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 26, 2023 | 09:09 AMLast Updated on: Sep 26, 2023 | 9:09 AM

Tamilisai Rejected The List Of Mlcs Approved By Kcr Cabinet

తెలంగాణలో రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ల మధ్య అంతరం కొనసాగుతూనే ఉంది. గవర్నర్‌ తమిళిసై, కేసీఆర్‌ ప్రభుత్వం మధ్య వివాదాలు సమసిసోలేదు. గవర్నర్‌ నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాలో ప్రభుత్వం సిఫార్సు చేసిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ పేర్లను తమిళి సై తిరస్కరించడంతో మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. గతంలో ఎమ్మెల్సీ కోటా కింద పాడి కౌశిక్‌ రెడ్డిని ప్రభుత్వం సిఫార్సు చేసిన తర్వాత ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహించలేదన్న కారణంతో తిరస్కరించారు. అప్పుడు కూడా ఇలానే దుమారం రేగింది. దీంతో కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్‌.

రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ వివాదం ఈ నాటిది కాదు. ఈ నాలుగేళ్లలో ఎన్నోసార్లు ప్రభుత్వంతో విభేదించారు గవర్నర్‌ తమిళిసై. ప్రభుత్వ కార్యక్రమాలకు తనను ఆహ్వానించట్లేదని, ప్రోటోకాల్‌ పాటించట్లేదని గవర్నర్‌ తమిళిసై బహిరంగంగానే విమర్శలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ఆహ్వానించకపోవడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ, మండలి ఆమోదించిన కీలక బిల్లుల్లో కొన్నిటిని గవర్నర్‌ తమిళి సై తిప్పిపంపడం, మరికొన్నిటిని పెండింగ్‌లో పెట్టడంతో రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ మధ్య నిత్యం వివాదం నడుస్తుండేది. ఆర్టీసీ బిల్లును పెండింగ్‌లో పెట్టినప్పుడు రాజ్‌భవన్‌ ముట్టడికి కార్మికులు యత్నించారు. ఆ బిల్లులో పలు వివరణలు కోరడంతో గవర్నర్‌కు ప్రభుత్వం బదులిచ్చింది. ఆ తర్వాతే ఆమోదముద్ర వేశారు గవర్నర్‌ తమిళి సై.

ఇటీవల పట్నం మహేందర్‌రెడ్డి మంత్రి ప్రమాణస్వీకారం చేసిన రోజున గవర్నర్‌ తమిళిసై సచివాలయంలో దేవాలయం, మసీదు, చర్చి ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ ఆహ్వానంతో సచివాలయానికి గవర్నర్‌ వెళ్లారు. గవర్నర్‌, సీఎం కేసీఆర్‌ల సమక్షంలో ప్రార్థనామందిరాల ప్రారంభోత్సవం జరిగింది. గవర్నర్‌కు సచివాలయాన్ని చూపించారు సీఎం కేసీఆర్. దీంతో ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌ మధ్య అంతరం తగ్గిపోయిందని అందరూ ఊహించారు కానీ.. నామినేటెడ్‌ ఎమ్మెల్సీ కోటాలో కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ పేర్లను గవర్నర్‌ తిరస్కరించడంతో కథ మళ్లీ మొదటికే వచ్చినట్లయ్యింది.

ఎమ్మెల్సీ పదవులకు నామినేటెడ్ కోటాలో ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థులకు తగిన అర్హతలు లేవని రాజ్‌భవన్‌ స్పష్టం చేసింది. ఆర్టికల్ 171 (5) ప్రకారం కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌కు అర్హతలు సరిపోవని తమిళిసై తెలిపారు. కళలు, సాహిత్యం, సైన్స్ రంగాల్లో ఎంతో మంది ప్రముఖులు, అర్హతలు ఉన్నా వారిని కాకుండా.. రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లు సిఫార్సు చేయడం సరైనది కాదన్నారు. ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్ చేయకూడదో ప్రజాప్రాతినిధ్య చట్టంలో స్పష్టంగా ఉందని తేల్చిచెప్పారు.

కేబినెట్ ఆమోదించి పంపిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్‌ తిరస్కరించడాన్ని తప్పుపట్టారు మంత్రులు, బీఆర్‌ఎస్ నేతలు. గవర్నర్ తమిళిసై చర్య సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అని, గవర్నర్ రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేబినెట్ ప్రతిపాదించిన పేర్లు తిరస్కరించడం అప్రజాస్వామికమన్నారు. అయితే బీఆర్‌ఎస్ నేతల వాదనను బీజేపీ నేతలు తిప్పికొడుతున్నారు. గవర్నర్‌ తమిళిసై సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. కేసీఆర్‌ తనకు అనుకూలమైన వారిని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాల్సిన అవసరంలేదన్నారు కిషన్‌రెడ్డి. అయితే ఇప్పుడు గవర్నర్‌ తిరస్కరించిన ఇద్దరు నేతలు బడుగువర్గాలకు చెందినవారు కావడంతో ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.