BJP: బీజేపీ ఛీఫ్ అవ్వాలంటే నోటిదూల, కాంట్రవర్శీలు మస్ట్! ఆ ఫార్ములాతోనే దక్షిణాది రాష్ట్రాల్లో మోదీ పాగా?
మీలో కాంట్రవర్శీలు క్రియేట్ చేసే టాలెంట్ ఉందా..? మీరు అందరితో సమానంగా గొడవలు పెట్టుకోగలరా..? లాజిక్ లేకుండా.. అసత్య ప్రచారాలు చేయగలరా..? అయితే మీరు కూడా బీజేపీ ఛీఫ్ కావొచ్చు..!
బీజేపీ పార్టీ ఛీఫ్ కావాలంటే అర్హతలేంటి..? మంచి చదువు..? అసలు రాజకీయాలకు చదువుతో పని ఏముంది..? సో..అది కాదు..! మరి మంచి ప్రవర్తన..? అస్సలు కానేకాదు..? అందరిని కలుపుకోని ముందుకు వెళ్లే గొప్ప నాయకత్వ లక్షణాలు..? ఛీ ఛీ.. అసలు కాదు.. ఇవాళ, రేపు గల్లీలో క్రికెట్ టీమ్‌ని మెయింటైన్ చేసేవాడికి కూడా లీడర్‌షిప్ స్కిల్స్ ఉంటున్నాయి. బీజేపీ ఛీఫ్ కావాలంటే చీప్‌గా ఇవేమీ సరిపోవు.. అంతకమించిన క్వాలిఫికేషన్ ఉండి తీరాలి. అందులో ప్రధానమైనది..కాంట్రవర్శీలు క్రియేట్ చేసే టాలెంట్..! దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్థాయికి మించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలి. నిత్యానంద స్వామికి సైన్సు సూత్రాలకు మించిన లాజిక్‌లు ఉండాలి.. ఇవ్వని ఉంటే మీరు కూడా ఏదో ఒక రాష్ట్రానికి పార్టీ ఛీఫ్ కావొచ్చు. తెలంగాణ, తమిళనాడు బీజేపీ ఛీఫ్‌లను చూస్తే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది.
ఇక్కడ బండి.. అక్కడ అన్నామలై:
తెలంగాణలో బీజేపీ గురించి గల్లీగల్లీలో మాట్లాడుకుంటున్నారంటే అది బండి సంజయ్ పుణ్యమే! ఆయన చేసే వ్యాఖ్యలు.. ఆయన మాట తీరు.. విద్వేషాలను రెచ్చగొట్టే నైపుణ్యం.. కాంట్రవర్శీలతో వార్తల్లో నిలిచే నైజం..ఆయనకు పార్టీ ఛీఫ్‌గా బీజేపీ పెద్దల వద్ద మంచి మార్కులు పడేలా చేశాయి. అయితే రేపో మాపో బండిని కాకుండా వేరే ఎవరికైనా కూడా పార్టీ ఛీఫ్ ఇవ్వొచ్చు కానీ.. బండి సంజయ్‌ని రిప్లేస్ చేయడం మాత్రం బీజేపీ హైకమాండ్‌కి సాధ్యమయ్యే పని కాదు. సొంతపార్టీలోనే ఆయన్ను వ్యతిరేకించేవాళ్లు ఎంత మంది ఉన్నా..ఇప్పటివరకు కూడా బండి పార్టీ ఛీఫ్‌గానే కొనసాగుతున్నారంటే అది ఆయన కాంట్రవర్శీల టాలెంటే!
సీఎం కేసీఆర్ సైతం పనిగట్టుకొని.. కాంగ్రెస్‌ని తిట్టడం పక్కనపెట్టి మరీ బండి సంజయ్‌ని టార్గెట్ చేస్తున్నారంటే ఆయన ఇంపాక్ట్ గట్టిగానే ఉన్నట్టు లెక్క! మంచో, చెడో పక్కన పెడితే కాంట్రవర్శీలతో జనాల్లోకి వెళ్లడం చాలా ఈజీ. మంచి పనులు చేస్తే వందలో పది మందికి కూడా తెలియదు.. అదే నోటికొచ్చింది వాగితే మాత్రం వందలో 90మంది వింటారు..ఆలోచిస్తారు చర్చించుకుంటారు..ఒకరైనా బండి చెప్పింది నిజమేనేమోనన్న కంక్లూషన్‌కి వస్తారు.. అది బీజేపీ స్ట్రాటజీ! ఇప్పుడదే ఫార్ములా తమిళనాడులోనూ వర్క్ అవుట్ అవుతున్నట్టు కనిపిస్తోంది.
అన్నామలై..మరో బండి సంజయ్:
తమిళనాడు బీజేపీ ఛీఫ్ అన్నామలై పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. నిన్నగాక మొన్న ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో బీజేపీకి క్రెడిట్లు ఇచ్చిన అన్నామలై మరోసారి తనదైన స్టైల్‌లో రాహుల్‌గాంధీని టార్గెట్ చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య లేదు అని.. రాహుల్ గాంధీకి ఉద్యోగం లేకపోతే ఇండియా అంతా లేనట్టు కాదు అని కౌంటర్ వేశారు అన్నామలై. మోదీ ఇంటి పేరు విషయంలో కోర్టు తీర్పు తర్వాత ఎంపీగా రాహుల్‌గాంధీని డిస్‌క్వాలిఫై చేశారు. కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా రాహుల్ గాంధీ 2019లో ఘనవిజయం సాధించారు. ఇప్పుడు రాహుల్‌కి ఎలాంటి జాబ్ లేదంటూ అన్నామలై చురకలంటించారు. ఇక్కడ దేశంలోని నిరుద్యోగ సమస్య ఉన్నా.. దాని గురించి కాకుండా రాహుల్ గాంధీ గురించి చర్చించుకునేలా అన్నామలై రూటు మార్చడంలో సక్సెస్ అయ్యారు..
ఇన్నీ తెలివితేటలున్న అన్నామలై చదువులో కూడా తోపే. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మేనేజ్‌మెంట్ అయిన అన్నామలై.. యూపీఎస్సీ పరీక్షకు అర్హత సాధించి ఇండియన్ పోలీస్ సర్వీసెస్(IPS) అధికారిగా దేశానికి సేవలందించారు. 2013లో కర్ణాటక పోలీసు శాఖలో ఏఎస్పీగా తొలిసారి పోస్టింగ్ పొందిన ఆయన ఆ తర్వాత చిక్కమగళూరులోని ఉడిపిలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2019లో అన్నామలై దక్షిణ బెంగళూరులో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా ఉన్న సమయంలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 25 ఆగస్టు 2020న బీజేపీలో చేరి తమిళనాడు రాష్ట్ర బీజేపీ శాఖ ఉపాధ్యక్షుడిగా.. ఆ తర్వాత అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
ఇంత కెరీర్ గ్రాఫ్ ఉన్న అన్నామలై.. ఫేక్ న్యూస్‌లు పోస్ట్ చేసి గతంలో ఇరుక్కున్నాడు. ఇటివలే మహిళా రెజ్లర్లను అవమానించాడు కూడా. సీఎం స్టాలిన్‌కు కౌంటర్లు వేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు అన్నామలై. అతను బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తమిళనాడుపై హైకమాండ్ కూడా ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. కర్ణాటక, తెలంగాణ తర్వాత దక్షిణాదిన తమిళనాడులోనే పాగా వేయలన్నది బీజేపీ ప్లాన్. అందుకే కాంట్రవర్శీలతో జనాల్లోకి వెళ్లే అన్నామలై లాంటి లీడరే పార్టీకి అవసరమని భావించదనుకుంటా!