Japan PM : ప్రధానులే టార్గెట్..వరుసగా హత్యాయత్నాలు.. జపాన్‌లో ఏం జరుగుతోంది ?
సరిగ్గా 9 నెలల క్రితం..నడిరోడ్డుపై..జపాన్ ప్రధానిని దుండగులు కాల్చి చంపేశారు. మళ్లీ ఇప్పుడు మరో దాడి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రిని హత్య చేసేందుకు కుట్ర. హత్యాయత్నం నుంచి ప్రధాని ఫుమియో కిషిదా సురక్షితంగా బయటపడ్డా ఒకటి తర్వాత మరొకటి ప్రధానమంత్రులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు జపాన్‌తో పాటు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి.
పశ్చిమ జపాన్‌లోని వకయామ నగరంలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి ఫుమియో కిషిదా ఓ కార్యక్రమంలో ప్రసంగించడానికి సిద్ధమవుతుండగా ఆయనపై దాడి జరిగింది. ఓ వ్యక్తి ప్రధానమంత్రిని టార్గెట్‌గా చేసుకుని స్మోక్ బాంబు విసిరాడు. అప్పటికే అప్రమత్తమైన భద్రతా దళాలు వెంటనే ప్రధానిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో ప్రధాని గాయపడలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జపాన్ అధికారిక మీడియా ప్రకటించింది.
అసలేం జరిగింది ?
పోర్ట్ సిటీ వకయామ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి ఫుమియో కిషిదా సాయికాజాకి ఫిషింగ్ హార్బర్ మొత్తం కలియ తిరిగారు.బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించడానికి సిద్ధమయ్యారు. ఆయన స్పీచ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతుండగా ఒక్కసారిగా పేలుడు జరిగిన శబ్దం వినిపించింది. ఏం జరుగుతుందో అర్థంకాక జనం పరుగులు తీశారు. అదే సమయంలో ఓ వ్యక్తి పైప్ ఆకారంలో ఉన్న స్మోక్ బాంబును ప్రధానిపై విసిరాడు. వెంటనే గుర్తించిన భద్రతా సిబ్బంది ప్రధానిని చుట్టుముట్టారు. వెంటనే ఆయన్ను అక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ప్రధాని అక్కడకు ఎందుకెళ్లారు ?
ప్రస్తుతం జపాన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి.వకయామ జిల్లా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని పోర్ట్ సిటీకి వచ్చారు. హార్బర్ మొత్తం పరిశీలించి కార్మికులతో మాట్లాడిన తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగించడానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో ఆయనపై దాడి జరిగింది. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో ప్రాణాలతో తప్పించుకున్నారు జపాన్ ప్రధాని
షింజో అబే ఘటనతో సంబంధముందా ?
షింజో అబే..జపాన్‌కు సుధీర్ఘ కాలం ప్రధానమంత్రిగా పనిచేశారు. సరిగ్గా 9 నెలల క్రితం నడిరోడ్డుపై దుండగులు ఆయన్ను కాల్చి చంపారు. రాజకీయ నేతలపై అసలు దాడులే జరగని దేశంగా చెప్పుకునే జపాన్‌లో ప్రధానిని కాల్చి చంపడం ప్రపంచం వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుత ప్రధానిపై దాడికి, షింజో అబేపై దాడికి ఓ పోలిక ఉంది. ఇద్దరిపైనా ఎన్నికల ప్రచార సభల్లోనే కాల్పులు జరిగాయి. నారా సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి షింజో అబే ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా దాడి జరిగింది. తాజాగా ఫుమియో కిషిదా కూడా ఎన్నికల ప్రసంగం మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ఈ లోపే దుండగుడు విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న లిబరల్ డెమొక్రటిక్ పార్టీ విధానాలు నచ్చకే దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కీలక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధానిను చంపేందుకు దాడి జరగడం భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది.