TDP candidates : టీడీపీకి అభ్యర్థులు కరువు.. అవునా? నిజమా? అభ్యర్థులు దొరక్క అల్లాడిపోతున్న టీడీపీ..

తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కంచుకోట లాంటి చోట ఎంపీ అభ్యర్థులు కరువయ్యారు. రా.. రమ్మని పిలిచి టిక్కెట్‌ ఇస్తామన్నా.. సారీ.. నోనో అంటున్నారట. అసెంబ్లీ టిక్కెట్‌కు ఓకేగానీ.. లోక్‌సభకు మాత్రం ససేమిరా అంటున్నారట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 17, 2023 | 02:08 PMLast Updated on: Dec 17, 2023 | 2:08 PM

Tdp Is Short Of Candidates Is It Is It True Tdp Is Struggling To Find Candidates

 

తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కంచుకోట లాంటి చోట ఎంపీ అభ్యర్థులు కరువయ్యారు. రా.. రమ్మని పిలిచి టిక్కెట్‌ ఇస్తామన్నా.. సారీ.. నోనో అంటున్నారట. అసెంబ్లీ టిక్కెట్‌కు ఓకేగానీ.. లోక్‌సభకు మాత్రం ససేమిరా అంటున్నారట. నౌ ఆర్‌ నెవర్‌ అన్నట్టుగా రాజకీయ పరిస్థితులు మారిపోవడంతో.. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆచి తూచి అడుగులేస్తోంది టీడీపీ. ఇంకా చెప్పాలంటే ఒకటికి రెండు సార్లు క్రాస్‌ చెక్‌ చేసుకుని అర్హుల్ని ఎంపిక చేసే పని మొదలైందట. కానీ.. అదంతా.. ఇబ్బడి ముబ్బడిగా అభ్యర్థులు ఉండి, సీటు నాకంటే నాకంటూ పోటీలు పడే దగ్గర మాత్రమే. కానీ.. ఉమ్మడి అనంతపురం జిల్లా ఎంపీ సీట్ల విషయంలో సీన్ రివర్స్‌లో ఉందట. ఇక్కడ అసెంబ్లీ బరిలో నిలిచే నాయకుల లిస్ట్ భారీగానే ఉంది. కానీ లోక్‌సభకు వెళ్ళమంటే మాత్రం చాలామంది నాయకులు అమ్మో.. అంటున్నారట. ఎన్నికల టైం దగ్గరపడుతున్నా.. అసలు తమకు ఎంపీ టిక్కెట్‌ కావాలని అడిగే నాయకుడు ఒక్కరూ లేరన్నది అనంతపురం టీడీపీ ఇంటర్నల్‌ టాక్‌.

దీంతో అసలెందుకీ పరిస్థితి వచ్చింది? లోక్‌సభకు పోటీ చేసే నాయకులు ఎందుకు కరవయ్యారన్న పోస్ట్‌ మార్టం మొదలైనట్టు చెప్పుకుంటున్నారు నేతలు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అందులో హిందూపురం ఒకటి, అనంతపురం మరోటి. 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి నిమ్మల కిష్టప్ప పోటీ చేసి ఓడిపోయారు. అలాగే అనంతపురం నుంచి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి కూడా ఓడిపోయారు. ఓటమి తర్వాత లోకల్‌ పాలిటిక్స్‌ మీద అంతగా శ్రద్ధ పెట్టలేదట జేసీ పవన్‌. ఇంకా చెప్పాలంటే తన వ్యాపారాలు చూసుకోవడం తప్ప రాజకీయాల మీద అంతగా ఆసక్తి చూపడం లేదంటున్నారు. పార్టీ అధిష్టానం గట్టిగా అడిగి పోటీ చేయమంటే అది ఆలోచిస్తారు తప్ప.. తనకు తానుగా సీటు కావాలని అడిగే పరిస్థితి లేదన్నది జేసీ ఫ్యామిలీ సన్నిహిత వర్గాల మాట. ఇక నిమ్మల కిష్టప్ప విషయానికొస్తే.. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా సుదీర్ఘకాలం పని చేశారాయన. టీడీపీకి, మరీ ముఖ్యంగా చంద్రబాబుకు వీర విధేయుడిగా పేరుంది. అయితే ప్రస్తుతం ఉన్న పొలిటికల్‌ పోటీ వాతావరణం, కుల సమీకరణలు దృష్టిలో ఉంచుకుని దూరంగా ఉంటు న్నారన్నది ఆయన సన్నిహిత వర్గాలు చెప్పే మాట. కేవలం బీసీ మార్క్, టీడీపీ సింబల్‌తోనే ఇన్నేళ్ళు ఆయన గెలుస్తూ వస్తున్నారన్నది లోకల్‌ టాక్‌.

ఇప్పుడు సన్నివేశాలు, సమీకరణాలు మొత్తం మారిపోవడంతో ఈ సారి పోటీ నుంచి తప్పుకోమని అధిష్టానమే ఆయనకు సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో గతంలో పోటీ చేసిన ఈ ఇద్దరు తప్పుకుంటే కొత్త అభ్యర్థులు ఎవరన్న ప్రశ్న వస్తోంది. వైసీపీ నుంచి గతంలో మాదిరిగానే జిల్లాలో బలంగా ఉన్న ఈ రెండు సామాజిక వర్గాల నేతల్నే బరిలో దింపే అవకాశం ఉందంటున్నారు. హిందూపురం లోక్‌సభ పరిధిలో అత్యధికంగా కురుబలు ఉన్నారు. ఇటు అనంతపురం పార్లమెంట్ లో బోయలవి మెజార్టీ ఓట్లు. ఈ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో వీరు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు. అందుకే ఈ ఫార్ములాతోనే వైసీపీ రాజకీయం చేస్తోంది. ఇప్పుడు టీడీపీ కూడా ఈ రెండు సామాజిక వర్గాల నేతల్లో బరిలో దింపాలని ఆలోచిస్తోందట. ఈక్రమంలో పెనుకొండ మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథిని హిందూపురం ఎంపీగా బరిలో దించాలనుకుంటున్నట్లు తెలిసింది. అదే విషయాన్ని ఆయనకు చెబితే.. లేదు లేదు.. నాకు అసెంబ్లీ సీటే కావాలని అన్నట్టు ప్రచారం ఉంది. ఇక అనంతపురం సీట్లో బోయ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ఎవరన్నది అసలు క్లారిటీ లేదట. కొంత మంది ద్వితీయ శ్రేణి నాయకులు రేసులోకి వచ్చిన వారు ఎంత వరకు నెట్టుకొస్తున్నది అర్థం కాని పరిస్థితి. ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నా.. పార్లమెంట్ స్థానాల విషయంలో ఇంత స్తబ్దుగా ఉండటం గతంలో ఎప్పుడూ చూడలేదని అంటున్నారు పార్టీ వర్గాలు. చివరికి టీడీపీ అధిష్టానం ఎలాంటి అభ్యర్థుల్ని తెర మీదికి తెస్తుందో చూడాలి.