Lokesh: లోకేశ్ పాదయాత్రతో టీడీపీకి ఒరిగిందేంటి? వైసీపీకి పోయిందేంటి?
ఇలాగైతే 4వేలు కాదు కదా 40వేల కిలోమీటర్లు నడిచినా ఉపయోగముండదు! 100రోజులు పూర్తయిన నారా లోకేశ్ పాదయాత్రపై చర్చిండానికి ఏమైనా ఉందా? ఉంటే ఏముందో తెలుగు తమ్ముళ్లే చెప్పాలి.
సీఎం కావాలన్నా.. పోయిన అధికారం తిరిగి దక్కించుకోవాలన్నా.. ప్రజల్లో పాపులారిటీ సంపాదించాలన్నా.. రాజకీయంగా ఎదగాలన్నా.. పాదయాత్రకు మించిన ఆయుధం లేనే లేదు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. గతంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, జగన్..ఇదే విషయాన్ని నిరూపించారు. పాదయాత్రతో ప్రజల్లో మమేకమై తిరిగారు..అలానే అధికారం సొంతం చెసుకున్నారు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి రాహుల్ భారత్ జోడో యాత్ర దోహదపడిందంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో లోకేశ్ పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి లోకేశ్ యాత్రతో టీడీపీ అధికారంలోకి రాగలుగుతుందా..? పప్పు ముద్ర నుంచి లోకేశ్ బయటపడ్డాడా..? టీడీపీ నేతల హడావుడి తప్ప లోకేశ్ పాదయాత్రపై ఇప్పటి వరకూ చర్చేదీ..? చర్చించుకునే సందర్భం ఒక్కటైనా ఉందా..? ఇలాగైతే 400 రోజులు, 4000 కిలోమీటర్లు నడిచినా ఉపయోగం ఏముంటుంది..?
లోకేశ్ గ్రాఫ్ ఇంచ్ అయినా పెరిగిందా?
బాణసంచా మోత, డప్పు చప్పుళ్లతో నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర జాతరను తలపిస్తుందంటూ తెలుగు తమ్ముళ్లు తెగ ఆనందపడిపోతున్నారు. డప్పు చప్పుళ్ల సంగతి సరే.. ప్రజల గుండె చప్పుళ్ల మాటేంటి..? లోకేశ్ ప్రజల నాడి పట్టారా? వాళ్ల బాధను అర్థం చేసుకున్నారా? అసలే జగన్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న ప్రచారం జరుగుతోంది..ఇదే సమయంలో ప్రజలకు కొండంత భరోసాను ఇస్తే లోకేశ్ గ్రాఫ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయేది. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే లోకేశ్ పాదయాత్రతో టీడీపీకి ఒరిగిందేమి లేదని అర్థం అవుతుంది. అసలు లోకేశ్ పాదయాత్రపై ప్రజలు చర్చించుకుంటున్న సందర్భాలు లేనే లేవు. ఇలాగైతే కష్టమేనని పార్టీ సీనియర్ నేతలే తలలు పట్టుకుంటున్న దుస్థితి దాపరించింది.
ఇదేం హాడావుడి బాబోయ్:
పాదయాత్ర సందర్భంగా 100 రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగిన లోకేశ్ మొత్తంగా 400రోజుల్లో 4వేల కిలోమీటర్లు తిరుగుతానంటున్నారు. ఇప్పటివరకు తిరిగిన 100రోజుల్లో లోకేశ్ ప్రజలను ఉద్ధరించే మాటలు ఏం మాట్లాడారో తెలుగు తమ్ముళ్లకే తెలియాలి. ఎంత సేపు జగన్ ఓడిపోవాలని ప్రచారం చేస్తున్నారే తప్ప..అధికారంలోకి వస్తే టీడీపీ ఏం చేస్తుందో..ఆ చేసేది ఎలా చేస్తుందో వివరించిన దాఖలాలు లేవు. వాస్తవానికి జగన్ గ్రాఫ్ తగ్గిందన్న ప్రచారంలో నిజమెంతుందో తెలియదు కానీ చంద్రబాబును ప్రజలు మరోసారి నమ్ముతారా అంటే ఏమో చెప్పలేని పరిస్థితి. 2014-19మధ్యలో టీడీపీ పాలనపై విసుగుతోనే కదా ప్రజలు వైసీపీకి 151సీట్లు కట్టబెట్టారు. మరి ప్రజల్లో చంద్రబాబుపై నమ్మకం పెంచేలా లోకేశ్ యాత్ర సాగుతుందా అంటే లేదనే సమాధానమే వినిపిస్తోంది.
నిజానికి మన ఏపీ రాజకీయ నాయకులకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. జగనైనా.. చంద్రబాబైనా ఆ విషయంలో సమానమే.. అటు పార్టీ కార్యకర్తలు లేని పోని హాడావుడి చేయడం.. సమయం, సందర్భం లేకుండా ఈలలు, గోలలు చేయడం.. అది చూసి మన నాయకులు మురిసిపోవడం తరచూ చూసేదే. లోకేశ్ పాదయాత్రలో కూడా అవే సీన్లు కనిపిస్తున్నాయే తప్ప.. టీడీపీ ప్లస్ అయ్యేలా కానీ వైసీపీకి మైనస్ అయ్యేలా కానీ ఎలాంటి దృశ్యాలు కనిపించలేదు. మొత్తానికి ఈ 100రోజుల పాదయాత్రతో టీడీపీకి ఒరిగిందేమిలేదని.. వైసీపీకి కూడా పోయిందేమీలేదని క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది.