Nara Lokesh: తెలంగాణ ఎన్నికలకు దూరంగా టీడీపీ!? క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్..
తెలంగాణ ఎన్నికల విషయంలో క్లారిటీ ఇచ్చారు నారా లోకేష్. ఇక్కడ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు టీడీపీ ఓటు బ్యాంకు ఎవరికి పోతుంది అనే సందేహం చాలా మందిలో నెలకొంది.

TDP National President Nara Lokesh clarified that TDP is not contesting Telangana elections
తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తోందా లేదా. ఇదే విషయంలో రెండు రోజుల నుంచి చాలా కన్ఫ్యూజన్ నెలకొంది. పోటీ చేస్తుంది అని కొందరు చెప్తుంటే చేయడంలేదని కొందరు మాట్లాడారు. ఇక టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఈ విషయంలో స్పందించారు. చంద్రబాబుతో మాట్లాడిన తరువాత నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. కానీ ఈలోపే ఈ విషయంలో టీడీపీ నేత నారా లోకేస్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంలేదని చెప్పారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలంగాణలో కూడా కొంతమంది హడావిడి చేశారు. నిరసన కార్యక్రమాలంటూ బైక్ ర్యాలీలు, కార్ ర్యాలీలు తీశారు, చివరకు మెట్రో రైళ్లలో కూడా నల్ల చొక్కాలు వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. హైదరాబాద్ లో చంద్రబాబు క్రేజ్ అంటూ రచ్చ చేశారు. హైదరాబాద్ లో సెటిలర్ల ఓట్లను టీడీపీ ప్రభావితం చేయగలదు అనే సీన్ క్రియేట్ చేశారు. కానీ పోటీ చేయడంలేదని లోకేష్ ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పోటీ చేయట్లేదు సరే.. మరి టీడీపీ మద్దతు ఎవరికి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓకే వాళ్ల ఓట్లు వాళ్లే వేసుకుంటారు. కానీ పోటీ చేయకపోతే ఎవరో ఒకరికి మద్దతు తెలిపాలి. దీంతో వాళ్ల మద్దతు ఎవరికి ఉంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా.. ఆయన చంద్రబాబు మనిషి అనే ముద్ర ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకే టీడీపీ మద్దతుదారుల ఓట్లు వెళతాయని కొందరు అంటున్నారు. కానీ కొన్ని రోజుల నుంచి బీఆర్‌ఎస్ నేతలు కూడా టీడీపీ మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను వరుసగా ఖండిస్తున్నారు. టీడీపీ ఓట్‌బ్యాంక్‌ను తమవైపు మళ్లించుకునేందుకు టీడీపీ మీద ప్రేమ చూపిస్తున్నారంటూ విశ్లేషకులు చెప్తున్నారు. మరోపక్క ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీకి దిగుతోంది. ఈ రెండు పార్టీలను కాదని జనసేనకు టీడీపీ తమ మద్దతు తెలిపినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.