మళ్ళీ తిప్పేశారు రెండోరోజు టీమిండియాదే
న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవాన్ని తప్పించుకోవాలని పట్టుదలగా ఉన్న టీమిండియా దానికి తగ్గట్టే రాణిస్తోంది. మొదట తక్కువ స్కోరుకే కివీస్ ను కట్టడి చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో స్వల్ప ఆధిక్యాన్ని దక్కించుకుంది.
న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవాన్ని తప్పించుకోవాలని పట్టుదలగా ఉన్న టీమిండియా దానికి తగ్గట్టే రాణిస్తోంది. మొదట తక్కువ స్కోరుకే కివీస్ ను కట్టడి చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో స్వల్ప ఆధిక్యాన్ని దక్కించుకుంది. తర్వాత స్పిన్నర్లు మరోసారి తిప్పేసి న్యూజిలాండ్ ను దెబ్బతీశారు. ఫలితంగా మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతూ భారత్ ముందు ఊరించే లక్ష్యం కనబడుతోంది. మొదటి రోజు చివర్లో అనూహ్యంగా 3 వికెట్లు కోల్పోయిన భారత్ రెండోరోజు వ్యూహం మార్చింది. గిల్, పంత్ దూకుడుగా ఆడుతూ కివీస్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. గత మ్యాచ్ లో డిఫెన్స్ ఆడడంతో దెబ్బతిన్న మిడిలార్డర్ ఈ సారి మాత్రం చెలరేగింది. కివీస్ ఫీల్డర్లు పంత్, గిల్ ఇద్దరివీ క్యాచ్ లు వదిలేయడం భారత్ కు కలిసొచ్చింది. ఈ లైఫ్ లతో బతికిపోయిన గిల్, పంత్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. గిల్ 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో రిషభ్ పంత్ తన ట్రేడ్ మార్క్ సిక్స్‌లతో చెలరేగాడు. 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
పంత్ 60 పరుగులకు ఔటవగా… జడేజాతో కలిసి గిల్ ఇన్నింగ్స్ కొనసాగించాడు. గిల్ 90 పరుగులకు ఔటై తృటిలో శతకం చేజార్చుకోగా… చివర్లో వాషింగ్టన్ సుందర్ రెచ్చిపోయాడు. కివీస్ బౌలర్లను ఆటాడుకున్న సుందర్ కేవలం 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఐదు వికెట్లతో రాణించాడు. అయితే సుందర్ జోరుతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 28 పరుగుల ఆధిక్యం దక్కింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ ను తొలి ఓవర్లోనే ఆకాశ్ దీప్ దెబ్బకొట్టాడు. కెప్టెన్ లాథమ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక్కడ నుంచి భారత స్పిన్నర్లు చెలరేగిపోయారు. జడేజా, అశ్విన్ చెరొక ఎండ్ నుంచీ తమ స్పిన్ మ్యాజిక్ చూపించడంతో కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
విల్ యంగ్ హాఫ్ సెంచరీ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లలో ఎవ్వరూ పెద్ద స్కోర్లు చేయలేదు. భారత స్పిన్నర్ల జోరుకు కివీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రెండోరోజు ఆటముగిసే సమయానికి న్యూజిలాండ్ 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 143 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. చేతిలో మరో వికెట్ ఉంది. మూడోరోజు తొలి సెషన్ ఆరంభంలోనే కివీస్ ను ఆలౌట్ చేస్తే భారత్ ముందు ఊరించే లక్ష్యం ఉంటుంది. స్పిన్నర్లు పండగ చేసుకుంటున్న ఈ పిచ్ పై భారత్ ఆచితూచి ఆడితే టార్గెట్ ను ఛేజ్ చేయొచ్చు. 200పైన టార్గెట్ అయితే కష్టం అయ్యేదని, 160 పరుగుల లోపు లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ కు అవకాశముంటుందన్నది మాజీ ప్లేయర్ల మాట. కానీ స్పిన్ పిచ్ పై నాలుగో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. ఈ నేపథ్యంలో భారత్ బ్యాటర్లపైనే చివరి టెస్టులో మన గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ఇప్పటికే రెండు టెస్టులు గెలిచిన కివీస్ సిరీస్ ను కైవసం చేసుకోగా… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ ఈ మ్యాచ్ లో గెలిచి తీరాల్సిందే.