మనోళ్ళే ర్యాం”కింగ్స్” టీ ట్వంటీల్లో భారత్ హవా
టీ ట్వంటీ ఫార్మాట్ లో భారత్ డామినేషన్ కంటిన్యూ అవుతోంది. వరల్డ్ కప్ విజయం తర్వాత మన జోరు ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్ లోనూ భారత క్రికెటర్లు దుమ్మురేపారు. వారి సూపర్ ఫామ్ తో ఇప్పుడు టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లోనూ మనదే పైచేయిగా నిలిచింది.
టీ ట్వంటీ ఫార్మాట్ లో భారత్ డామినేషన్ కంటిన్యూ అవుతోంది. వరల్డ్ కప్ విజయం తర్వాత మన జోరు ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్ లోనూ భారత క్రికెటర్లు దుమ్మురేపారు. వారి సూపర్ ఫామ్ తో ఇప్పుడు టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లోనూ మనదే పైచేయిగా నిలిచింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో ఆల్ రౌండర్ విభాగానికి సంబంధించి హార్థిక్ పాండ్యా అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. హార్థిక్ టాప్ ప్లేస్ సాధించడం అతని కెరీర్ లో ఇది రెండోసారి. ఈ సిరీస్ తర్వాత రెండుస్థానాలు ఎగబాకిన పాండ్యా నెంబర్ వన్ ర్యాంకులో నిలిచాడు. ఇదిలా ఉంటే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. సఫారీ టూర్ లో రెండు వరుస సెంచరీలతో దుమ్మురేపిన తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు మెరుగై మూడో ర్యాంకుకు దూసుకొచ్చాడు.
ఈ సిరీస్ లో చివరి రెండు టీ ట్వంటీల్లో తిలక వర్మ విధ్వంసమే సృష్టించాడు. వరుసగా రెండు శతకాలతో రికార్డులు కొల్లగొట్టాడు. ఓవరాల్ గా సఫారీ టూర్ లో మొత్తం 280 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఈ ప్రదర్శనతోనే ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఏకంగా మూడో ర్యాంకులో నిలిచాడు. ప్రస్తుతం అగ్రస్థానంలో ట్రావిడ్ హెడ్ ఉండగా… రెండో స్థానంలో ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ కొనసాగుతున్నాడు. వీరిద్దరి కంటే 50 పాయింట్ల దూరంలో తిలక్ కొనసాగుతున్నాడు. కాగా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో ప్లేస్ లో నిలిచాడు. మరోవైపు సఫారీ టూర్ లోనే రెండు శతకాలతో దుమ్మురేపిన సంజూ శాంసన్ 17 స్థానాలు మెరుగై 22వ ర్యాంకులో నిలిచాడు.
ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఇద్దరు భారత బౌలర్లు టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నారు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఎనిమిదో ర్యాంకులో ఉండగా… పేసర్ అర్షదీప్ సింగ్ తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఓవరాల్ గా ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ అగ్రస్థానంలో ఉండగా… లంక స్పిన్నర్ హసరంగ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీమ్ ర్యాంకింగ్స్ లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా…ఆస్ట్రేలియా రెండో ర్యాంకులోనూ, ఇంగ్లాండ్ మూడో స్థానంలోనూ ఉన్నాయి.