అశ్విన్ మళ్ళీ తిప్పేస్తాడా ? కాన్పూర్ లో ఊరిస్తున్న రికార్డులు
బంగ్లాదేశ్ తో టీమిండియా రెండో టెస్ట్ శుక్రవారం నుంచి మొదలుకాబోతోంది. ఇప్పటికే ప్రాక్టీస్ లో బిజీగా ఉన్న భారత్ 2-0 తో సిరీస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకే అనుకూలించనున్న నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన మ్యాజిక్ చూపిస్తాడన్న అంచనాలు మొదలయ్యాయి.
బంగ్లాదేశ్ తో టీమిండియా రెండో టెస్ట్ శుక్రవారం నుంచి మొదలుకాబోతోంది. ఇప్పటికే ప్రాక్టీస్ లో బిజీగా ఉన్న భారత్ 2-0 తో సిరీస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకే అనుకూలించనున్న నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన మ్యాజిక్ చూపిస్తాడన్న అంచనాలు మొదలయ్యాయి. అదే సమయంలో పలు రికార్డులు యాష్ ను ఊరిస్తున్నాయి. టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్ లో వంద వికెట్లు మైలురాయికి అశ్విన్ అడుగుదూరంలో నిలిచాడు. ప్రస్తుతం 99 వికెట్లు తీసిన ఈ సీనియర్ స్పిన్నర్ మరో వికెట్ పడగొడితే నాలుగో ఇన్నింగ్స్ లో వంద వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే బంగ్లాదేశ్ పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచేందుకు కూడా అశ్విన్ చేరువలో ఉన్నాడు.
కాన్పూర్ టెస్టులో మరో మూడు వికెట్లు తీస్తే బంగ్లాపై అత్యధిక వికెట్లు తీసిన జహీర్ ఖాన్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేస్తాడు. ఇదిలా ఉంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 సైకిల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచేందుకు భారత స్పిన్నర్ చేరువయ్యాడు. మరో నాలుగు వికెట్లు తీస్తే హ్యాజిల్ వుడ్ 51 వికెట్ల రికార్డును అశ్విన్ అధిగమిస్తాడు. ఇక ఓవరాల్ గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచేందుకు అశ్విన్ మరో 8 వికెట్లు తీయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ జాబితాలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ 187 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. కాగా టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచేందుకు కూడా అశ్విన్ చేరువలో ఉన్నాడు. ఇక ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ ను 530 వికెట్ల రికార్డును అధిగమించేందుకు అశ్విన్ 9 వికెట్ల దూరంలో నిలిచాడు. కాన్పూర్ పిచ్ పై అశ్విన్ ఈ ఆరింటిలో కొన్ని రికార్డులైనా సాధిస్తాడని అంచనా వేస్తున్నారు.