గులాబీ దెబ్బ అదరాలి, భారత్ రివేంజ్ తీర్చుకునేనా ?

ఆస్ట్రేలియా టూర్ ను ఘనవిజయం ఆరంభించిన టీమిండియాకు అసలైన సవాల్ ఎదురుచూస్తోంది. సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ దానిని పెంచుకోవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా గత టూర్ లో పింక్ బాల్ టెస్ట్ భారత జట్టుకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 4, 2024 | 01:26 PMLast Updated on: Dec 04, 2024 | 1:26 PM

Team India Focus On Pink Ball Test

ఆస్ట్రేలియా టూర్ ను ఘనవిజయం ఆరంభించిన టీమిండియాకు అసలైన సవాల్ ఎదురుచూస్తోంది. సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ దానిని పెంచుకోవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా గత టూర్ లో పింక్ బాల్ టెస్ట్ భారత జట్టుకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అనూహ్యంగా 36 పరుగులకే కుప్పకూలి ఘోరపరాభవాన్ని చవిచూసింది. అయితే ఈ ఓటమి తర్వాత పుంజుకుని సిరీస్ గెలుచుకోవడం మరో ఎత్తు… కానీ ఆసీస్ గడ్డపై పింక్ బాల్ టెస్ట్ మనకు ఛాలెంజ్ గానే చెప్పాలి. 2020లో అడిలైడ్ ఓవల్‌లో భారత్ ఆస్ట్రేలియాతో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో తలపడింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసి ఆస్ట్రేలియాను 191 పరుగులకే కట్టడి చేసింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం అనూహ్యంగా 36 పరుగులకే ఆలౌట్ అయి టెస్టుల్లో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓటమి తర్వాత భారత్ అద్భుతంగా పుంజుకోవడంతో సిరీస్‌ను 2-1 తేడాతో గెలుపొందింది.

ఇప్పుడు ఆ ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. ఓవరాల్ గా డే అండ్ నైట్ టెస్టులో భారత్ రికార్డు బాగానే ఉంది. 2019లో తొలిసారి భారత్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లను ఆడటం మొదలుపెట్టింది. టీంఇండియా ఇప్పటి వరకు 4 పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. అందులో మూడింటిలో గెలిచింది. భారత్ 2019లో తొలిసారి తన తొలి పింక్ బాల్ టెస్ట్ ఆడింది. కొల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్‌లో ఫస్ట్ టైం బంగ్లాదేశ్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ అద్భుతంగా రాణించి రెండు ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో భారత్ ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో 136 పరుగులు చేసి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్ గా నిలిచాడు.

2021లో స్వదేశంలో జరిగిన మరో డే నైట్ టెస్టులో భారత్ ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది. అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ భారత స్పిన్ ధాటికి కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. అక్షర్ పటేల్ 11 వికెట్లు, అశ్విన్ 7 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తుగా ఓడింది. ఇంగ్లాండ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 112, 81 పరుగులకే ఆలౌట్ అయింది. సొంత గడ్డపై భారత స్పిన్ బలం ఏంటనేది మరోసారి ఈ మ్యాచ్ రుజువు చేసింది. 2022లో శ్రీలంకతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 238 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. తర్వాత బుమ్రా పేస్ కు లంక బ్యాటర్లు చేతులెత్తేయడంతో శ్రీలంక కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో సైతం శ్రేయస్ అయ్యర్ 67 రాణించడంతో శ్రీలంక ముందు భారత్ 447 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అశ్విన్, అక్షర్ పటేల్ స్పిన్ కు శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకే కుప్పకూలింది. అయితే ఆసీస్ టూర్ లో మాత్రం పింక్ బాల్ టెస్ట్ భారత్ కు షాకిచ్చింది. మరోవైపు ఆస్ట్రేలియా ఇప్పటి వరకు డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఆడిన 12 మ్యాచ్ లలో గెలిచి తిరుగులేని రికార్డు కొనసాగిస్తోంది. అయితే ఈ సారి వారి జైత్రయాత్రకు రోహిత్ సేన బ్రేక్ వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.