పెర్త్ లో రాడ్ దించారుగా, కంగారూలపై భారీ విజయం
ఆస్ట్రేలియా టూర్ ప్రారంభానికి ముందు భారత జట్టుపై ఎన్నో విమర్శలు.. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవమే దీనికి కారణం... ఇలాంటి పరిస్థితుల్లో ఆసీస్ కు భారత్ కనీస పోటీ ఇస్తుందా... మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచే అవకాశాలున్నాయా...
ఆస్ట్రేలియా టూర్ ప్రారంభానికి ముందు భారత జట్టుపై ఎన్నో విమర్శలు.. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవమే దీనికి కారణం… ఇలాంటి పరిస్థితుల్లో ఆసీస్ కు భారత్ కనీస పోటీ ఇస్తుందా… మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచే అవకాశాలున్నాయా… ఇలా ఎన్నెన్నో విశ్లేషణనలు…పైగా కెప్టెన్ రోహిత్ శర్మ లేడు.. గిల్ కు గాయం… షమీ కూడా జట్టుతో రాలేదు.. పైగా తొలి ఇన్నింగ్స్ లో బ్యాటర్లు చేతులెత్తేశారు.. కేవలం 150 పరుగులకే భారత్ కుప్పకూలింది….ఈ నేపథ్యంలో టీమిండియా ఘనవిజయాన్ని సాధిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. అలాంటి పరిస్థితిని తారుమారు చేస్తూ మన బౌలర్లు పెర్త్ లో ఆసీస్ కు రాడ్ దించారు. తమ బౌలింగ్ తో కంగారూలను 104 పరుగులకే పరిమితం చేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించారు..ఇక్కడ నుంచి మ్యాచ్ అంతా మనవైపే తిరిగిపోయింది.
రెండో ఇన్నింగ్స్ లో జైశ్వాల్, కోహ్లీ శతకాలతో కదంతొక్కడంతో భారత్ భారీస్కోర్ చేసింది. టెస్ట్ మ్యాచ్ ఎలా ఆడాలో అదే ఓపికను చూపిస్తూ జైశ్వాల్, రాహుల్, కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ తో చెలరేగిపోయారు. అసలు జైశ్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే… తొలి ఇన్నింగ్స్ లో డకౌటైన తర్వాత ఈ యువ ఓపెనర్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమనే చెప్పాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 సీజన్ లో పరుగుల వరద పారిస్తున్న జైశ్వాల్ ఆసీస్ గడ్డపై తొలిసారి అడుగుపెట్టి శతక్కొట్టాడు. తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ మరో సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో రాహుల్ నుంచి చక్కని సపోర్ట్ అతనికి దక్కింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో వివాదాస్పద రీతిలో ఔటైనా రాహుల్ కూడా కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ అయితే దాదాపు రెండేళ్ళ తర్వాత టెస్ట్ ఫార్మాట్ లో శతకాన్ని అందుకున్నాడు.
కోహ్లీకి ఆసీస్ గడ్డపై ఇదే చివరి సిరీస్ కానుందా అన్న అభిప్రాయాల మధ్య విరాట పర్వం మళ్ళీ మొదలైందన్న రీతిలో అతని బ్యాటింగ్ సాగింది. ఓవరాల్ గా అంతర్జాతీయ కెరీర్ లో 81వ శతకం సాధించిన కోహ్లీ ఆసీస్ గడ్డపై మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. అసలు కంగారూ పిచ్ లు అంటేనే చెలరేగిపోయే విరాట్ పెర్త్ టెస్టుతోనే ఫామ్ లోకి రావడం అటు టీమిండియా మేనేజ్ మెంట్ కే కాదు ఇటు ఫ్యాన్స్ కు కూడా మంచి కిక్ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో బౌలర్ల ప్రతిభ కీలకపాత్ర పోషించింది. ముఖ్యంగా కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకుని అద్భుతమైన పేస్ బౌలింగ్ తో జస్ప్రీత్ బూమ్రా అదరగొట్టేశాడు. ఎప్పటికప్పుడు ఆసీస్ బ్యాటర్లను ఔట్ చేస్తూ… కీలక సమయాల్లో బౌలింగ్ మార్పులు చేస్తూ కంగారూల భరతం పట్టేశాడు. ఫలితంగా పెర్త్ టెస్టులో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో భారత్ కు ఇదే అతి పెద్ద విజయం. ఐదు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ విజయం ఖచ్చితంగా భారత్ కాన్ఫిడెన్స్ పెంచుతుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.