పెర్త్ లో తొలిరోజు మనదే, దెబ్బకు దెబ్బ కొట్టిన భారత్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అదిరిపోయే ఆరంభం... పెర్త్ వేదికగా తొలి టెస్టులో మొదటిరోజు ఆసీస్ వ్యూహం బెడిసికొట్టింది. పేస్ బౌన్సీ పిచ్ పై భారత్ ను త్వరగానే ఆలౌట్ చేసినా అదే జోష్ బ్యాటింగ్ లో చూపించలేక చేతులెత్తేసింది. ఫలితంగా తొలిరోజు ముగిసేసరికి భారత్ దే పైచేయిగా నిలిచింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అదిరిపోయే ఆరంభం… పెర్త్ వేదికగా తొలి టెస్టులో మొదటిరోజు ఆసీస్ వ్యూహం బెడిసికొట్టింది. పేస్ బౌన్సీ పిచ్ పై భారత్ ను త్వరగానే ఆలౌట్ చేసినా అదే జోష్ బ్యాటింగ్ లో చూపించలేక చేతులెత్తేసింది. ఫలితంగా తొలిరోజు ముగిసేసరికి భారత్ దే పైచేయిగా నిలిచింది. మన బౌలర్లు కూడా చెలరేగిన వేళ తొలి టెస్టులో పట్టుబిగించేందుకు టీమిండియా చేరువైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఈ మ్యాచ్ లో పలు మార్పులు చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా టెస్ట్ అరంగేట్రం చేయగా… స్పిన్నర్ అశ్విన్ కాకుండా వాషింగ్టన్ సుందర్ వైపు మేనేజ్ మెంట్ మొగ్గుచూపింది. పేస్ పిచ్ పై మన టాపార్డర్ నిరాశపరిచింది. కెఎల్ రాహుల్ తప్పిస్తే జైశ్వాల్, పడిక్కల్, కోహ్లీ ఫ్లాపయ్యారు. అంచనాలు పెట్టుకున్న జైశ్వాల్ తో పాటు ఆసీస్ ఏతో సిరీస్ లో రాణించిన పడిక్కల్ డకౌటయ్యారు.
ఇక విరాట్ కోహ్లీ తన పేలవ ఫామ్ కొనసాగిస్తూ 5 పరుగులకే వెనుదిరిగాడు. అయితే కెఎల్ రాహుల్ ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. బౌన్సీ పిచ్ పై ఓపిగ్గా ఆడుతూ 26 రన్స్ చేసిన రాహుల్ వివాదాస్పద నిర్ణయంతో ఔటయ్యాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చినా రివ్యూలో థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంతో రాహుల్ వెనుదిరగక తప్పలేదు. రాహుల్ ఔట్ పై పెద్ద దుమారమే రేగింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో రాహుల్ బ్యాట్‌కి బంతి తగిలినట్టు అనిపించగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే ఆసీస్ రివ్యూ కోరడంతో థర్డ్ అంపైర్ ఫ్రంట్ యాంగిల్‌ను ఏమాత్రం పరిశీలించకుండా కేవలం స్నికో స్పైక్‌ను ఆధారంగా చేసుకుని ఔట్ గా ప్రకటించాడు. బాల్ రాహుల్ దాటేటప్పుడు అతని బ్యాట్ ప్యాడ్ కు తగలడంతో స్పైక్ లో ఆ సౌండ్ కనిపించడంతో ఔట్ గా ఇచ్చేశాడు. దీంతో నిరాశగానే రాహుల్ క్రీజును వీడాడు.
ఈ దశలో రిషబ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి కీలక పార్టనర్ షిప్ నెలకొల్పారు. వీరిద్దరూ 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ స్కోర్ 150కి చేరగలిగింది. ఈ క్రమంలో పంత్ మరోసారి ఆసీస్ బౌలర్లపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. అటు నితీశ్ రెడ్డి కూడా వేగంగా ఆడి 41 రన్స్ చేసి చివరి వికెట్ గా ఔటయ్యాడు. భారత్ 150 రన్స్ కు ఆలౌటవగా… ఆసీస్ బౌలర్లలో హ్యాజిల్ వుడ్ 4 వికెట్లు, స్టార్క్, కమ్మిన్స్, మిఛెల్ మార్ష్ రెండేసి వికెట్లు పడగొట్టారు. భారత్ ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన జోష్ లో ఉన్న కంగారూలకు బూమ్రా షాకిచ్చాడు. పేస్ పిచ్ పై తనదైన బౌలింగ్ తో చెలరేగిపోయాడు. ఆరంభంలోనే వరుస వికెట్లు తీసి కంగారూలను ఉక్కిరిబిక్కిరి చేశాడు. టెస్ట్ స్పెషలిస్ట్ ఉస్మాన్ ఖవాజాతో పాటు , నాథన్ మెక్‌స్వీనీ ,స్టీవ్‌స్మిత్ ను బూమ్రా ఔట్ చేశాడు. ఇక్కడ నుంచి ఆసీస్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఈ పరిస్థితుల్లో మార్కస్ లబూషేన్ చాలాసేపు ఆసీస్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. డిఫెన్స్ ఆడుతూ 52 బంతుల్లో కేవలం 2 పరుగులే చేసాడు. తర్వాత సిరాజ్ , హర్షిత్ రాణా ద్వయం కూడా ఆసీస్ బ్యాటర్లను గట్టిగానే ఇబ్బందిపెట్టింది. ట్రావిడ్ హెడ్ ను ఔట్ చేసి హర్షిత్ రాణా టెస్టుల్లో తొలి వికెట్ ను సాధించాడు. అటు సిరాజ్ కూడా 2 కీలక వికెట్లు తీయడంతో ఆసీస్ 67 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ క్యారీ 19 , మిచెల్ స్టార్క్ 6 పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో బూమ్రా 4 వికెట్లు తీయగా.. సిరాజ్ 2 , హర్షిత్ రాణా 1 వికెట్ పడగొట్టాడు. శనివారం తొలి సెషన్ ఆరంభంలోనే ఆస్ట్రేలియాని భారత్ జట్టు ఆలౌట్ చేయగలిగితే.. భారత్ కీలకమైన ఆధిక్యాన్ని అందుకుంటుంది. అదే సమయంలో రెండో ఇన్నింగ్స్ లో మన బ్యాటర్లు కాస్త పట్టుదలగా ఆడితే పెర్త్ టెస్టులో పూర్తిగా పట్టుబిగించొచ్చు.