పొట్టి ఫార్మాట్ లో హిట్ మిగిలిన వాటిలో ఫట్

గత ఏడాది టీమిండియాకు ఒకే ఒక్క మేజర్ విజయం దక్కింది... అమెరికా,విండీస్ వేదికగా జరిగిన టీ ట్వంటీ ప్రపంచకప్ లో రోహిత్ సేన విశ్వవిజేతగా నిలిచింది..17 ఏళ్ళ తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్ 11 ఏళ్ళ తర్వాత ఐసీసీ టోర్నీలో ఛాంపియన్ అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 2, 2025 | 12:15 PMLast Updated on: Jan 02, 2025 | 12:15 PM

Team India Won Only One Major Last Year

గత ఏడాది టీమిండియాకు ఒకే ఒక్క మేజర్ విజయం దక్కింది… అమెరికా,విండీస్ వేదికగా జరిగిన టీ ట్వంటీ ప్రపంచకప్ లో రోహిత్ సేన విశ్వవిజేతగా నిలిచింది..17 ఏళ్ళ తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్ 11 ఏళ్ళ తర్వాత ఐసీసీ టోర్నీలో ఛాంపియన్ అయింది. 2024లో మెన్ ఇన్ బ్లూకు దక్కిన అతిపెద్ద విజయం ఇదే… మెగా టోర్నీలో గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ కు గుడ్ బై చెప్పేశారు. ఓవరాల్ గా గత ఏడాది టీ ట్వంటీ ఫార్మాట్ లో భారత్ దుమ్మురేపేసింది. శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో జింబాబ్వేను టీ20 సిరీస్‌లో చిత్తు చేసింది. టీ ట్వంటీ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ షార్ట్ ఫార్మాట్ లో తన కెప్టెన్సీ కెరీర్ ను ఘనంగానే ప్రారంభించాడు. తొలిసారి శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు 3-0తో ఆతిథ్య జట్టును క్లీన్‌స్వీప్‌ చేసింది. అనంతరం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ అదరగొట్టింది.

ఆ తర్వాత సౌతాఫ్రికా గడ్డపై కూడా మన జట్టు టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే వన్డే ఫార్మాట్ లో మాత్రం 2024 భారత్ కు అత్యంత దారుణమైన అవమానాన్ని మిగిల్చింది. గతేడాది టీమిండియా ఒక్కటంటే ఒక్క వన్డే కూడా గెలవలేదు.శ్రీలంక పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో ఓ మ్యాచ్‌ను టై చేసుకున్న రోహిత్‌ సేన.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. తద్వారా దాదాపు రెండు దశాబ్దాల అనంతరం లంకతో వన్డే ద్వైపాక్షిక సిరీస్‌లో ఓటమిని చవిచూసింది. ఇలా ఓ ఏడాదిలో వన్డేల్లో భారత్‌ ఒక్కటి కూడా గెలవకపోవడం 45 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

ఇక టెస్టుల్లోనూ స్థాయికి తగినట్టు ఆడలేకపోయింది. టెస్టుల్లో ఆరంభంలో అదరగొట్టిన రోహిత్‌ సేన.. ఆ తర్వాత మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 4-1తో గెలిచిన భారత్‌.. బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అయితే, స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవాన్ని చవిచూసింది.కివీస్ చేతిలో 0-3తో వైట్‌వాష్‌కు గురైంది. సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో స్వీప్ కావడం ఇదే తొలిసారి. ఇక ఆస్ట్రేలియా పర్యటనలోనూ మన ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. పెర్త్ లో గెలిచి బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీని ఘనంగానే ఆరంభించినా తర్వాత తేలిపోయింది. అడిలైడ్‌లో ఓడి.. బ్రిస్బేన్‌ టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో ఓటమితో 2024ను ముగించిన టీమిండియా కొత్త ఏడాదిని విజయంతో ఆరంభిస్తుందో లేదో చూడాలి.