AP Bhavan Bifurcation: ఏపీ భవన్ వివాదం తేలేనా? తెలంగాణకా.. ఏపీకా? ఏపీ.. ఇది కూడా వదిలేస్తుందా?
విభజన చట్టం ప్రకారం తెలంగాణకు, ఏపీకి జనాభా ప్రకారం వాటా ఉంటుంది. ఏపీ భవన్‌ను వాటాకు అనుగుణంగా రెండు రాష్ట్రాలు పంచుకోవాలి. దీనికి ఏపీ సిద్ధంగా ఉంటే.. తెలంగాణ అడ్డుచెబుతోంది. దీన్ని నిజాం రాజు నిర్మించారని, ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి కాబట్టి, ఇదంతా తమదే అంటోంది.
AP Bhavan Bifurcation: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డప్పటికీ అనేక అంశాల్లో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తొమ్మిదేళ్ల నుంచి నానుతున్న మరో అంశం ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన. ఇది ఉమ్మడి ఏపీ తరఫున దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రానికి అధికారిక భవనంగా ఉండేది. తర్వాత రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఇప్పుడిది ఎవరికి చెందాలన్నదే అసలు సమస్య. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు, ఏపీకి జనాభా ప్రకారం వాటా ఉంటుంది. ఏపీ భవన్‌ను వాటాకు అనుగుణంగా రెండు రాష్ట్రాలు పంచుకోవాలి. దీనికి ఏపీ సిద్ధంగా ఉంటే.. తెలంగాణ అడ్డుచెబుతోంది. దీన్ని నిజాం రాజు నిర్మించారని, ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి కాబట్టి, ఇదంతా తమదే అంటోంది. ఈ ప్రతిపాదనకు ఏపీ అంగీకరించడం లేదు. దీంతో తొమ్మిదేళ్లుగా ఎటూ తేలకుండా వివాదం కొనసాగుతోంది.
ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర, ఏపీ భవన్ మొత్తం 19.7 ఎకరాల స్థలంలో ఏర్పాటై ఉంది. దీని విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఒకప్పుడు ఉమ్మడి ఏపీ అధికారిక భవనంగా ఉండగా, విభజన తర్వాత రెండు రాష్ట్రాలూ పంచుకున్నాయి. ఒకే భవనంలో తెలంగాణ, ఏపీ అధికారిక కేంద్రాలు కొనసాగుతున్నాయి. కానీ, రెండు రాష్ట్రాలకు ఆస్తుల పంపకం జరగాల్సి ఉంది. ఈ లెక్కన విభజన చట్టం, సెక్షన్ 66 ప్రకారం ఏపీ, తెలంగాణకు 58:42 నిష్పత్తిలో ఢిల్లీ భవన్ కేటాయించాలి. ఈ నిష్పత్తి ప్రకారం ఏపీకి 11.3 ఎకరాలు, తెలంగాణకు 8.4 ఎకరాలు దక్కాలి. అయితే, ఏపీ భవన్‌లోని వాటాను ఏపీకి ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. మొత్తం తెలంగాణకే ఇచ్చేయాలని డిమాండ్ చేస్తోంది. అవసరమైతే వేరే చోట స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. దీనికి ఏపీ ఒప్పుకోవడం లేదు. దీంతో ఈ అంశం ఏళ్లుగా ఎటూ తేలకుండా ఉంది. చివరకు కేంద్రం అనేకసార్లు ఇరు రాష్ట్రాలతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది.
ఏపీ ఇచ్చేస్తుందా?
తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఏపీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేదానిపైనే ఏపీ భవన్ అంశం ఆధారపడి ఉంది. తెలంగాణ ప్రతిపాదన విషయంలో తాజాగా ఏపీ వైఖరి మారినట్లే కనిపిస్తోంది. బుధవారం నాటి చర్చల తర్వాత తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించాల్సింది పోయి.. సీఎంతో మాట్లాడి చెబుతామని ఏపీ అధికారులు తెలిపారు. మరో వారంలో ఇంకో సమావేశం జరగనుంది. ఈ లోపు సీఎం జగన్ దీనిపై నిర్ణయం తీసుకోవాలి. అయితే, తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకించకపోవడంతోనే ఏపీ ఈ విషయంలో ఒక అడుగు వెనక్కు వేసినట్లు తెలుస్తోంది. అంటే వచ్చే వారం జరిగే సమావేశంలో తెలంగాణ ప్రతిపాదనకు ఏపీ అంగీకరిస్తుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏపీ భవన్‌ను పూర్తిగా తెలంగాణకే ఇచ్చేస్తుందా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే జరిగితే ఏపీకి మరోసారి నష్టం జరిగినట్లే. ఎందుకంటే హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అయినప్పటికీ, ఏపీ దీన్ని వినియోగించుకోలేదు. ఇక విద్యుత్ బకాయిలు, నీటి కేటాయింపులు వంటి అంశాలూ తేలాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ భవన్ కోల్పోతే ఏపీకి నష్టమే. ఇది జగన్ వైఫల్యానికి మరో నిదర్శనంగా నిలుస్తుంది. ఈ విషయంలో ఏపీ ఏం చేస్తుందో మరో వారం తర్వాత తేలుతుంది.