Raja Singh: రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత.. గోషామహల్ బీజేపీ అభ్యర్థి ఆయనే!
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సరికొత్త విధానాలతో ముందుకు సాగుతోంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై గతంలో వేసిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ బీజేపీ డిసిప్లినరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. మరోసారి అదే నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది.

Telangana appointed Rajasingh as Goshamahal BJP candidate and revoked his suspension
రాజాసింగ్ గోషామహల్ నుంచి గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గతేడాది ఆగస్టులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని కారణంగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పార్టీ ఆదేశించింది. అయితే తాజాగా తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థి ఎవరా అన్న అనుమానం అందరిలో రేకెత్తింది. అయితే కేంద్ర క్రమశిక్షణా సంఘం ఆయనపై వేసిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఓం పాఠక్ ప్రకటించారు.దీంతో తెలంగాణ ఎన్నికల బరిలో దిగేందుకు ఆయనకు భారీ ఊరట లభించినట్లు అయింది. తొలి జాబితాలో ఈయన పేరును ఖచ్చితంగా వెల్లడించే అవకాశం ఉంది.
రాజాసింగ్ స్పందన..
బీజేపీ పెద్దలు ఈయనపై సస్పెన్షన్ ను తొలగించి తిరిగి ఎన్నికల బరిలో దిగేందుకు అవకాశం కల్పించినందుకు తనదైన శైలిలో స్పందించారు రాజా సింగ్. ‘నా సస్పెన్షన్ ను రద్దు చేసినందుకు ముందుగా.. గౌరవనీయులైన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ జీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జీ, హోంమంత్రి అమిత్ షా జీ, ఆర్గనైజేషన్ సెక్రటరీ శ్రీ బీఎల్ సంతోష్ జీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి జీ, ఓబీసీ మోర్చా సభ్యులు జాతీయ అధ్యక్షుడు శ్రీ డా. లక్ష్మణ్ జీ, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ జీ మరియు మురళీధర్ రావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ తెలిపారు.
T.V.SRIKAR